Hyderabad, Sep 2: అన్‌లాక్-4 మార్గదర్శకాలు విడుదల చేసిన కేంద్రం ఈ నెల 7 నుంచి మెట్రో రైలు సేవల ( Metro rail ) పునరుద్ధరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో ఈ నెల 7 నుంచి మెట్రో రైళ్లు (Hyderabad Metro Rail) పరుగులు తీయనున్నాయి. ఈ మేరకు మూడు రోజుల క్రితం కేంద్రం జారీచేసిన ‘అన్‌లాక్-4.0’ మార్గదర్శకాలను యధాతథంగా అమలు చేయాలని రాష్ట్ర సర్కారు నిర్ణయించింది.
దీనిపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ మంగళవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. కొవిడ్-19 నిబంధనలు పాటిస్తూ మెట్రో రైళ్లు నడుస్తాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కరోనా వ్యాప్తి అనంతరం లాక్ డౌన్‌లో భాగంగా మార్చి 22న నుంచి హైదరాబాద్ మెట్రో సేవలు మూతపడి ఉన్నాయి.
హైదరాబాద్ మెట్రో రైలు సేవలను ఈ నెల 7వ తేదీ నుంచి ప్రారంభించనున్నట్లు మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ( HMRL MD NVS Reddy ) ప్రకటించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిబంధనలకు అనుగుణంగా రైలు ప్రయాణాల వల్ల ప్రయాణికులకు కరోనా వ్యాపించకుండా చర్యలు చేపడుతున్నామని ఎన్విఎస్ రెడ్డి తెలిపారు. దేశంలోనే రెండో అతిపెద్ద మెట్రో సర్వీస్‌గా పేరున్న హైదరాబాద్ మెట్రో రైలు లిమిటెడ్.. లాక్‌డౌన్‌కి ముందు వరకు నిత్యం 55 రైళ్ల ద్వారా 4.5 లక్షల మంది ప్రయాణికులకు సేవలు అందించింది. తెలంగాణలో కొత్తగా మరో 2,892 పాజిటివ్ కేసులు నమోదు, రాష్ట్రంలో 1 లక్ష 30 వేలు దాటిన కొవిడ్ బాధితుల సంఖ్య, 846కు పెరిగిన కరోనా మరణాలు
త్వరలోనే దేశవ్యాప్తంగా ఉన్న వివిధ ప్రధాన నగరాలలోని మెట్రో రైలు సేవలు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో దేశంలోని అన్ని రాష్ట్రాల మెట్రోల ఎండీలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఎన్వీఎస్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. రైళ్లలో ప్రయాణికులకు కరోనా వ్యాపించకుండా శానిటైజేషన్ ( Sanitization ), భౌతిక దూరం ( Social distancing ) కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటామని ఎన్వీఎస్ రెడ్డి పేర్కొన్నారు.
మెట్రో రైళ్లన్నీ మునుపటిలా ఒక్కసారిగా నడవవు. అన్ని కారిడార్లలో దశలవారీగా పట్టాలెక్కుతాయి. అలాగే రైళ్లలో రద్దీ లేకుండా జాగ్రత్తపడతారు. మునుపటిలా ఒక్కో మెట్రో రైల్లో 900-1100 మందిని కాకుండా పరిమిత సంఖ్యలోనే ప్రయాణికులను అనుమతివ్వనున్నారు. మెట్రో రైళ్లలో ధారాళంగా గాలి, వెలుతురు వచ్చేలా.. భౌతికదూరం పాటించేలా చూడటం..వంటి చర్యలు తీసుకుంటామని మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ప్రయాణికుల ఆరోగ్య భద్రతకు పెద్దపీట వేస్తామని.. రైళ్లలో ఏసీ విషయంలో ప్రత్యేక చర్యలు తీసుకుంటామని.. ఇందుకు సంబంధించి ప్రత్యేక మెకానిజాన్ని అవలంబిస్తామన్నారు.