TSRTC Privatization: ఆర్టీసీ ప్రైవేటీకరణపై విచారణ, తెలంగాణ ప్రభుత్వ నిర్ణయానికి హైకోర్ట్ బ్రేక్, ఆ 5 వేల రూట్లకు సంబంధించి ముందుకెళ్లొద్దని ఆదేశం
High Court of Telangana | TSRTC Strike | File Photo

Hyderabad, November 7: తెలంగాణ ఆర్టీసీలో ప్రైవేటుకు అనుమతికి సంబంధించి శుక్రవారం హైకోర్టు (High Court of Telangana) లో విచారణ జరిగింది. 5,100 రూట్లలో ప్రైవేటీకరణకు సంబంధించి తెలంగాణ కేబినేట్ తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్ట్ ప్రస్తుతానికి నిలుపుదల చేసింది. దీనిపై సోమవారం లోపు కౌంటర్ దాఖలు చేయాలని, అప్పటివరకు ఎలాంటి తదుపరి చర్యలు తీసుకోవద్దన్ని హైకోర్ట్ ఆదేశించింది. తదుపరి విచారణను నవంబర్ 11కు వాయిదా వేసింది.

ఆర్టీసీ సమ్మె (TSRTC Srtike) నేపథ్యంలో ఇటీవల మంత్రివర్గ సమావేశం నిర్వహించిన సీఎం కేసీఆర్ (CM KCR), కొన్ని రూట్లలో ప్రైవేట్ బస్సులకు అనుమతి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు, ఆ నిర్ణయాన్ని కేబినేట్ కూడా ఆమోదించింది. అయితే ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ తెజస ఉపాధ్యక్షుడు విశ్వేశ్వరరావు హైకోర్టులో గురువారం అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు. అయితే దీనిపై 11న విచారణ చేపడతామని కోర్ట్ తెలపగా, సమస్య తీవ్రత దృష్ట్యా శుక్రవారమే విచారణ చేపట్టాలని పిటిషన్ తరఫు న్యాయవాది కోర్టులో వాదనలు వినిపించారు. అందుకు అంగీకరించిన ధర్మాసనం నేడు విచారణ చేపట్టింది. పిటిషనర్ లేవనెత్తిన అభ్యంతరాలపై కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాలను తమ ముందుంచాలని తెలిపింది. కార్మికులతో చర్చలు జరపాలని ప్రభుత్వానికి మరోసారి హైకోర్ట్ సూచించింది.  ఆర్టీసీని లాభాల్లోకి తేవాలన్నా, సంస్థ మనుగడ కొనసాగాలన్నా, కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాలి. - కేసీఆర్ 

నవంబర్ 11న ఆర్టీసీ సమ్మె, కార్మికుల జీతాల నిలుపుదల మరియు ప్రైవేటీకరణకు సంబంధించి హైకోర్ట్ మరోసారి విచారణ చేపట్టనుంది. ఈ లోపు కార్మికులతో చర్చలు జరపాలని, ప్రభుత్వం ప్రజల పట్ల అధికారాన్ని కాదు ఔదర్యాన్ని చూపించాలని సూచించింది.  అయితే ఇప్పుడు సీఎం కేసీఆర్ నిర్ణయం ఎలా ఉండనుందనేది ఆసక్తికరంగా మారింది. తమ విధానపరమైన నిర్ణయాలకు అడ్డుచెప్పే అధికారం హైకోర్టుకు  లేదని చెప్పిన సీఎం, హైకోర్ట్ తాజా ఆదేశాలపై ఎలా స్పందిస్తారనే దానిపై ఆసక్తి నెలకొంది. ఇక హైకోర్టుతో లాభం లేదని నేరుగా సుప్రీంకోర్టుకు వెళ్తారా చూడాలి.

ఇదిలా ఉండగా ఆర్టీసీలో 31 శాతం కేంద్రం వాటా ఉందని తెలంగాణ ప్రభుత్వం చెప్తూ వచ్చింది. అయితే దీనిని కేంద్రం తరఫున వాదనలు వినిపించిన అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ నామవరపు రాజేశ్వర రావు విబేధించారు. ఆ వాటా ఒక్క తెలంగాణ ఆర్టీసీకి సంబంధించింది కాదని, గతంలోని ఉమ్మడి ఏపీఎస్ ఆర్టీసీకి సంబంధించినదని స్పష్టం చేశారు. టీఎస్ఆర్టీసీ ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం కేంద్రం నుంచి అనుమతి తీసుకోలేదని కోర్టుకు తెలియజేశారు.