Hyd, Dec 8: తెలంగాణలో మహిళలు రేపటి మధ్యాహ్నం నుంచి ఆర్టీసీ బస్సు (TSRTC) ల్లో ఉచితంగా ప్రయాణించ వచ్చని టీఎస్‌ఆర్టీసీ సీఎండీ సజ్జనార్ తెలిపారు.రాష్ట్రంలో మహిళల ఉచిత బస్సు ప్రయాణం పథకానికి సంబంధించిన మార్గదర్శకాలను ఆర్టీసీ ఎండీ సజ్జనార్ వెల్లడించారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. శనివారం మధ్యాహ్నం ఒంటిగంటకు అసెంబ్లీ వద్ద సీఎం రేవంత్ రెడ్డి ‘మహాలక్ష్మీ స్కీమ్’ను ప్రారంభిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళా మంత్రులు ఎమ్మెల్యేలు పాల్గొంటారని చెప్పారు.
మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తామని అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో మహాలక్ష్మి పథకం ఒకటి. అయితే, పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణానికి అవకాశం కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. మహిళా ప్రయాణికుల ఛార్జి మొత్తాన్ని ఆర్టీసీకి రాష్ట్ర ప్రభుత్వం చెల్లించనుంది. రాష్ట్రంలో బాలికలు, మహిళలు, ట్రాన్స్ జెండర్లు ఉచిత ప్రయాణం చేయవచ్చు.
రేపు మధ్యాహ్నం నుంచి మహిళలకు టీఎస్ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, జీవో జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం
రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఫ్రీగా జీరో అమౌంట్ టికెట్‌తో ప్రయాణించవచ్చని సజ్జనార్ తెలిపారు. ఆధార్ లేదా ఏదైనా గుర్తింపు కార్డు చూపించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. నాలుగైదు రోజులు గుర్తింపు కార్డు లేకుండా ప్రయాణించవచ్చుని తెలిపారు. ప్రయాణీకుల సంక్షేమం కోసం ఆర్టీసీ యాజమాన్యం కృషి చేస్తోందని అన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళలకు ఫ్రీ ప్రయాణం మంచి స్కీమ్ అని కొనియాడారు. స్కీమ్‌తో ఆర్టీసీకి ఆదరణ మరింత పెరుగుతోందని చెప్పారు.
ప్రస్తుతం రోజుకు 40 లక్షల మంది ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తారని వెల్లడించారు. ప్రజలు ఎక్కడ ఇబ్బంది పడకుండా ఏర్పాట్లు చేశామని అన్నారు. ప్రస్తుతం 7290 బస్సులు ఉన్నాయని, రోజు ఆదాయం 14 కోట్ల వరకు వస్తోందని తెలిపారు. మహిళలకు ఫ్రీ ప్రయాణంతో 50 శాతం ఆదాయం తగ్గుతుందని పేర్కొన్నారు. తగ్గే ఆదాయంపై ప్రభుత్వ సహాయంకై విజ్ఞప్తి చేశామని చెప్పారు.
ప్రయాణ సమయంలో మహిళా ప్రయాణికులకు జీరో టికెట్ ఇస్తాం. 5.. 6 రోజుల తర్వాత ఎలక్ట్రానిక్ మిషన్ ద్వారా జీరో టికెట్ ప్రింటింగ్ చేస్తాం. కొన్ని రోజులు గడిచిన తర్వాత దీనిపై సమీక్షించి.. ప్రయాణీకుల రద్దీకి అనుగుణంగా బస్సుల సంఖ్య పెంచుతాం. ప్రస్తుతం 7,200 సర్వీసులను మహాలక్ష్మి పథకం కోసం ఉపయోగిస్తాం’’ అని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు.
ఈ పథకం ద్వారా ప్రజా రవాణాకు మేలు జరుగుతుంది. మహిళా సాధికారతకు దోహద పడుతుంది. కొవిడ్ తర్వాత దేశ వ్యాప్తంగా ప్రైవేటు వాహనాల సంఖ్య పెరిగింది. దీని వల్ల ఆర్టీసీపై తీవ్ర ప్రభావం పడింది. పెరుగుతున్న వాహనాల వల్ల రోడ్డు ప్రమాదాలు, కాలష్యం పెరుగుతోంది. ఉచిత బస్సు ప్రయాణం పథకం వల్ల మహిళలకు రక్షణ ఉంటుంది. ట్రాఫిక్ సమస్య తగ్గుతుందన్నారు.