
నిన్న రాత్రి హైదరాబాద్ నగరం తడిసిముద్దయింది. అర్ధరాత్రి వరకూ ఐదు గంటలపాటు కుంభవృష్టిలా కురిసిన వాన నగర జీవితాన్ని అతలాకుతలం చేసింది. ఒక్కసారిగా ఆకాశం చిల్లుపడినట్టే కురిసిన వర్షానికి నిమిషాల వ్యవధిలోనే రోడ్లు నదుల్లా మారిపోయాయి. లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. పలు అపార్ట్‌మెంట్లలోకి, ఇళ్లలోకి వరదనీరు చొరబడి ప్రజలకు ఇబ్బందులు తలెత్తించాయి.
ప్రధాన రహదారులపై మోకాళ్లలోతు నీరు నిలిచిపోయింది. డ్రైనేజీలు, ఓపెన్‌నాలాలు పొంగిపొర్లడంతో నగరంలో ట్రాఫిక్ కుదేలైంది. మెట్రో స్టేషన్లు, బ్రిడ్జిల కింద కూడా నీరు చేరిపోవడంతో వాహనాలు కదల్లేని పరిస్థితి. కొన్నిచోట్ల వరదనీటి ఒత్తిడికి వాహనాలే కొట్టుకుపోయాయి. మాదాపూర్–హైటెక్‌సిటీ, అమీర్‌పేట–బంజారాహిల్స్, మియాపూర్–చందానగర్ మార్గాల్లో కిలోమీటర్లకొద్దీ ట్రాఫిక్ జామ్ అయింది. రాత్రి పన్నెండు గంటల వరకూ ముషీరాబాద్ తాళ్లబస్తీ అత్యధికంగా 18.4 సెం.మీ. వర్షపాతం నమోదు చేసి ఈ సీజన్‌లో రికార్డు సృష్టించింది.
ఇక ముందు కూడా రాష్ట్రంలో వానలు కొనసాగుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. వచ్చే మూడు రోజులు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు చాలా జిల్లాల్లో కురిసే అవకాశముందని తెలిపింది. అయితే కొన్ని ప్రాంతాల్లో మాత్రం భారీ వర్షాలు ముంచెత్తే పరిస్థితి ఉంటుందని స్పష్టం చేసింది. వర్షాలు మాత్రమే కాదు, ఉరుములు, మెరుపులు, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు కూడా దట్టిగా వీచే అవకాశం ఉందని హెచ్చరిక జారీ చేసింది.
ప్రస్తుతం మరాత్వాడ, విదర్భ ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల చక్రవాత ఆవర్తనాలు, అలాగే మధ్యప్రదేశ్ నుంచి దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశు వరకు ఏర్పడిన ద్రోణి ప్రభావం వల్లే ఈ వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ వివరించింది. బుధవారం, గురువారం, శుక్రవారం కూడా ఈ ప్రభావం కొనసాగుతుందని అధికారులు చెబుతున్నారు. అంటే, నగర వాసులు ఇంకా కొన్ని రోజులు వానలతో తడిసిముద్ద కావాల్సిందే.
Hyderabad Rains Videos
#HyderabadRains – Traffic & Waterlogging.
Heavy rains lashed #Hyderabad on Wednesday evening, leading to waterlogging at #Lakdikapul, Gangaram, and Ayodhya Junction, causing traffic snarls across the city.#TrafficAlert #FloodAlert #HydNews pic.twitter.com/8N0qITjlMD
— Dinesh Akula (@iamdineshakula) September 18, 2025
నీళ్లతో నిండిపోయిన రహదారులు, నిలిచిపోయిన ట్రాఫిక్, తడిసిన ఇళ్లు, వరద నీటిలో చిక్కుకుపోయిన వాహనాలు – ఇవన్నీ కలిపి నిన్నటి రాత్రి నగరానికి మరపురాని అనుభవంగా మిగిలిపోయాయి. ఇక ముందు రెండు రోజులు జాగ్రత్తగా ఉండాలని అధికారుల సూచిస్���ున్నారు.
ఈ రోజు విషయానికి వస్తే.. మరో 3 గంటల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసే అవకాశం (Rain) ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. జనగామ, కరీంనగర్, ములుగు, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. అదేవిధంగా ఆదిలాబాద్, కుమ్రం భీం, జగిత్యాల, సిద్దిపేట, వికారబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. దీంతోపాటు ఉరుములు, మెరుపులు, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలుల వీస్తాయని తెలిపింది.