Mulugu, FEB 24: సమ్మక, సారలమ్మ నామస్మరణతో మేడారం (Medaram) ఉప్పొంగిపోతున్నది. దేశంలో అతిపెద్ద గిరిజన కుంభమేళా మేడారం జాతర (Medaram Jathara) తుది అంకానికి చేరింది. జనదేవతలు నేడు వనప్రవేశం చేయనున్నారు. భక్తకోటిని దీవించి, ఆశీర్వదించిన సమ్మక్క శనివారం సాయంత్రం తిరిగి వనప్రవేశం చేస్తుంది. సారలమ్మ కన్నెపల్లికి వెళ్లిపోతుంది. పగిడిద్దరాజు పూనుగుండ్లకు, గోవిందరాజులు కొండాయికి అదే సమయంలో వెళ్లిపోనున్నారు. ఆదివాసీ గిరిజన సంప్రదాయాల ప్రకారం వడ్డెలు గద్దెల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి తల్లులను ఎక్కడి నుంచి తోడ్కొని వస్తారో తిరిగి అక్కడికే సాగనంపుతారు. దీంతో రెండేండ్లకోసారి నాలుగు రోజులపాటు జరిగే మహాజాతర పరిసమాప్తి అవుతుంది. ఈ నేపథ్యంలో వనదేవతల దర్శనానికి భక్తులు భారీగా తరలివెళ్తున్నారు.
దీంతో మేడారం మార్గంలో పెద్దసంఖ్యలో ఆర్టీసీ బస్సులు నిలిచిపోయాయి. తాడ్వాయి-మేడారం మార్గంలో కిలోమీటర్ల మేర ఆగిపోయాయి. భారీగా ట్రాఫిక్ జామ్ అవడంతో సమ్మక్క-సారలమ్మల దర్శనానికి వెళ్లే భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా మేడారం వెళ్లే బస్సులు గంటల తరబడి ఆలస్యంగా నడుస్తున్నాయి.