Hyderabad Shocker: అనాథని చేరదీస్తే..డబ్బు కోసం ప్రియుడితో కలిసి పెంపుడు తల్లిని చంపేసిన కసాయి కూతురు, హైదరాబాద్‌లో దారుణ ఘటన, నిందితులని అరెస్ట్ చేసిన పోలీసులు
Image used for representational purpose only. | File Photo

Hyderabad, Sep 12: తమ దేశం ,తమ మతం కాకున్నా.. అనాథను సొంత కూతురిలా ఆదరించి..పెంచి పెద్దచేసిన ఓ విదేశీయురాలు అదే యువతి చేతిలో దారుణంగా హత్యకు (French woman killed by adopted daughter) గురైంది. ప్రేమ పెళ్లి కాదన్నందుకు, అడిగిన డబ్బు ఇవ్వనందుకు పెంపుడు తల్లిని ప్రియుడు, అతడి స్నేహితుడితో కలిసి ఓ యువతి హత్య చేయించి.. కటకటాల పాలైంది. శనివారం శంషాబాద్‌ డీసీపీ ప్రకాష్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ఫ్రాన్స్‌కి చెందిన మేరీ క్రిస్టీనా(68) ( French woman)తన కుమార్తెలు మేరీ సొలాంగ్‌, రెబెకాలను తీసుకొని 3 దశాబ్దాల క్రితం హైదరాబాద్‌ వచ్చారు.

గండిపేట్‌ మండలం, దర్గాఖలీజ్‌ఖాన్‌ కాలనీలో స్థిరపడ్డారు. మేరీ సొలాంగ్‌ ప్రశాంత్‌ను పెళ్లాడి సమీపంలోని సన్‌సిటీలో నివసిస్తోంది. మరో కుమార్తె పుదుచ్చేరిలో ఉంటోంది. ఒంటరిగా ఉంటున్న క్రిస్టినా అనాథలైన రోమా(24), ప్రియాంకలను ఇంట్లో ఉంచుకుని పోషిస్తోంది. రోమాకు పెళ్లి చేయాలనుకుని సంబంధాలు చూస్తోంది. ఈ క్రమంలో రోమా అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందిన విక్రమ్‌ శ్రీరాములు(25)తో ప్రేమలో పడింది.

పెంపుడు తల్లికి తెలియకుండా కొండాపూర్‌లో అద్దె ఇంట్లో అతనితో సహజీవనం చేస్తోంది. రోమా ప్రవర్తనపై అనుమానం రావడంతో మేరీ మందలించింది. బొటిక్‌ పెట్టుకుంటానని రూ.2 లక్షలు ఇవ్వాలని రోమా ఒత్తిడి చేయగా.. ఆమె నిరాకరించింది. ఈ క్రమంలో క్రిస్టీనాను హత్యచేసి, ఆమె ఖాతాలోని నగదును చేజిక్కించుకోవాలని ప్రియుడు విక్రమ్‌, అతని పాత స్నేహితుడు నెల్లూరు వాసి రాహుల్‌గౌతమ్‌(24)తో కలిసి రోమా పథకం పన్నింది. ఈ నెల 8న సాయంత్రం మేరీ తన కారులో టోలీచౌకి స్కూల్‌కు వెళ్లి రోమాను అక్కడ వదిలి తిరిగి ఇంటికి చేరుకుంది.

హైదరాబాద్‌లో ఆరేళ్ల చిన్నారిపై తెగబడిన కామాంధుడు, దారుణంగా అత్యాచారం చేసి హత్య, నిందితుడు ఇంట్లో చిన్నారి మృతదేహం, నిందితుడిని ఉరి తీయాలని స్థానికులు డిమాండ్‌

ముందస్తు ప్రణాళిక ప్రకారం విక్రమ్‌, రాహుల్‌ ఆమె ఇంటి వద్ద కాపు కాశారు. కారును ఇంటిలో పార్కింగ్‌ చేయగానే మేరీపై విక్రమ్‌, రాహుల్‌ దాడిచేసి తాడుతో మెడకు ఉరి బిగించారు. మేరీ మృతదేహాన్ని ఆమె కారులోనే వేసుకుని హిమాయత్‌సాగర్‌ సమీప పొదల్లో పడేశారు. అదే కారులో ఆమె ఇంటికి వచ్చి.. ల్యాప్‌టాప్‌, సెల్‌ఫోను తీసుకుని పరారయ్యారు. మర్నాడు మేరీ బ్యాంక్‌ఖాతా నుంచి రూ.రెండు లక్షలను రోమా తన ఖాతాలోకి మళ్లించుకుంది. మేరీ సెల్‌ఫోను మూగబోవడంతో కుమార్తె మేరీ, ప్రశాంత్‌ దంపతులు రాజేంద్రనగర్‌ ఠాణాలో ఫిర్యాదు చేయగా అదృశ్యం కేసు నమోదు చేశారు. రోమా కదలికలపై అనుమానంతో పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా గుట్టు రట్టయింది. రోమా, విక్రమ్‌, రాహుల్‌ని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. రాజేంద్రనగర్‌ ఏసీపీ సంజయ్‌కుమార్, సీఐ కనకయ్య, ఎస్‌ఓటీ పోలీసులు కేసు చేధించడంలో మంచి ప్రతిభ కనబర్చారని డీసీపీ ప్రకాష్‌రెడ్డి ఈ సందర్భంగా అభినందించారు.