Hyderabad's old city during COVID19 lockdown | File Photo

Hyderabad, May 19: తెలంగాణ రాష్ట్రంలో అమల్లో ఉన్న లాక్ డౌన్ ను ఈ నెల 30వ తేదీ వరకు పొడిగించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఇందుకోసం మంత్రులందరితో ఫోన్లో మాట్లాడి వారి అభిప్రాయాలను సీఎం తెలుసుకున్నారు. క్యాబినెట్ మంత్రులందరి అభిప్రాయాలను సేకరించి లాక్ డౌన్ ను మే 30 వరకు పొడిగించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన జీవోను విడుదల చేయాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ను సీఎం ఆదేశించారు. కరోనా నియంత్రణా కార్యక్రమాలు మరియు వైద్య సేవల పర్యవేక్షణలో భాగంగా మంత్రులు జిల్లాల్లో క్షేత్రస్థాయిలో బిజీగా ఉన్నందున ఈ నెల 20న నిర్వహించాల్సి ఉన్న రాష్ట్ర క్యాబినెట్ సమావేశాన్ని కూడా సీఎం రద్దు చేశారు.

లాక్‌డౌన్ నిబంధనల్లో ఎలాంటి మార్పులు లేవు. ఇప్పుడున్న మాదిరిగానే ఉదయం 6 నుంచి 10 వరకు సడలింపు ఉంటుంది. ఉదయం 10 తర్వాత యధావిధిగా లాక్ డౌన్ ఆంక్షలు అమలులో ఉంటాయని సీఎంఓ స్పష్టం చేసింది. ప్రజలు లాక్ డౌన్ సడలింపులను దుర్వినియోగం చేయవద్దని. అవసరాల మేరకే సడలింపులను వినియోగించుకోవాలని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి.

Here's the update from CMO

ఇదిలా ఉంటే నిన్న తెలంగాణలో 3,982 పాజిటివ్ కేసులు, 27 కోవిడ్ మరణాలు నమోదయ్యాయి, దీంతో రాష్ట్రంలో మొత్తం COVID-19 బాధితుల సంఖ్య 5,36,766కి చేరుకుంది. కరోనా మరణాల సంఖ్య 3012కు పెరిగింది. అలాగే రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 4,85,644 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 48,110 మంది ఆసుపత్రుల్లో మరియు ఐసోలేషన్లో చికిత్స పొందుతున్నారు.