TSRTC Tussle: ఆర్టీసీ మిలియన్ మార్చ్‌కు పోలీసుల అనుమతి నిరాకరణ, ఎన్ని అవాంతరాలు ఎదురైనా 'ఛలో ట్యాంక్ బండ్' అంటున్న జేఏసీ,  అన్ని వైపుల నుంచి మూకుమ్మడి దాడితో ప్రభుత్వం ఉక్కిరిబిక్కిరి
TSRTC indefinite strike | Chalo Tank Bund Protest | Representational Image | File photo

Hyderabad: తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ టీఎస్ ఆర్టీసీ జేఏసీ (TSRTC JAC)శనివారం 'తెలంగాణ మిలియన్ మార్చి' తరహాలో హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ వద్ద తలపెట్టిన 'ఛలో ట్యాంక్ బండ్' (Chalo Tank Bund) కార్యక్రమానికి హైదరాబాద్ పోలీసులు అనుమతి నిరాకరించారు. ఈరోజు అఖిలపక్ష నేతలంతా కలిసి కమీషనర్ అంజనీ కుమార్ ను కలిసి అనుమతి కోరారు. అయితే ఈ అందోళన కార్యక్రమానికి అనుమతి ఇచ్చేది లేదని కమీషనర్ స్పష్టం చేశారు.

అయితే ఎన్ని నిర్బంధాలు ఎదురైనా ఈ కార్యక్రమం ఖచ్చితంగా నిర్వహించి తీరుతామని ఆర్టీసీ జేఏసీ నాయకులు తేల్చి చెప్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆర్టీసీ కార్మికులంతా ఈరోజు రాత్రికే హైదరాబాద్ చేరుకోవాల్సిందిగా ఐకాస కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి (Ashwatthama Reddy) కార్మికులకు సూచించారు. ఈ నేపథ్యంలో ముందుజాగ్రత్తగా పలుచోట్ల ఆర్టీసీ కార్మికులను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. అయితే ఈ అరెస్టులను అశ్వత్థామ రెడ్డి ఖండించారు. ప్రభుత్వం అక్రమ అరెస్టులకు పాల్పడుతుందని విమర్శించారు, కార్మికులెవ్వరు ఇలాంటి బెదిరింపులకు, నిర్భంధనాలకు భయపడాల్సిన అవసరం లేదన్నారు. అరెస్ట్ చేసిన కార్మికులందరినీ విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

ఇక ఆర్టీసీ కార్మికుల 'ఛలో ట్యాంక్ బండ్' కార్యక్రమానికి బీజేపీ, కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం సహా అన్ని విపక్ష పార్టీలు తమ సంపూర్ణ మద్ధతు ప్రకటించాయి. తమ నాయకులు, కార్యకర్తలందరూ ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చాయి.

ప్రతిరోజు ఆర్టీసీ కార్మికుల ధర్నాలు, నిరసనలు, ప్రతిపక్ష పార్టీల విమర్శలు, హైకోర్టు నిలదీతలు మరియు కేంద్ర ప్రభుత్వ సంస్థలు (EPF) నుంచి నోటీసులు, ఇలా అన్ని వైపుల నుంచి మూకుమ్మడి దాడితో  రాష్ట్ర ప్రభుత్వం ఉక్కిరిబిక్కిరి అవుతుంది.

నవంబర్ 11లోగా ఆర్టీసీ సమస్యపై పరిష్కరించే దిశగా ప్రభుత్వం చొరవ తీసుకోవాలని హైకోర్ట్ ఉత్తర్వులివ్వగా, కార్మికుల పీఎఫ్ ఖాతాలో రూ. 760 కోట్లు జమ కాలేదని నవంబర్ 15లోగా ఆర్టీసీ ఎండీ తమ ఎదుట హాజరు కావాలని కేంద్ర భవిష్య నిధి సంఘం నోటీసులు పంపించింది. ఈరోజు ఆర్టీసీపై ప్రభుత్వం నుంచి ఈ కీలక ప్రకటన వస్తుందనుకున్న దశలో దానికి ఈ రూపంలో బ్రేక్ పడింది. వీటన్నింటి నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఎలా ముందుకు వెళ్తాడనే దానిపై ఉత్కంఠ నెలకొని ఉంది.