Hyderabad: వరుస అత్యాచారాల దెబ్బ, 69 మంది ఇన్‌స్పెక్టర్లను బదిలీ చేసిన సిటీ పోలీసు కమిషనర్‌ సీవీ ఆనంద్‌, పలు విభాగాల్లో మూడేండ్లు పూర్తి చేసుకున్న వారికి బదిలీలు
HYD CP CV Anand (Photo-Video Grab)

Hyd, July14: సుదీర్ఘ కాలం తర్వాత నగరంలో ఒకేసారి భారీ స్థాయిలో ఇన్‌స్పెక్టర్లు బదిలీ అయ్యారు. వివిధ విభాగాల్లో పని చేస్తున్న 69 మందికి స్థాన చలనం కల్పిస్తూ కొత్వాల్‌ సీవీ ఆనంద్‌ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. గడిచిన కొన్నేళ్లుగా నగరంలో బదిలీలు ( 69 Inspectors in city transferred) జరుగుతున్నప్పటికీ గరిష్టంగా ఐదు స్థానాలకే పరిమితం అవుతున్నాయి. ఆనంద్‌ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి అధికారులు, సిబ్బంది పనితీరు, ఇతర అంశాలపై దృష్టి పెట్టారు.

ఈ బదిలీల సందర్భంగా ఆయా అధికారులకు సీపీ సీవీ ఆనంద్‌ కౌన్సిలింగ్‌ చేశారు. అనంతరం బదిలీ ఉత్తర్వులు జారీ చేశారు. తొలుత కౌన్సిలింగ్‌.. ఆ తర్వాత బదిలీల ఉత్తర్వులు.. ఈ కొత్త విధానానికి సీపీ శ్రీకారం చుట్టారు.పలు విభాగాల్లో మూడేండ్లు పూర్తి చేసుకున్న వారిని బదిలీలు చేస్తూ కొత్తగా పోస్టింగ్‌లు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అదనపు సీపీ చౌహాన్‌, ఏఆర్‌ శ్రీనివాస్‌, జాయింట్‌ సీపీలు సీపీ రంగనాథ్‌(ట్రాఫిక్‌), ఎం.రమేశ్‌(అడ్మిన్‌), విశ్వప్రసాద్‌(ఎస్‌బీ), కార్తికేయ (కార్‌ హెడ్‌క్వార్టర్స్‌), గజారావు భూపాల్‌ (సీసీఎస్‌) తదితరులు పాల్గొన్నారు. శాంతిభద్రతలు, వీఐపీల తాకిడి పరంగా అత్యంత కీలక పోలీస్టేషన్లయిన పంజాగుట్ట, సైఫాబాద్‌, బేగంబజార్‌, నారాయణగూడ ఠాణాల్లో అధికారులకు స్థానచలనం కలిగింది. ట్రాఫిక్‌, సీసీఎస్‌, ఎస్‌బీ విభాగాల్లోనూ బదిలీలు జరిగాయి. బదిలీ అయిన అధికారులు వెంటనే కొత్త స్థానాల్లో చేరాలని సీపీ ఆదేశాలు జారీ చేశారు.

కామాంధుడైన మరో పోలీస్ అధికారి, యువతిని బెదిరిస్తూ పదేళ్లుగా కోరికలు తీర్చుకున్న ఎస్ఐ, నీకు పెళ్ళి వద్దు నాతోనే ఉండాలంటూ బెదిరింపులు, అధికారిని సస్పెండ్ చేసిన రాచకొండ సీపీ

గతంలో పంజగుట్ట ఇన్‌స్పెక్టర్‌గా ఉన్న ఎం.నిరంజన్‌రెడ్డిని సీసీఎస్‌కు బదిలీ చేసిన ఆనంద్‌ ఆ స్థానంలో సీసీఎస్‌ నుంచి సి.హరి చంద్రారెడ్డిని నియమించారు. అయితే అనివార్య కారణాల నేపథ్యంలో ఈ ఇద్దరి అధికారులు కొత్త స్థానాల్లో బాధ్యతలు తీసుకున్న తర్వాత తిరిగి పాత స్థానాల్లోకి మారాల్చి వచ్చింది. తాజా బదిలీల్లో మళ్లీ యథాతధంగా పోస్టింగ్స్‌ వచ్చాయి. కాగా ఇటీవల నగర పోలీసు అధికారుల అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.

మారేడుపల్లి సీ నాగేశ్వరరావు అత్యాచారం కేసులో ఇరుక్కోగా.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి పదేళ్లపాటు సహజీవనం చేసి ఓ యువతిని మోసం చేసిన ఘటనలో మల్కాజ్‌గిరిలో సీసీఎస్‌ ఎస్‌ఐగా విధులు నిర్వర్తిస్తున్న విజయ్‌పై కేసు నమోదైంది. ఇలా పోలీసు అధికారులకు సంబంధించి వరుస ఘటనలు చోటుచేసుకుంటున్న క్రమంలో హైదరాబాద్‌ సీపీ ఆనంద్‌ ఈ బదిలీల నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.