Warangal Road Accident: ఇంటర్ పాసైన ఆనందంలో పార్టీ, ఒకే బైక్‌పై వస్తుండగా బస్సు ఢీకొని నలుగురు స్నేహితులు మృతి, వరంగల్‌లో విషాదకర ఘటన
Peru Road Accident Accident Representative Image

Warangal, April 25: వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై గత రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు ఇంటర్మీడియట్ విద్యార్థులు దుర్మరణం పాలయ్యారు. ముగ్గురు యువకులు స్పాట్‌లోనే చనిపోగా మరో యువకున్ని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. ఈ హృదయ విదారకఘటన వర్ధన్నపేట మండలం ఇల్లంద శివారు వరంగల్ ఖమ్మం జాతీయ రహదారిపై జరిగింది.

వర్ధన్నపేట నుండి వరంగల్ వైపు వెళ్తున్న ఓ ప్రైవేటు ట్రావెల్ బస్సును ఇల్లందు నుంచి వర్ధన్నపేట వైపు వస్తున్న ద్విచక్రవాహనం పరస్పరం ఢీకొన్నాయి. ఈ ఘటనలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతిచెందగా. మరో యువకుడు వరంగల్ ఎంజిఎం ఆసుపత్రికి తరలించగా మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతులు వరుణ్ తేజ(18), సిద్దు(18),గణేష్(18), రనిల్ కుమార్(18) లుగా పోలీసులు గుర్తించారు.  కోదాడలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆగివున్న లారీని ఢీకొన్న కారు.. ఆరుగురు మృతి

నలుగురు యువకులు స్నేహితులు కాగా, ప్రమాద సమయంలో ఒక్క ద్విచక్ర వాహనంపై ప్రయాణించారు. మృతులు వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామానికి చెందినవారు కాగా యువకుల మృతితో వారి కుటుంబ సభ్యుల రోదన వర్ణనాతీతంగా మారగా ఇల్లంద గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని విచారణ చేపట్టారు.

నిన్న వెల్లడైన ఇంటర్ ఫలితాల్లో పాసైన గణేశ్.. తన ముగ్గురు స్నేహితులతో కలిసి సాయంత్రం పార్టీ చేసుకుని తిరిగి ఒకే బైక్‌పై ఇంటికి వస్తుండగా ఈ ఘటన జరిగింది.కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బైక్, బస్సు రెండూ అతివేగంగా వెళ్తుండడమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు.