File image Telangana's richest lawmaker Vishweshwar Reddy | (Photo Credits: PTI)

Hyderabad, Mar 16: టీఆర్ఎస్ పార్టీ దెబ్బకు తెలంగాణలో కుదేలవుతున్న కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. మాజీ చేవెళ్ల ఎంపీ, వ్యాపారవేత్త కొండా విశ్వేశ్వర్ రెడ్డి (Former Chevella MP Konda Vishweshwar Reddy) ఆ పార్టీకి రాజీనామా చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. టీపీసీసీ మాజీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డికి ఫోన్‌ చేసి పార్టీకి రాజీనామా చేసిన విషయాన్ని తెలిపారు. ఏఐసీసీ నుంచి రాష్ట్ర నాయకత్వం వరకూ ప్రభుత్వంతో అమీతుమీ పోరాటం చేయట్లేదన్న అసంతృప్తితోనే ఆయన ( Konda Vishweshwar Reddy) రాజీనామా చేసినట్లుగా చెబుతున్నారు.

అయితే మూడు నెలల పాటు రాజకీయాలకు దూరంగా ఉండాలని ఆయన నిర్ణయించుకోవడం గమనార్హం. ఆదివారం జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరఫున ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఓటు కూడా వినియోగించుకున్నారు. మరుసటి రోజే ఆయన రాజీనామా (Vishweshwar Reddy Quits Congress) చేయడం గమనార్హం.

కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి చేవెళ్ల ఎంపీగా పని చేశారు. 2019 ఎన్నికల్లో కూడా చేవెళ్ల ఎంపీగా పోటీ చేసి పరాజయం పొందారు. అయితే ఆయన బీజేపీలో చేరనున్నారని ఊహగానాలు వినిపిస్తున్నాయి. అయితే చేవెళ్ల టికెట్‌పై హామీ రావడంతోనే ఆయన కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పేశారని వార్తలు వినిపిస్తున్నాయి.

హైదరాబాద్ మందుబాబులా మజాకా.. ట్రాఫిక్ పోలీసులకు రూ.78.94 లక్షలు జరిమానా కింద చెల్లించారు, మీడియాకు వివరాలను వెల్లడించిన ట్రాఫిక్‌ చీఫ్‌ అనిల్‌కుమార్‌

పారిశ్రామికవేత్తగా ఉన్న కొండా విశ్వేశ్వర్‌రెడ్డిని టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ 2013లో రాజకీయాల్లోకి ఆహ్వానించారు. అనంతరం 2014 ఎన్నికల్లో చేవెళ్ల లోక్‌సభ సభ్యుడిగా టీఆర్‌ఎస్‌ నుంచి గెలిచారు. అయితే 2018లో అకస్మాత్తుగా గులాబీ పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరారు. కొండా కుటుంబానికి గొప్ప పలుకుబడి ఉంది. కొండా దేశంలోనే అత్యంత సంపన్న రాజకీయ నాయకుడిగా గుర్తింపు పొందారు. అమెరికా పౌరసత్వం ఉండి ఎంపీగా పని చేసిన వ్యక్తిగా రికార్డులకెక్కారు.

Here's KV Reddy Tweet

తన రాజకీయ భవిష్యత్తుకు సంబంధించి పలు ఆలోచనలు ఉన్నాయని, కాంగ్రెస్‌ పార్టీలోనే ఉండి వాటిపై కసరత్తు చేయడమూ సరైంది కాదన్న భావనలో పార్టీకి రాజీనామా చేసినట్లు సన్నిహితులకు ఆయన చెబుతున్నారు. అలాగే పార్టీ బలోపేతం కోసం ఏఐసీసీ నాయకత్వానికి తాను సూచించిన సిక్స్‌ పాయింట్‌ ఫార్ములా అమలుకూ ఆసక్తి చూపవ పోవడం పట్లా అసహనంతో ఉన్నట్లు చెబుతున్నారు.

కెవి రెడ్డి అపోలో గ్రూప్ డాక్టర్ సంగీత రెడ్డి భర్త. మహారాష్ట్ర మరియు ఆంధ్రప్రదేశ్ మాజీ ప్రధాన న్యాయమూర్తి కొండా మాధవ్ రెడ్డి కుమారుడు. ఈయన తాత కొండ వెంకట రంగా రెడ్డి ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు. 1959 నుండి 1962 వరకు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు. తెలంగాణలో రజాకార్లతో పోరాడారు. అనంతరం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కీలక రాజకీయ నాయకుడిగా ఎదిగారు. ఆయన పేరు మీదుగానే రంగారెడ్డి జిల్లా ఆవిర్భవించింది.