Car catches fire in Ghatkesar (Photo-Video Grab)

Hyd, Jan 7: ఈ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. కేసు ఇన్విస్టిగేట్ చేస్తున్న ఇన్‌స్పెక్టర్‌ పరశురాం, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్‌పోచంపల్లి మండలం పిలాయిపల్లి గ్రామానికి చెందిన పర్వతం అంజయ్య కుమారుడు పర్వతం శ్రీరామ్‌ (25) మేడ్చల్‌ జిల్లా పోచారం మున్సిపాలిటీ నారపల్లి సమీపంలో సైకిల్‌ దుకాణం నడుపుతున్నాడు.

పక్కనే ఉన్న చౌదరిగూడకు చెందిన ఇంటర్‌ చదివే ఓ మైనర్‌ బాలికను శ్రీరామ్‌ ప్రేమించాడు.ఇద్దరివీ వేర్వేరు కులాలు. వీరి ప్రేమ వ్యవహారం గురించి బాలిక కుటుంబ సభ్యులకు తెలియడంతో పలుమార్లు మందలించి ఆమెపై చేయిచేసుకున్నారు. ఇలా గొడవలు జరుగుతున్నా.. ప్రేమజంట అప్పుడప్పుడూ మాట్లాడుకునేవారు. ఈ క్రమంలో బాలిక సమీప బంధువు చింటూ.. వీరి ప్రేమ గురించి తెలుసుకుని బ్లాక్‌మెయిల్‌ చేసేవాడు.

వీడియో ఇదిగో, ఘట్‌కేసర్ వద్ద కారులో మంటలు, బయటకు వచ్చే అవకాశం లేక ఇద్దరు సజీవ దహనం

శ్రీరామ్‌తో ప్రేమ విషయం తల్లిదండ్రులకు చెబుతానని బాలిక దగ్గరి బంధువు, అన్న వరుసైన చింటు (22) బ్లాక్‌మెయిల్‌ చేసి వీరివద్ద రూ. 1,35,000 తీసుకున్నాడు. ఇంకా డబ్బు ఇవ్వాలని కాలేజ్‌ దగ్గరికి వెళ్లి బాలికను వేధించడమే కాకుండా, బంగారు ఉంగరం ఇవ్వాలని కోరాడు. చింటు వేధింపులు ఎక్కువ కావడంతో మనస్తాపం చెందిన విద్యార్థిని, చివరికి ప్రియుడికి విషయం తెలిపింది. అదే విధంగా కులాంతర వివాహానికి ఇంట్లో పెద్దలు ఒప్పుకోరని, ప్రేమ ఓడిపోవద్దని వారం కిందటే వారిద్దరు మరణించాలని నిర్ణయించుకున్నారు.

శ్రీరాములు సోమవారం మేడిపల్లిలోని ఓ సెల్ఫ్‌డ్రైవ్‌ సంస్థ నుంచి కారు అద్దెకు తీసుకున్నాడు.ఇద్దరూ కలిసి ఆ కారులో ఘట్‌కేసర్‌ ఠాణా పరిధి ఘన్‌పూర్‌లోని ఓఆర్‌ఆర్‌ సర్వీస్‌ రోడ్డు పక్కన కారు ఆపారు. వెంట తెచ్చుకున్న పెట్రోలు మీద పోసుకొని ఒంటికి నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు ప్రాథమికంగా చెబుతున్నారు.

కారులో మంటలు భరించలేక శ్రీరాములు బయటకొచ్చి గట్టిగా హాహాకారాలు చేస్తూ ఫుట్‌పాత్‌ మీద పడి మృతి చెందాడు. బాలిక కారులోనే చిక్కుకుపోవడంతో శరీరం మొత్తం ఏ మాత్రం గుర్తించలేనంతగా కాలిపోయింది. సాయంత్రం 6.30 గంటల సమయంలో ఈ ఘటన జరగ్గా.. అటుగా వెళ్తున్న వాహనదారులు కొందరు గుర్తించి పోలీసులు, అగ్నిమాపకశాఖకు సమాచారం ఇచ్చారు.

సెల్ఫ్‌డ్రైవ్‌ సంస్థ ప్రతినిధులు ఘటనాస్థలికి చేరుకుని.. శ్రీరాములు కారు అద్దెకు తీసుకున్న వివరాలు పోలీసులకు చెప్పారు. అందులో ఉన్న సెల్‌ఫోన్‌ నంబరు ఆధారంగా మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కొన్నిరోజుల క్రితం తమ అబ్బాయి ప్రేమ విషయం తమతో చెప్పాడని, ఘటనకు కొన్ని నిమిషాల ముందు ఆత్మహత్య లేఖను తమకు పంపాడంటూ ఓ లేఖను శ్రీరాములు తల్లిదండ్రులు చూపించారు. పోలీసులు మరిన్ని ఆధారాలు సేకరించేందుకు కారులోని నమూనాలను ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు.. ఇద్దరి మృతదేహాలను గాంధీ ఆసుపత్రికి తరలించారు. మల్కాజ్‌గిరి ఏసీపీ చక్రపాణి ఘటన స్థలాన్ని సందర్శించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.