Medak, April 30: మెదక్ జిల్లా అల్లాదుర్గంలో బీజేపీ ఎన్నికల ప్రచార సభలో ప్రధాని మోదీ (PM Modi Election Campaign in Telangana) పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ... కాంగ్రెస్ ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు. ముదిరాజ్, లింగాయత్‌లకు కాంగ్రెస్ పార్టీ తీవ్ర అన్యాయం చేసిందని మండిపడ్డారు. ముస్లింలకు రిజర్వేషన్ల ద్వారా రాజ్యాంగ వ్యతిరేక మతపర రిజర్వేషన్లకు పూనుకుందన్నారు.
నాకు రాజ్యాంగమే ధర్మగ్రంథం. నేను బతికి ఉన్నంత వరకు రాజ్యాంగాన్ని (I will protect the Constitution till I live) కాపాడుతాను. నేను బతికున్నంత వరకు దళితులు, ఎస్టీలు, ఓబీసీలకు రిజర్వేషన్లను కాపాడుతాను. నేను ఉన్నంత వరకు ముస్లిం రిజర్వేషన్లను అమలు కానిచ్చే ప్రసక్తి లేదు. కానీ కాంగ్రెస్ వస్తే రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తుంద'ని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. బీజేపీ మూడోసారి అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని రద్దు చేస్తుందన్న విమర్శలకు దీటుగా కౌంటర్ ఇచ్చారు. రిజర్వేషన్ల వివాదంపై తొలిసారి స్పందించిన ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ , హైదరాబాద్ వేదికగా ఆయన ఏమన్నారంటే?
బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు బంజారా సమాజాన్ని కూడా మోసం చేశాయన్నారు. లింగాయత్‌ల రిజర్వేషన్లకు కాంగ్రెస్ వ్యతిరేకమని ఆరోపించారు. 2004లో కాంగ్రెస్ పార్టీకి ఉమ్మడి ఏపీలో రికార్డ్ స్థాయి ఎంపీ సీట్లు వచ్చాయని, అయినా దళితులు, ఓబీసీలకు అన్యాయం చేసిందన్నారు. రాజ్యాంగం అంటే కాంగ్రెస్ పార్టీకి గౌరవం లేదన్నారు. అంబేడ్కర్ విషయంలోనూ అవమానకరంగా వ్యవహరించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి రాజ్యాంగానికి వ్యతిరేకమే అన్నారు. నెహ్రూ, ఇందిరాగాంధీ రాజ్యాంగాన్ని పలుమార్లు అవమానించారన్నారు.
ఎమర్జెన్సీ విధించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది అని దుయ్యబట్టారు. నాడు ప్రధాని మన్మోహన్ సింగ్ తీసుకువచ్చిన ఆర్డినెన్స్‌ను యువరాజు మీడియా ముందే చించివేయడం ద్వారా ప్రధానిని... రాజ్యాంగాన్ని అవమానించారన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీల హక్కులను కాలరాస్తూ మతపరమైన రిజర్వేషన్లను పెట్టి రాజకీయాలు చేస్తూ రాజ్యాంగాన్ని అవమానించారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ రాజకీయ అవసరాల కోసం రాజ్యాంగాన్ని ఉపయోగించుకుందని ఆరోపించారు. రాజీవ్ గాంధీ హయాంలో స్వేచ్ఛ లేకుండా పోయిందన్నారు. మోడీ, అమిత్ షా అన్ని వ్యవస్థలను వాడుకుంటున్నారు. బీజేపీ ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలోకి పడేస్తుంది. -సీఎం రేవంత్ రెడ్డి
రాజ్యాంగాన్ని తాను పవిత్ర గ్రంథంలా భావిస్తానని ప్రధాని అన్నారు. తాను మొదటిసారి ప్రధాని అయినప్పుడు పార్లమెంట్ భవనం ముందు మోకరిల్లానని గుర్తు చేసుకున్నారు. 2019లో రెండోసారి ప్రధాని అయ్యాక రాజ్యాంగ పవిత్ర గ్రంథాన్ని సెంట్రల్ హాలులో ఏర్పాటు చేసినట్లు చెప్పారు. తాను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజ్యాంగాన్ని ఏనుగు అంబారీపై ఊరేగించానని... ఆ ఊరేగింపుతో తాను నడిచానన్నారు. తాను తొలి రోజు నుంచీ రాజ్యాంగానికి కట్టుబడి ఉన్నానన్నారు. రాజ్యాంగానికి గౌరవం ఇచ్చిన ఒకే ఒక్క ముఖ్యమంత్రిని తానేనన్నారు. రాజ్యాంగం అంటే తనకు మహాభారతం, రామాయణం, బైబిల్, ఖురాన్ వంటి పవిత్ర గ్రంథాలన్నారు.
