Hyderabad, August 17: తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు (Telangana Rains) కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులకు తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి కీలక ఆదేశాలు జారీచేశారు. వర్షాల వల్ల ఏ విధమైన ఆస్తి, ప్రాణనష్టం వాటిల్లకుండా అప్రత్తంగా ఉండాలని రాష్ట్రంలోని అన్ని పోలీస్ కమీషనరేట్లు, జిల్లా ఎస్పీలను డీజీపీ మహేందర్ రెడ్డి (TS DGP Mahendar reddy) ఆదేశించారు. రాష్ట్ర సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు అన్ని జిల్లాల పోలీసు అధికారులను అప్రమత్తం చేయడంతో పాటు డీజీపీ (DGP) కార్యాలయం నుండి పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. గత రెండు రోజుల నుండి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, తాను కలసి జిల్లాల కలెక్టర్లు సీపీలు, ఎస్పీలతో ఉమ్మడిగా టెలి కాన్ఫరెన్స్ నిర్వహించి ఏ విధమైన అవాంచనీయ సంఘటనలు జరుగకుండా తగు సూచనలు, సలహాలను ఇస్తున్నామని చెప్పారు.
జిల్లా కలెక్టర్ కార్యాలయాలలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్‌లలో పోలీస్ అధికారులను కూడా ప్రత్యేకంగా నియమించామన్నారు. జిల్లా కలెక్టర్లు, ఇతర శాఖల అదికారులతో సమన్వయంతో పనిచేయాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, ఏ విధమైన ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా అత్యంత ప్రాధాన్యతనివ్వాలని డీజీపీ ఆదేశాలు జారీ చేశారు. మరో రెండు మూడు రోజుల పాటు ఈ వర్షాలు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో క్షేత్ర స్థాయిలో పోలీస్ అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలని డీజీపీ మహేందర్ రెడ్డి స్పష్టం చేశారు. మరో అల్ప పీడనం..తెలుగు రాష్ట్రాలను ముంచెత్తుతున్న వరదలు, మహోగ్ర రూపం దాల్చిన నదులు, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ
నగరంలో కురుస్తున్న వర్షాల నేపథ్యంలో పోలీసు విభాగం అప్రమత్తమైంది. ట్రాఫిక్ పోలీసులతో పాటు శాంతిభద్రతల విభాగం అధికారులూ అందుబాటులో ఉండేలా నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ (Anjani kumar) ఉత్తర్వులు జారీ చేశారు. మరికొన్ని గంటలూ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో పోలీసుల్ని అప్రమత్తం చేశారు. ఏ సమయంలో, ఎలాంటి ఇబ్బంది ఎదురైనా తమ సహకారం తీసుకోవాలంటూ ఆయన ఆదివారం ట్వీట్ చేశారు. డయల్–100కు అదనంగా జోన్ల స్థాయిలో మరికొన్ని నెంబర్లను అందుబాటులోకి తీసుకువచ్చారు.
ఆయా నంబర్లు
ప్రధాన కంట్రోల్ రూమ్: 040–27852333, 27852435, 27852436, 9490616690
సెంట్రల్ జోన్ కంట్రోల్ రూమ్: 040–27852759, 9490598979
ఈస్ట్ జోన్ కంట్రోల్ రూమ్: 040–27853562, 9490598980
నార్త్ జోన్ కంట్రోల్ రూమ్: 040–27853599, 9490598982
సౌత్ జోన్ కంట్రోల్ రూమ్: 040–27854779, 9490616551, 7013299622
వెస్ట్ జోన్ కంట్రోల్ రూమ్: 040–27852483, 9490598981
ట్రాఫిక్ కంట్రోల్ రూమ్: 040–27852482, 9490598985
ట్రాఫిక్ హెల్ప్ లైన్: 9010203626
కాగా, ఉత్తర కోస్తా, దానిని ఆనుకుని ఉన్న వాయవ్య బంగాళాఖాతం, పశ్చిమ బెంగాల్లోని గాంగ్ టక్ ప్రాంతాల్లో అల్పపీడనం కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా 9.5 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇది పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణించే అవకాశం ఉంది. ఉత్తర బంగాళాఖాతంలో సుమారుగా ఆగస్ట్ 19 తేదీన అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ ప్రభావంతో తెలంగాణలో నిన్న ఒకటి రెండు చోట్ల అతి భారీ వర్షాలతో పాటు అత్యంత భారీ వర్షాలు కూడా కురిశాయి. నేడు ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు, రేపు ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
తెలంగాణలో 16 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. అత్యధికంగా ములుగు జిల్లా వెంకటాపురం లో 16.6 సెంటీమీటర్లు, ములుగు జిల్లా వాజీద్ లో 15.4 సెంటీమీటర్లు, నిర్మల్ జిల్లా నిర్మల్ రూరల్ లో 12.8 సెంటీమీటర్లు, ములుగు జిల్లా మంగపేటలో 10.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. వరంగల్ రూరల్, మంచిర్యాల, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, నిజామాబాద్ జిల్లాలో 8 నుంచి 9 సెంటిమీటర్ల వర్షపాతం కురిసింది. వరంగల్ అర్బన్, కరీంనగర్, కొమురం భీం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఏడు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
ఉత్తర తెలంగాణలో కనివిని ఎరుగని రీతిలో వర్షం కురిసిందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. మునుపెన్నడూ లేని విధంగా నాలుగు రోజుల్లోనే చెరువులు కుంటలు జలాశయాల నిండాయని పలు చోట్ల చెరువులకు, కాలువలకు గండ్లు పడి రోడ్లు దెబ్బతిని చాలా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయిని చెప్పారు. కలెక్టర్ శశాంక, జడ్పి చైర్ పర్సన్ విజయతో కలిసి మంత్రి జమ్మికుంట, హుజురాబాద్ ఏరియాలో వరదల పరిస్థితిని పరిశీలించారు. ఐదు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో సీఎం కేసీఆర్ మంత్రులను, అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారని తెలిపారు.
సీఎం కేసీఆర్ వర్షం, వరదల పై ఈరోజు సమీక్ష ఏర్పాటు చేశారని తెలిపారు. పంట నష్టంపై రైతులను ఆదుకునే విషయం పై సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకుంటారని స్పష్టం చేశారు. ఇప్పటికే రెండు కమాండ్ కంట్రోల్ సెంటర్లు ఏర్పాటు చేశామని, సీఎస్ ఆధ్వర్యంలో కంట్రోల్ సెంటర్ నడుస్తుందన్నారు. అన్ని జిల్లాల కలెక్టర్లతో సమాచారం సేకరించి ప్రత్యేక బృందాలు పంపిస్తున్నారని అవసరం ఉన్న చోట ప్రజలను షెల్టర్లకు తరలించి భోజన సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. రాబోవు 48 గంటల్లో మరోమారు తీవ్రమైన వర్షాలు ఉంటాయని హెచ్చరికల నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని మంత్రి ఈటల కోరారు.