Tank Bund Road Hyderabad | Photo: Twitter

Hyderabad, August 26: హుస్సేన్‌సాగర్‌ అందాలను వీక్షించేందుకు మరియు సందర్శకుల రాకపోకలను సులభతరం చేయడానికి ఇకపై ప్రతి ఆదివారం సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ట్యాంక్ బండ్‌ను మూసివేస్తున్నట్లు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.

ఆదివారం సాయంత్రం నుంచి ట్యాంక్‌బండ్‌పై వాహనాలను అనుమతించబోమని నగర పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్‌ స్పష్టం చేశారు. సందర్శకుల వాహనాల పార్కింగ్‌ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. ట్యాంక్‌బండ్‌ సందర్శనకు అంబేద్కర్‌ విగ్రహం వైపు నుంచి వచ్చే వారు లేపాక్షి వరకు, రాణిగంజ్‌ వైపు నుంచి వచ్చే వారు చిల్డ్రన్‌పార్కు వరకు ఇరువైపులా వాహనాలు నిలుపుకునేలా స్థలాలు కేటాయించినట్లు తెలిపారు.

కార్లు, ఆటోలు, ద్విచక్రవాహనాలను వేర్వేరుగా పార్కింగ్‌ చేయాలన్నారు. ఆదివారం సాయంత్రం ట్యాంక్‌బండ్‌ రూట్‌లో ప్రయాణించే వారు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని, పీవీమార్గ్‌, లోయర్‌ ట్యాంక్‌బండ్‌ రూట్లను ఉపయోగించుకోవాలని ట్రాఫిక్‌ డీసీపీ-1 చౌహాన్‌ సూచించారు.

ట్యాంక్ బండ్‌ పరిసరాలను చూడటానికి రోడ్లు దాటడం పాదచారులకు ఒక కల అని మంత్రి కేటీఆర్ కు ఓ సిటిజన్ ట్వీట్ చేయడంతో, అందుకు స్పందించిన మంత్రి, వీకెండ్స్ లలో ట్యాంక్‌బండ్‌ వద్ద వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించాలని నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్‌ను కోరారు. దీనికి స్పందించిన పోలీస్ కమీషనర్ వచ్చే ఆదివారం నుండి, ట్యాంక్ బండ్‌ మీదుగా వెళ్లే సాధారణ ట్రాఫిక్ ను ఐదు గంటల పాటు నిలిపివేస్తామని, మరియు ప్రత్యామ్నాయ మార్గాల్లో ట్రాఫిక్ సజావుగా సాగడానికి మళ్లింపులు అమలు చేస్తామని వెల్లడించారు.

ట్యాంక్ బండ్‌పై రాష్ట్ర ప్రభుత్వం సుందరీకరణ పనులు చేపడుతున్న దృష్ట్యా, వారాంతాల్లో పెద్ద సంఖ్యలో సందర్శకులు తరలివస్తున్నారని, వారి భద్రత కోసం ట్రాఫిక్ ఆంక్షలు విధించబడిన నేపథ్యంలో వాహనదారులు సహకరించి ఆదివారం సాయంత్రం 5 నుంచి 10 గంటల మధ్య ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని కమీషనర్ విజ్ఞప్తి చేశారు.