Cyberabad CP VC Sajjanar | Photo: ANI

Hyderabad, Dec 29: మద్యం సేవించి డ్రైవింగ్ చేసేవారికి సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ హెచ్చరికలతో కూడిన వ్యాఖ్యలు (CP Sajjanar Warns Drunken Drivers) చేశారు. మద్యం తాగి వాహనాలు నడిపేవాళ్లు ఉగ్రవాదులతో సమానమని సైబరాబాద్‌ సీపీ వీసీ సజ్జనార్‌ అన్నారు. డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ చేస్తే పదేళ్ల జైలు శిక్ష పడేలా కేసులు నమోదు చేస్తామని సీపీ (Cyderabad CP VC Sajjanar ) హెచ్చరించారు. తాగి బండి నడిపేవాళ్లను ఎంతటి వారైనా వదిలే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. కాగా సోమవారం ఒక్కరోజే నగరంలో 420 మంది డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ టెస్టులో పట్టుబడ్డారు.

ఇక కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఇప్పటికే నగరంలో కొత్త సంవత్సరం వేడుకలపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సీపీ సజ్జనార్‌ (CP Sajjanar) మాట్లాడుతూ.. ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్, ఏఆర్‌తో పాటు ఎస్‌వోటీ పోలీసులు కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పాల్గొంటారని తెలిపారుఅదే విధంగా నిబంధనలు అతిక్రమించిన వారికి కఠిన శిక్షలు పడేలా చర్యలు ఉంటాయని వార్నింగ్‌ ఇచ్చారు. కాగా తాగి బండి నడిపితే చర్యలు తప్పవని హైదరాబాద్‌ పోలీసులు ఇటీవల హెచ్చరికలు జారీ చేసిన విషయం తెలిసిందే.

హైదరాబాద్‌లో నూతన సంవత్సర వేడుకలు రద్దు, రూల్స్ అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని తెలిపిన సీపీ సజ్జనార్

డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీల్లో మొదటి సారి పట్టుబడితే రూ.10వేల జరిమానా‌, 6 నెలల జైలు శిక్ష, 3 నెలలు లైసెన్స్ రద్దు చేస్తామని వెల్లడించారు. ఇక రెండోసారి పట్టుబడితే రూ.15 వేల ఫైన్‌, రెండేళ్ల జైలు శిక్ష, శాశ్వతంగా లైసెన్స్ రద్దు చేస్తామని స్పష్టం చేశారు.ఈ వారం పాటు సైబరాబాద్ పరిధిలో ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్ టీమ్స్ ఉంటాయన్నారు. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌కు ఎలాంటి అనుమతులు లేవని ఇప్పటికే స్పష్టం చేసిన సైబరాబాద్ సీపీ.. ఇప్పుడు మందు బాబులకు సీరియస్ వార్నింగ్ ఇచ్చేశారు.