రాజ్యాంగాన్ని కాపాడే బాధ్యతను తాను తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అన్యాయం చేసే మతపరమైన రిజర్వేషన్లకు తాము వ్యతిరేకమని పునరుద్ఘాటించారు. రాజ్యాంగంపై తన చిత్తశుద్ధిని ఎవరూ శంకించలేరన్నారు. 'తెలంగాణ నుంచి ప్రకటిస్తున్నాను... నేను మూడోసారి ప్రధాని అయ్యాక 75 ఏళ్ల రాజ్యాంగం సందర్భంగా అంగరంగ వైభవంగా ప్రతి పల్లెలో, ప్రతి పట్టణంలో రిపబ్లిక్ డేను నిర్వహిస్తాం' అన్నారు. ఈ దేశాన్ని పాలించే హక్కు తమకు ఉందని కొందరు రాజవంశీకులు భావిస్తున్నారని చురక అంటించారు. ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నామని ప్రధాని హామీ ఇచ్చారు.
ఫేక్ వీడియోలను విడుదల చేసే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టేది లేదని, ఈ వీడియోల విడుదల వెనుక డబుల్ ఆర్ పాత్ర ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. రేవంత్ రెడ్డి ఈ వీడియోలను విడుదల చేస్తున్నారని ఆరోపించారు.డబుల్ ఆర్‌కు తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమన్నారు. ప్రతిపక్షాలు ఫేక్ వీడియోలతో ప్రజల్లో గందరగోళం సృష్టించే ప్రయత్నం చేస్తున్నాయని మండిపడ్డారు.
అయోధ్యలో రామమందిరాన్ని నిర్మించింది నరేంద్ర మోదీ కాదు... మీరు మీ వేలితో వేసిన ఒక్కో ఓటు ద్వారా బాలరాముడి ఆలయం నిర్మించబడిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ప్రభుత్వం పటిష్ఠంగా ఉంటే ఏం జరుగుతుందో ఈ పదేళ్లలో జరిగిన అభివృద్ధిని చూశారన్నారు. భారత్‌కు స్వాతంత్య్రం రాకముందే రామమందిర నిర్మాణం జరగాల్సింది కానీ, ఢిల్లీలో నాటి నుంచి పటిష్ఠ ప్రభుత్వం లేకపోవడంతో నిర్మించలేకపోయారన్నారు.
ఇప్పుడు కూడా రామాలయాన్ని నిర్మించింది తాను కాదని, ప్రజలు వేసిన ఓటు ద్వారా ఈ ఆలయ నిర్మాణం సాధ్యమైందని పేర్కొన్నారు. మీరు వేసే ఓటు మీ కలను సాకారం చేసేందుకే ఉపయోగిస్తామని హామీ ఇచ్చారు. మా జీవితం అంతా దేశం కోసమేనని మోదీ అన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఓట్ల కోసం రాజకీయం చేస్తుందని విమర్శించారు. హైదరాబాద్ వంటి ప్రాంతాల్లో శ్రీరామనవమి శోభాయాత్రకు కూడా ఎన్నో ఆంక్షలు విధించారని ఆరోపించారు. మన పండుగలు చేసుకోవాలంటే ఇన్ని ఆంక్షలా? అని ప్రశ్నించారు. ఇదంతా ఓటు బ్యాంకు రాజకీయం కోసమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రధాని మోదీ ప్రసంగిస్తుండగా పెద్ద ఎత్తున మోదీ మోదీ అంటూ నినాదాలు చేశారు. ఈ మీ ప్రేమను చూస్తుంటే ఈ ప్రభుత్వానికి కనువిప్పు కలగాలన్నారు. పలుమార్లు మోదీ మోదీ అంటూ కార్యకర్తలు, అభిమానులు నినాదాలు చేశారు. కాంగ్రెస్ పార్టీ గెలవకుంటే ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తం చేస్తుందని ఆరోపించారు.
