Hyderabad, February 08: శనివారం ఉదయం 6:30 గంటల నుంచి జేబీఎస్- ఎంజీబీఎస్ మెట్రో సర్వీస్ (JBS- MGBS Metro Service) ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చింది. దీంతో సికింద్రాబాద్ బస్ స్టేషన్ - హైదరాబాద్ బస్ స్టేషన్ మధ్య ప్రయాణం సులభతరం అయింది. జేబీఎస్- ఎంజీబీఎస్ మెట్రో మార్గం సుమారు 11 కిలోమీటర్లు ఉంది. ఈ మార్గంలో మొత్తం 9 స్టేషన్లు ఉంటాయి. పరేడ్ గ్రౌండ్స్ నుంచి మొదలుపెడితే ఈ మార్గంలో వచ్చే స్టేషన్లు జేబీఎస్-పరేడ్ గ్రౌండ్స్, సికింద్రాబాద్ వెస్ట్, గాంధీ హాస్పిటల్, ముషీరాబాద్, ఆర్‌టీసి క్రాస్‌రోడ్స్, చిక్కడ్‌పల్లి, నారాయణగూడ, సుల్తాన్ బజార్ మరియు ఎంజీబీఎస్.
దూరప్రయాణాలు చేసే వారి కోసం ఈ మార్గం ఎంతో ఉపయోగపడుతుంది. ఈ మార్గం జంటనగరాల్లోని రెండు ప్రధాన బస్ స్టేషన్ లను కలపడమే కాకుండా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ను కూడా కలుపుతూపోవడం విశేషం. ఈ మెట్రో మార్గం అందుబాటులోకి రావడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. గతంలో జేబీఎస్- ఎంజీబీఎస్ మధ్య ప్రయాణించాలంటే కనీసం 40 నిమిషాలు పట్టేది, ఇప్పుడు మెట్రో ద్వారా కేవలం 16 నిమిషాల్లో గమ్యస్థానం చేరుకోవచ్చు. ఇది ఎంజీబీఎస్ నుంచి ఇంకా ఫలక్ నుమ వరకు విస్తరించాల్సి ఉంది.
JBS-MGBS Metro Service:
The much awaited day has arrived!
Our Honourable Chief Minister Sri K Chandrashekar Rao has inaugurated the metro services between JBS & MGBS in the presence of Ministers, other dignitaries and L&T officials #ManaMetro @KTRTRS @TelanganaCMO @tstdcofficial @hmrgov @bonthurammohan pic.twitter.com/wNshH8NLzV
— L&T Hyderabad Metro Rail (@ltmhyd) February 7, 2020
శుక్రవారం మేడారం జాతరను సందర్శించి వనదేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించిన సీఎం కేసీఆర్ (CM KCR), ఆ తర్వాత హైదరాబాద్ తిరుగుప్రయాణం అయి శుక్రవారం సాయంత్రం 4 గంటలకు జేబీఎస్ నుంచి మెట్రో రైలును జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, డిప్యూటీ స్పీకర్ పద్మారావు ఇతర ఉన్నతాధికారులు కలిసి ఎంజీబీఎస్ వరకు మెట్రో రైలులో ప్రయాణించారు.
జేబీఎస్- ఎంజీబీఎస్ మార్గం ప్రారంభంతో హైదరాబాదులో 1,2,3 మరియు 4 కారిడార్లు కలిపి ఫస్ట్ ఫేస్ మెట్రో 69 కిలోమీటర్ల నెట్ వర్క్ పూర్తయింది. దేశంలో దిల్లీ తర్వాత రెండో అతిపెద్ద మెట్రో నెట్ వర్క్ గల నగరంగా హైదరాబాద్ రికార్డ్ నెలకొల్పింది.
కాగా, ఈ హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్ట్ అప్పుడెప్పుడో ఉమ్మడి ఏపీలో 2008 లో వైఎస్ఆర్ సీఎంగా ఉన్నప్పుడు మొదలైంది. అయితే అనేక సమస్యలుండటంతో ఈ ప్రాజెక్ట్ పేపర్లకే పరిమితమైంది. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ సర్కార్ ప్రత్యేక చొరవ చూపడంతో ఈ ప్రాజెక్ట్ స్పీడ్ అందుకొని నేడు వాస్తవికరూపం దాల్చింది. భాగ్యనగర వాసుల కల సాకారమైంది.