Hyderabad. Mar 31: కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో తెలంగాణలో పెద్ద సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో మహమ్మారి కట్టడి కోసం జీహెచ్ఎంసీ గట్టి చర్యలు చేపట్టింది. మరోసారి నగరంలో (Corona Hot Spots in Hyd) కంటైన్మెంట్ జోన్లను ఏర్పాటు చేసే యోచనలో అధికారులు ఉన్నారు. నగరంలో ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలంటూ ప్రజల్లో అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు, జీహెచ్ఎంసీ పరిధిలోని కూకట్ పల్లి, జీడిమెట్ల, శేరిలింగంపల్లి, హిమాయత్ నగర్, చింతల్ బస్తీ, మలక్ పేట్, చాంద్రాయణగుట్ట, ఎల్బీనగర్ లను అధికారులు హాట్ స్పాట్స్ గా (Corona hot spots in Hyderabad) ప్రకటించారు. ఈ ప్రాంతాల్లో ఉన్నవారు మరింత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
యాదాద్రి క్షేత్రంలో మంగళవారం మరో 24 మందికి పాజిటివ్ వచ్చింది. వీరిలో గుట్టపైన హోటల్‌లో పనిచేసేవారు నలుగురు ఉన్నారు. దీంతో దేవస్థాన అధికారులు హోటల్‌ను మూసివేయించారు. పరిసరాలను శానిటైజ్ చేయించారు. ఈ నెల 25 నుంచి 29వ తేదీ వరకు 117 మంది దేవస్థాన, కాంట్రాక్టు సిబ్బంది, స్థానికులకు వైరస్ నిర్ధారణ అయింది. తాజా కేసులతో కలిపి మొత్తం పాజిటివ్‌ల సంఖ్య 141కి చేరింది. ఈ నేపథ్యంలో స్వామివారికి మరో నాలుగు రోజులు ఏకాంత సేవలనే నిర్వహించనున్నారు. భక్తులకు బాలాలయంలోని కవచమూర్తుల లఘు దర్శన సౌకర్యం కల్పిస్తున్నట్టు ఈవో గీతారెడ్డి ప్రకటించారు. కరోనా కేసులు పెరుగుతుండటంతో గుట్టలోని వ్యాపారులు మంగళవారం స్వచ్ఛందంగా బంద్ పాటించారు.
తెలంగానలో గత 24 గంటల్లో కొత్తగా 684 కరోనా కేసులు నమోదు కాగా.. ముగ్గురు మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు తెలంగాణలో నమోదైన పాజిటీవ్ కేసుల సంఖ్య 3,07,889కి చేరగా.. 1697 మంది మరణించారు. కాగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం 4,665 యాక్టివ్ కేసులు ఉండగా, చికిత్స నుంచి కోలుకుని 3,01,227 లక్షల మంది డిశ్చార్జ్ అయినట్లు రాష్ట్ర ఆరోగ్యశాఖ అధికారులు గురువారం ఉదయం ఈ మేరకు బులిటెన్ విడుదల చేశారు. కొత్తగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 184 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో 1,873 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. కాగా తెలంగాణలో నిన్న 56,122 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు.