Nayani Health Update: విషమంగా నాయిని నరసింహారెడ్డి ఆరోగ్యం, ఊపిరితిత్తులకు ఇన్‌ఫెక్షన్‌ అయి న్యుమోనియా సోకిందని వెల్లడించిన డాక్టర్లు, అపోలోలో వెంటిలేటర్‌పై చికిత్స
Former Telangana Home Minister Nayani Narasimha Reddy (Photo-FacebooK)

Hyderabad, Oct 16: తెలంగాణ రాష్ట్ర మాజీ హోం శాఖ మంత్రి నాయిని నరసింహారెడ్డి ఆరోగ్యం (Nayani Narasimha Reddy Health Update) విషమించినట్లుగా వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఆయన జూబ్లీహిల్స్‌ అపోలో ఆసుపత్రిలోని అడ్వాన్స్‌డ్‌ క్రిటికల్‌ కేర్‌ యూనిట్‌లో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారు. గత నెల 28వ తేదీన మాజీ హోం మంత్రి నాయిని (Former Telangana Home Minister) కరోనా బారినపడిన విషయం విదితమే. బంజారాహిల్స్‌లోని సిటీ న్యూరో సెంటర్‌ ఆసుపత్రిలో చేరి 16 రోజులు చికిత్స పొందారు. కాగా వారం రోజుల క్రితం కరోనా పరీక్షలు నిర్వహించగా నెగెటివ్‌ వచ్చింది.

అయితే ఢిశ్చార్జ్ అవుతారనుకున్న సమయంలో ఒక్కసారిగా ఊపిరి తీసుకోవడమే కష్టంగా మారింది. దీంతో పరీక్షలు నిర్వహించగా ఊపిరితిత్తులకు ఇన్‌ఫెక్షన్‌ అయి న్యుమోనియా సోకిందని డాక్టర్లు తేల్చారు. దీంతో నాయిని ఆక్సిజన్‌ లెవల్స్‌ పడిపోయాయి. కుటుంబ సభ్యులు మంగళవారం ఆయనను హుటాహుటిన అపోలో ఆసుపత్రికి తరలించారు. అక్కడ పల్మనాలజీ స్పెషలిస్ట్‌ డాక్టర్‌ సునీతారెడ్డి, కిడ్నీ స్పెషలిస్టు డాక్టర్‌ రవి ఆండ్రూస్, మరో డాక్టర్‌ కె.వి. సుబ్బారెడ్డిల పర్యవేక్షణలో అత్యవసర చికిత్స అందిస్తున్నారు.

కరోనా వ్యాక్సిన్‌పై చిగురిస్తున్న ఆశలు, రష్యా నుంచి రెండవ వ్యాక్సిన్, చైనా వ్యాక్సిన్ సానుకూల ఫలితాలు, దేశంలో తాజాగా 63,371మందికి కోవిడ్-19, బ్లడ్‌ గ్రూప్‌ O ఉన్నవారు సేఫ్ అంటున్న శాస్త్రవేత్తలు

నాయిని భార్య అహల్యకు కూడా కరోనా సోకింది. నాయిని అల్లుడు, రాంనగర్‌ డివిజన్‌ కార్పొరేటర్‌ వి.శ్రీనివాస్‌రెడ్డి, ఆయన పెద్ద కుమారుడు కూడా కరోనా బారిన పడి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. నాయిన భార్య ప్రస్తుతం బంజారాహిల్స్‌లోని సిటీ న్యూరో సెంటర్‌లో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆమెకు పరీక్షలో నెగెటివ్‌ వచ్చినప్పటికీ ఆసుపత్రిలోనే ఉండి మెరుగైన చికిత్స తీసుకుంటున్నారు.

లాక్‌డౌన్‌ సమయంలో ఇంటికే పరిమితమైన నాయిని నరసింహారెడ్డి ఇటీవల ముషీరాబాద్‌లో జరిగిన కొండాలక్ష్మణ్‌ బాపూజీ జయంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే ఓ మతపెద్ద ఇంటి ప్రహరీ గోడ కూలిన సమయంలో పరామర్శించేందుకు వెళ్లారు. దానికి తోడు ఓ మతపెద్ద సన్మాన కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు. ఇక్కడే ఎక్కడో నాయినికి కరోనా సోకి ఉంటుందని కుటుంబ సభ్యులు భావిస్తున్నారు.