తెలుగు సినీ పరిశ్రమ నుంచి ట్రిపుల్ ఆర్ సూపర్ హిట్ మూవీ వచ్చిందని, కానీ తెలంగాణ కాంగ్రెస్ మాత్రం డబుల్ ఆర్ తీసుకు వచ్చిందని ఎద్దేవా చేశారు. తెలంగాణలో డబుల్ ఆర్ ట్యాక్స్ నడుస్తోందన్నారు. వ్యాపారవేత్తలు ఈ డబుల్ ఆర్ పన్నును కట్టవలసిన పరిస్థితి ఏర్పడిందన్నారు. కాంగ్రెస్ మళ్లీ పాతరోజులను తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తోందన్నారు. గతంలో కాంగ్రెస్ చేతిలో దేశం పూర్తి అవినీతిమయమైందని ఆరోపించారు.
డబుల్ ఆర్ ట్యాక్స్ పేరుతో రాష్ట్రాన్ని దోచుకునే ప్రయత్నం చేస్తోందన్నారు. గతంలో బీఆర్ఎస్, ఇప్పుడు తెలంగాణను దోచుకుంటున్నాయని ఆరోపించారు. అందుకే బీజేపీని గెలిపించాలని కోరారు. డబుల్ ఆర్ ట్యాక్స్ ఢిల్లీకి చేరుతోందని, ఈ డబుల్ ఆర్ ఎవరో మీకు ఇప్పటికే అర్థమై ఉంటుందన్నారు. ఈ డబుల్ ఆర్ ట్యాక్స్ పైన విస్తృత చర్చ సాగుతోందన్నారు. ఈ డబుల్ ఆర్ ట్యాక్స్‌తో ప్రజలు విసిగిపోయారన్నారు. ఇలాంటి ట్యాక్స్ వేస్తున్న కాంగ్రెస్‌కు మనం షాక్ ఇవ్వకుంటే రానున్న అయిదేళ్లు మరిన్ని ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒకే గూటి పక్షులని విమర్శించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే వారసత్వ సంపదపై పన్నును తీసుకువచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించారు. అప్పుడు మన సంపాదనలో 55 శాతం మన పిల్లలకు దక్కకుండా ప్రభుత్వానికి పోతుందని, దీని పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ వస్తే ప్రజల సొమ్ముకు రక్షణ ఉండదన్నారు. మేం అధికారంలోకి వస్తే మీ సంపదలో 55 శాతం వాటాను లాక్కుంటామని కాంగ్రెస్ చెబుతోందన్నారు. బీఆర్ఎస్ గత పదేళ్లలో దోచుకుతిందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాళేశ్వరం అవినీతిపై పదేపదే మాట్లాడిందని, ఇప్పుడు మాత్రం ఆ అవినీతి ఫైళ్లను తొక్కి పెట్టిందని ఆరోపించారు.
కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల అవినీతి ఢిల్లీ లిక్కర్ స్కాం వరకు పాకిందని విమర్శించారు. లిక్కర్ స్కాం బయటపడ్డాక ఇద్దరూ తోడుదొంగలని తేలిందన్నారు. వందరోజుల్లో రుణమాఫీ చేస్తానన్న కాంగ్రెస్ ఆ హామీని ఇప్పటి వరకు నెరవేర్చలేదన్నారు. రూ.500 పంట బోనస్ ఇప్పటి వరకు ఇవ్వలేదని మండిపడ్డారు. కాంగ్రెస్ ఎప్పుడూ పేదలను పేదలుగానే ఉంచేందుకు ప్రయత్నించిందన్నారు. కానీ తమ ప్రభుత్వం మహిళాశక్తి కోసం ఎన్నో పథకాలు తీసుకు వచ్చిందన్నారు. కేంద్రం నిర్మించే పక్కా ఇళ్లను కూడా మహిళల పేరు మీదే ఇస్తున్నామని తెలిపారు.
బీజేపీ పదేళ్ల కాలంలో దేశం ఎంత అభివృద్ధి చెందిందో అందరూ చూశారన్నారు. కానీ కాంగ్రెస్ మాత్రం దేశాన్ని అవినీతి ఊబిలోకి నెట్టిందన్నారు. కాంగ్రెస్ అబద్ధాలు, ఓటు బ్యాంకు రాజకీయాలు, అవినీతి, మాఫియా, కుటుంబ రాజకీయాలు చేస్తుందన్నారు. కాంగ్రెస్ పంచసూత్రాలు ఇవేనని ఎద్దేవా చేశారు.