Hyderabad Rains (photo-ANI)

హైదరాబాద్ నగరంలో గత రాత్రి నుండి కురుస్తున్న ఎడతెరిపి లేని వర్షాలు నగర జీవన విధానాన్ని అస్తవ్యస్తంగా మార్చాయి. రహదారులు జలమయమవగా, ట్రాఫిక్ సమస్యలు మరింతగా పెరిగాయి. వాతావరణ శాఖ (IMD) ఇప్పటికే తెలంగాణలోని పలు జిల్లాలకు రెడ్, ఆరెంజ్ అలర్ట్‌లు జారీ చేసింది. ఈ రోజు, రేపు (శుక్రవారం, శనివారం) అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని స్పష్టంగా హెచ్చరించింది. గంటకు 40–50 కి.మీ. వేగంతో గాలులు వీస్తాయని, ఉరుములు, మెరుపులు సంభవించే అవకాశం ఉందని తెలిపింది.

ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. వర్షాల తీవ్రత వల్ల ప్రజలకు ఇబ్బందులు రాకుండా తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత విభాగాలకు సూచించారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచిపోవడం వల్ల జలదిగ్బంధం సమస్యలు తలెత్తే అవకాశం ఉందని అధికార యంత్రాంగం ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది.

తెలంగాణలో మరో వారం రోజుల పాటు భారీ వర్షాలు, ఈ నెల 30 వరకు పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరిక

అంతేకాకుండా, పోలీసులు కూడా ముందస్తు చర్యలపై దృష్టి సారించారు. హైదరాబాద్ నగర పోలీస్ కమిషనరేట్, సైబరాబాద్ పోలీసులు సంయుక్తంగా ఐటీ కంపెనీలకు ప్రత్యేక సూచన జారీ చేశారు. ఉద్యోగుల భద్రతను దృష్టిలో ఉంచుకుని, ట్రాఫిక్ భారాన్ని తగ్గించడానికి వీలైనంతవరకు వర్క్ ఫ్రం హోమ్ (WFH) సౌకర్యం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే నగరంలోని అనేక రూట్లలో వర్షపు నీరు చేరి వాహనాలు కదలలేని పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితుల్లో ఉద్యోగులను ఆఫీసుకు రప్పించడం ప్రమాదకరమని, ఇంటి నుండి పనిచేయడం ద్వారా ట్రాఫిక్ ఒత్తిడి కూడా తగ్గుతుందని పోలీసులు తెలిపారు.

ఉద్యోగులు కూడా తమ కంపెనీల మేనేజర్లను వర్క్ ఫ్రం హోమ్ కోసం కోరుతున్నట్లు సోషల్ మీడియాలో సందేశాలు పెడుతున్నారు. దూర ప్రయాణం చేయాల్సిన అవసరం లేకుండా ఉంటే, వర్షాల సమయంలో ఎంతో ఉపశమనం కలుగుతుందని వారు చెబుతున్నారు. పోలీసుల సూచన మేరకు మూడు రోజుల పాటు వీలైనంతవరకు ఇంటి నుంచే పనిచేయాలని సూచనలు వెలువడ్డాయి. భారీ వర్షాల ప్రభావం రవాణా రంగంపైనా పడింది. హైదరాబాద్‌కు రావాల్సిన అనేక విమానాలను రద్దు చేయడం లేదా ఇతర నగరాలకు మళ్లించడం జరిగింది. ముఖ్యంగా కోల్‌కతా, ముంబై, పూణే నుండి బయలుదేరిన ఇండిగో విమానాలు విజయవాడకు మళ్లించబడ్డాయి. దీనివల్ల ప్రయాణికులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

రాష్ట్రంలోని ఆదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ వంటి జిల్లాల్లో కూడా భారీ నుండి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండీ స్పష్టంగా పేర్కొంది. సెప్టెంబర్ 26 నుండి అక్టోబర్ 2 వరకు రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు నిరంతరంగా కొనసాగే అవకాశం ఉందని అంచనా వేసింది.

వాతావరణ శాఖ ప్రజలకు భద్రతా సూచనలు కూడా చేసింది. ముఖ్యంగా మెరుపులు, గాలివానల సమయంలో బహిరంగ ప్రదేశాలకు వెళ్లకుండా ఇంటి వద్దే ఉండాలని హెచ్చరించింది. లోతట్టు ప్రాంతాల్లోకి వెళ్లకూడదని, బలహీన నిర్మాణాల సమీపంలో ఉండరాదని సూచించింది. రైతులు, ప్రయాణికులు, పట్టణ వాసులు అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచనలు జారీ చేసింది. హైదరాబాద్‌లో పోలీసులు జారీ చేసిన తాజా వర్క్ ఫ్రం హోమ్ సూచన ఉద్యోగులకు ఒక ఊరట కలిగించింది. ఒకవైపు రోడ్లపై వాహనాల రద్దీ తగ్గుతుందని, మరోవైపు ప్రజల భద్రతకు సహకారం అందుతుందని అధికారులు భావిస్తున్నారు. వర్షాల కారణంగా సమస్యలు తప్పకపోయినా, ముందస్తు చర్యలతో వాటిని కొంత వరకు తగ్గించవచ్చని నిపుణులు అంటున్నారు.