Huzurnagar,September 22: గత కొద్ది రోజుల నుంచి ఎంతో ఉత్కంఠ రేపుతున్న హుజూర్ నగర్ ( Huzurnagar)నియోజకవర్గ ఉప ఎన్నిక డేట్ ఫిక్స్ అయింది. హుజూర్ నగర్లో వచ్చే నెల 21న ఓటింగ్ నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం చీఫ్ కమిషనర్ సునీల్ అరోరా ( Chief Election Commissioner Sunil Arora) ప్రకటించారు. ఢిల్లీలో విలేకరులతో మాట్లాడిన సునీల్ అరోరా.. తొలుత మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ను ఆయన ప్రకటించారు. ఈ నెల 27న నోటిఫికేషన్ విడుదల చేస్తామని, ఆ రోజు నుంచి అక్టోబరు 4 వరకు నామినేషన్ల స్వీకరణ చేపడుతామని చెప్పారు. అక్టోబరు 21 పోలింగ్, 24న కౌంటింగ్ చేపట్టి ఫలితాలు ప్రటిస్తామన్నారు. దేశవ్యాప్తంగా ఖాళీ ఉన్న 64 నియోజక వర్గాల్లో ఉప ఎన్నికలు నిర్వహించాల్సి ఉందని సునీల్ అరోరా తెలిపారు. తెలంగాణ, అరుణాచల్ ప్రదేశ్, బిహార్, ఛత్తీస్ గఢ్, అసోం, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మేఘాలయ, ఒడిశా, పాండిచ్చేరి, పంజాబ్, రాజస్థాన్, సిక్కిం, ఉత్తరప్రదేశ్, తమిళనాడుల్లో వివిధ కారణాల వల్ల ఖాళీ అయిన స్థానాలకు మహారాష్ట్ర, హర్యానాలతో పాటే ఎన్నికలు నిర్వహిస్తామని ఈ సంధర్భంగా తెలిపారు.
64 నియోజక వర్గాల్లో ఉప ఎన్నికలు
CEC: By-elections to 64 constituencies across Arunachal Pradesh, Bihar, Chhattisgarh, Assam, Gujarat, Himachal Pradesh, Karnataka, Kerala, MP, Meghalaya, Odisha, Puducherry, Punjab, Rajasthan, Sikkim, Tamil Nadu, Telangana &Uttar Pradesh, to be held on Oct 21 ;counting on Oct 24 pic.twitter.com/qs1EXsEVbV
— ANI (@ANI) September 21, 2019
హుజూర్ నగర్ ఉప ఎన్నికకు సెప్టెంబర్ 23న నోటిఫికేషన్ విడుదల చేస్తారు. నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ సెప్టెంబర్ 30. ఉపసంహరణ అక్టోబర్ 3. ఇక పోలింగ్ ప్రక్రియ అక్టోబర్ 21న, ఓట్ల లెక్కింపు 24న నిర్వహించనున్నారు. హూజూర్ నగర్ ఉప ఎన్నికకు షెడ్యూల్ వెలువడడంతో సూర్యాపేట జిల్లాలో ఎన్నికల నియమావళి(కోడ్) అమలులోకి వచ్చిందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి(సీఈవో) రజత్‌కుమార్ తెలిపారు.
ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామాతో ఉపఎన్నిక
ఈ ఉప ఎన్నిక ( Huzurnagar bypoll)అంశం కొద్ది రోజుల నుంచి తెలంగాణాలో తెగ హీట్ రేపుతోంది.అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో హుజూర్ నగర్ నియోజకవర్గం నుంచి టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే ఆ తర్వాత 2019లో జరిగిన ఎంపీ ఎన్నికల్లో నల్లగొండ నుంచి పోటీ చేసి ఉత్తమ్ విజయం సాధించారు. దీంతో హుజూర్ నగర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఎంపీగా ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam kumar reddy)కొనసాగుతున్నారు. దీంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. తన రాజీనామాతో జరగనున్న ఉపఎన్నిక కావడంతో టీపీసీసీ అధ్యక్షుడు నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి (tpcc chief uttam kumar reddy) ఈ ఎన్నికను మరింత ప్రతిష్మాత్మకంగా తీసుకున్నారు. ఈ నియోజక వర్గం ఏర్పడినప్పటినుంచి జరిగిన మూడు ఎన్నికల్లో ఉత్తమ్ కుమార్ రెడ్డినే విజయం వరించింది. 4 నెలల క్రితం జరిగిన లోక్ సభ ఎన్నికల్లో సైతం కాంగ్రెస్ పార్టీ అధినేత ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఆధిక్యం లభించింది. కేవలం స్థానిక ఎన్నికల్లో మాత్రమే టీఆర్ ఎస్ తన హవాను కొనసాగించింది.
