A view of a flooded street at Himayat Nagar (photo-PTI)

Hyd ,  Oct 10: గ్రేటర్‌ హైదరాబాద్‌లో కుండపోత వర్షం కురిసింది. శుక్రవారం రాత్రి నుంచి శనివారం రాత్రి వరకు 23 సెంటీమీటర్ల వర్షపాతం (Telangana Rains) నమోదైంది. రహదారులు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. నాలాలు, చెరువులు పొంగి పొర్లాయి. గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ యంత్రాంగంతోపాటు పోలీసు శాఖ అప్రమత్తమై.. ఇబ్బందులు తలెత్తకుండా ఎక్కడికక్కడ చర్యలు చేపట్టింది. శుక్రవారం రాత్రి రెండున్నర గంటల వ్యవధిలోనే 13.5 సెంటీమీటర్ల వర్షం (Heavy rain lashes Hyderabad) కురవగా.. శనివారం ఒక్క గంట వ్యవధిలోనే 9.5 సెం. మీ. వర్షం కురిసింది. శుక్రవారం అర్ధరాత్రి వర్షానికి ఇబ్బందులు పడిన లోతట్టు ప్రాంతాలు, పలు కాలనీలు.. శనివా రం కురిసిన భారీ వర్షాలతో మళ్లీ కష్టాలు ఎదుర్కొన్నాయి.

జోగులాంబ గద్వాల జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. రాత్రి కురిసిన వర్షానికి పూరి గుడిసె గోడ కూలి ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృత్యువాతపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. అయిజ మండలం కొత్తపత్తిలో ఓ కుటుంబం పూరి గుడిసెలో నిద్రిస్తుండగా వర్షానికి నానిన గోడ రాత్రి సమయంలో ఒక్కసారిగా కూలింది. దీంతో గోడ పక్కనే నిద్రిస్తున్న కుటుంబ యజమాని మోష, భార్య శాంతమ్మ, పిల్లలు చరణ్, తేజ, రాము అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు పిల్లలు స్నేహ, చిన్న ప్రాణాలతో బైటపడ్డారు. తీవ్రంగా గాయపడిన వారిని 108 వాహనంలో కర్నూలులోని ఓ ఆసుపత్రికి తరలించారు. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు చనిపోవడంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.

ఏపీకి మరో తుఫాన్ ముప్పు, గోదావరి జిల్లాలకు భారీ వర్షాల అలర్ట్, అల్పపీడనం తుపానుగా బలపడితే జావద్‌ గా నామకరణం, నేడు రేపు ఏపీలో భారీ వర్షాలు

గద్వాల జిల్లా కొత్తపల్లిలో గోడ కూలి ఐదుగురు మృతిచెందిన ఘటనపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మంత్రి నిరంజన్‌రెడ్డికి ఫోన్‌ చేసి ప్రమాద ఘటనకు సంబంధించిన వివరాలు తెలుసుకున్నారు. మృతులు ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించాలని ఆదేశించారు. మృతుల కుంటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని చెప్పారు. కుటుంబంలో మిగతా వారికి ప్రభుత్వపరంగా విద్య, వైద్య సౌకర్యాలు కల్పిస్తామన్నారు. గ్రామాల్లో శిథిలావస్థలో ఉన్న ఇండ్ల నిర్మాణాలను అధికారులు గుర్తించాలని, ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాని సీఎం కేసీఆర్‌ ఆదేశించారు.

ఎవరూ బయటకు రాకండి, రానున్న రెండు రోజులు తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు, హెచ్చరించిన వాతావరణ శాఖ

రానున్న రెండు రోజుల్లో ఉత్తర అండమాన్‌ సముద్ర పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉన్నాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం డైరెక్టర్‌ నాగరత్న వెల్లడించారు. ఇది మరింత బలపడి పశ్చిమ వాయ వ్య దిశగా ప్రయాణించి నాలుగైదు రోజుల్లో దక్షిణ ఒడిశా-ఉత్తర కోస్తా ఆంధ్ర తీరానికి చేరుకోవచ్చని తెలిపారు. బం గాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం బలహీనపడి ద్రోణి రూపంలో హైదరాబాద్‌ వైపు కదులుతున్నట్టు చెప్పా రు. దీనికి తూర్పునుంచి వీస్తున్న గాలులతో ఏర్పడిన షి యర్‌జోన్‌ తోడయి హైదరాబాద్‌, దాని పరిసర ప్రాంతా ల్లో భారీవర్షాలు కురుస్తున్నాయని వెల్లడించారు. నైరుతి రుతుపవనాల తిరోగమనం, ఉపరితల ఆవర్తనం, షియర్‌జోన్‌ ప్రభావంతో రాగల 36 గంటల్లో గ్రేటర్‌కు భారీనుంచి అతి భారీ వర్ష సూచన ఉన్నట్టు హెచ్చరించారు.

రాష్ట్రంలో పిడుగుపాట్లకు శనివారం ఐదుగురు ప్రాణాలు వదిలారు. ఒక్క ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో నలుగురు, హనుమకొండ జిల్లాలో ఒకరు మృతిచెందారు. మరో ముగ్గురు గాయపడ్డారు. పలుచోట్ల పిడుగుపాట్లకు పశువులు మృత్యువాతపడ్డాయి. మరోవైపు, ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో భారీ వర్షం కురిసింది.