Hyd, Jan 19: తెలంగాణలో రైతుల ఆత్మహత్యలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు మాజీ మంత్రి హరీశ్ రావు. రైతులు దేశానికి వెన్నెముక.. అలాంటి రైతుల జీవితాలతో చెలగాటం కాంగ్రెస్ సర్కారు చెలగాటం ఆడుతుందని మండిపడ్డారు. 24 గంటలు గడవకముందే రుణభారంతో ఆదిలాబాద్‌లో మరో రైతు రాథోడ్ గోకుల్ ఆత్మహత్య చేసుకోవడం తీవ్రంగా కలచివేసిందన్నారు.
రుణమాఫీ పూర్తి చేశామని చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, బ్యాంకుల వేధింపులతో ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతుల చావులు కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. దేశానికి అన్నం పెట్టే రైతన్న ఉసురు ఎందుకు తీస్తున్నారు అని సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు.
రైతుల ఆత్మహత్యలు ముమ్మాటికి ప్రభుత్వ హత్యలే...దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి అన్నారు. రైతులకు భరోసా కల్పించడంలో కాంగ్రెస్ సర్కారు పూర్తిగా విఫలమైంది, వరుసగా జరుగుతున్న రైతుల ఆత్మహత్యలే దానికి నిదర్శనం అన్నారు. మీ ఏడాది పాలనలో ఇప్పటి వరకు 𝟒𝟎𝟐 మంది రైతులు ప్రాణాలు కోల్పోయారు...ఇంత జరుగుతుంటే ప్రభుత్వం మొద్దు నిద్ర నటిస్తుండటం దుర్మార్గం అని దుయ్యబట్టారు.
కేసీఆర్ వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చితే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవసాయాన్ని సంక్షోభంలోకి నెట్టాడు అన్నారు. గతంలో రుణమాఫీ కాలేదని, అదిలాబాద్ జిల్లా తలమడుగులో నిరసన తెలియజేస్తున్న రైతులను అరెస్టు చేసి, పోలీస్ యాక్ట్ (30 Act) పేరుతో జిల్లాలో నిరసనలు, ఆందోళనలు చేయొద్దని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. ప్రశ్నించే గొంతులను అణగదొక్కారు అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటనలో కీలక ఒప్పందం.. రూ.450 కోట్లతో క్యాపిటాల్యాండ్ హైదరాబాద్‌లో కొత్త ఐటీ పార్క్
రుణమాఫీ జరగకపోవడం తో రైతులు కలెక్టరేట్లు, వ్యవసాయ కార్యాలయాలు, బ్యాంకుల చుట్టూ తిరుగుతూ విసిగి పోతున్నారు. ఉన్న భూములు కుదవ పెట్టి అప్పులు తెస్తున్నరు. ఆ అప్పులు చెల్లించలేక చివరికి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అన్నారు.
రుణమాఫీ అని మభ్య పెట్టి..500 బోనస్ అని మోసం చేసి.. పెట్టుబడి సాయన్ని ఎగ్గొట్టడం వల్లే రైతులకు ఈ దురవస్థ రైతుల పాలిట శాపంగా మారింది...ఎద్దు ఏడ్చిన ఎవుసం, రైతు ఏడ్చిన రాజ్యం ఏనాడూ బాగుపడలేదన్న విషయం, కాంగ్రెస్ పాలకులు పూర్తిగా మరిచిపోయినట్లున్నారు అని మండిపడ్డారు. రైతు సోదరులారా దయచేసి ఆత్మహత్యలు చేసుకోకండి..ఆత్మహత్యలు పరిష్కారం కాదు. బిఆర్ఎస్ పార్టీ మీకు అండగా ఉంటుందన్నారు. కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినట్లుగా అందరికీ రుణమాఫీ, రైతు భరోసా, అన్ని పంటలకు 500 బోనస్ హామీలు అమలు చేసే దాకా నిలదీస్తూనే ఉంటాం అని ప్రశ్నించారు.