అభ్యర్థులు వీరే
హుజూర్ నగర్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో అధికార పార్టీ టిఆర్ఎస్ అభ్యర్థి పేరును ఖారారు చేసింది.శానంపూడి సైదిరెడ్డి పేరును సిఎం, పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ (KCR) ప్రకటించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో సైదిరెడ్డి ( saidi reddy) టిఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి, స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారు. హుజూర్ నగర్ ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదలయిన నేపథ్యంలో జిల్లాకు చెందిన మంత్రి, ఇతర ముఖ్య నాయకులతో మాట్లాడిన తెలంగాణా ముఖ్యమంత్రి ( Telangana cm kcr) తిరిగి సైదిరెడ్డినే అభ్యర్థిగా నిలబెట్టాలని సిఎం నిర్ణయించారు.ఆయన గెలుపుకోసం సర్వశక్తులు ఒడ్డాలని నిర్ణయించారు. పార్టీ నాయకులకు అలాగే పార్టీ శ్రేణులకు సైదిరెడ్డి విజయం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఇక్కడ నుంచి కాంగ్రెస్ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీమణి పద్మావతి రెడ్డి బరిలోకి దిగడం దాదాపు ఖాయంగా తెలుస్తోంది. అయితే పద్మావతి రెడ్డి అభ్యర్థిత్వం మీద ఆ పార్టీలోనే లుకలుకలు మొదలయ్యాయి. ఎవరినీ సంప్రదించకుండా ఉత్తమ్ అభ్యర్థిని ఎలా డిసైడ్ చేస్తారంటూ టీపీసీసీ ఉపాధ్యక్షుడు రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఇప్పటికే ఫైర్ అయ్యారు. తన అభ్యర్థి కిరణ్ రెడ్డి అంటూ ఆయన ప్రకటించేశారు. దీంతో కాంగ్రెస్ రెండుగా చీలి కొట్లాడుకునే పరిస్థితి వచ్చింది. మరి కాంగ్రెస్ అభ్యర్థి ఎవరనేది ఇంకా సందిగ్ధంలోనే ఉంది.
విజయంపై ఎవరి ధీమా వారిదే
ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 30 వేల మెజార్టీతో గెలవడం ఖాయమని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.హుజూర్ నగర్ అభివృద్ధి కోసం టీఆర్ఎస్ ఏం చేసిందో చెప్పాలని ఉత్తమ్ డిమాండ్ చేశారు. బంగారు తెలంగాణ చేస్తానని చెప్పిన కేసీఆర్ ఈ ఆరేళ్లలో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని మండిపడ్డారు.హుజూర్ నగర్ లో కాంగ్రెస్ ను గెలిపించి కేసీఆర్ నియంతృత్వ పాలనకు చరమగీతం పలకాలని పిలుపునిచ్చారు. హుజూర్‌నగర్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ గెలుపు ఖాయమని విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి ( Minister Jagadish Reddy ) ధీమా వ్యక్తం చేశారు.గత ఎన్నికల్లో తమ అభ్యర్థి స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యాడని దీనికి కారణం ట్రక్కు గుర్తేనని అన్నారు. టీఆర్ఎస్ గెలుపు ఇప్పటికే ఖాయమైందని, 25 వేలు అంతకంటే ఎక్కువ మెజారిటీపై తాము దృష్టి సారించామని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి వ్యాఖ్యానించారు.
ఇక హుజూర్ నగర్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు బీజేపీ రంగం సిద్దం చేసుకొంటుంది. 2023 నాటికి తెలంగాణలో అధికారాన్ని కైవసం చేసుకోవాలని భావిస్తున్న బీజేపీకి ఈ ఎన్నికలు చాలా ముఖ్యమైనవని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ హుజూర్‌నగర్ ( BJp Huzurnagar) అభ్యర్థిగా భాగ్యారెడ్డిని బరిలో నిలిపింది. ఈ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధి భాగ్యారెడ్డికి 1555 ఓట్లు వచ్చాయి. నోటాకు 1621 ఓట్లు వచ్చాయి. నోటా( Nota) కంటే తక్కువ ఓట్లు బీజేపీ అభ్యర్ధికి దక్కాయి. ఇదిలా ఉంటే 2018 అసెంబ్లీ ఎన్నికలు జరిగిన నాటితో పోలిస్తే ప్రస్తుతం తెలంగాణలో రాజకీయ పరిస్థితుల్లో మార్పులు వచ్చాయి. పలు పార్టీల నుండి బీజేపీలో వలసలు పెరిగాయి. దీంతో బిజెపి కూడా గెలుపు తమదే అని ధీమాతో ముందుకు వెళుతోంది.
ఏది ఏమైనా హుజూర్ నగర్ లో ఇప్పుడు త్రిముఖ పోటీ నెలకొంది. ప్రధాన పార్టీలు ఎవరికి వారు విజయం తమదే అని స్టేట్ మెంట్లు ఇస్తున్నారు. ఓటరు నాడి ఏంటనేది ఫలితాల విడుదల తర్వాత కాని తెలియదు.