CM KCR (Photo-Video Grab)

CM KCR Speech Highlights: 75వ స్వాతంత్ర్య దినోత్సవం (India Independence Day 2021) సందర్భంగా సైనిక వీరులకు సీఎం కేసీఆర్ నివాళులర్పించారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‎లో సైనిక వీరుల స్మారకం వద్ద పుష్పగుచ్చం సమర్పించి అమరులకు నివాళి అర్పించారు. అనంతరం గోల్కొండ కోటకు సీఎం చేరుకుని.. రాణీమహల్ లాన్స్‌లో జాతీయ జెండాను కేసీఆర్ ఎగురవేశారు. అనంతరం పోలీస్ బలగాల గౌరవ వందనాన్ని ముఖ్యమంత్రి స్వీకరించారు. అనంతరం కోటలోని రాణిమహల్ ప్రాంగణం నుంచి సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రజలనుద్దేశించి (CM KCR Speech Highlights) ప్రసంగించారు.

తెలంగాణ సాధించుకున్నప్పటి నుంచి ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా తమ ప్రభుత్వం పని చేస్తోందని సీఎం కేసీఆర్‌ (CM KCR) పేర్కొన్నారు. చేపట్టిన సంస్కరణలతోనే పరిస్థితి మారిందని, తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి ఇచ్చిన ప్రతీ హామీకి కట్టుబడి పని చేస్తున్నామని సీఎం కేసీఆర్‌ ఉద్ఘాటించారు. ‘‘ప్రతీ రంగంలో అభివృద్ధి సాధించాం. దేశంలోనే తెలంగాణను నెంబర్‌ వన్‌గా, ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దాం’’ అని ఆయన పేర్కొన్నారు. కరోనా తీవ్ర అవరోధాలు సృష్టించినా అభివృద్ధి ఆగలేదు. రాష్ట్రాభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తున్నామని, అన్ని రంగాల అభివృద్ధి, అన్ని వర్గాల సంక్షేమం కోసం ప్రణాళికలు రూపొందించామని ఆయన పేర్కొన్నారు. విద్యుత్‌, తాగు, సాగునీటి సమస్యలను శాశ్వతంగా పరిష్కరించినట్లు పేర్కొన్నారు.

రూ.100 లక్షల కోట్ల మాస్టర్ ప్లాన్, పీఎం గతిశక్తి ప్రణాళికను త్వరలో ప్రారంభిస్తున్నామని తెలిపిన ప్రధాని, భారత స్వాతంత్ర్య దినోత్సవం సంధర్భంగా ఎర్రకోట నుంచి జాతినుద్దేశించి ప్రసంగించిన పీఎం నరేంద్ర మోదీ

ఏడేళ్లలో స్థిరమైన ఆర్ధిక అభివృద్దితో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం నెంబర్ వన్ గా నిలిచిందని తెలంగాణ సీఎం కేసీఆర్ గోల్కొండ కోట వేదికగా చాటి చెప్పారు. దేశంలో కనీస అవసరాల కోసం ప్రజలు ఇంకా అల్లాడే పరిస్థితులే ఉన్నాయన్నారు. దేశం సాధించిన అభివృద్దిని సమీక్ష చేసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. స్వరాష్ట్రం సాధించుకొన్న రోజు నుండి అన్ని రంగాల అభివృద్దిపై దృష్టి పెట్టామన్నారు. విద్యుత్, తాగు, సాగునీటి సమస్యలు ఇప్పుడు లేవన్నారు. యాదాద్రి పవర్ ప్లాంట్ అందుబాటులోకి వస్తే తెలంగాణ రాష్ట్రం విద్యుత్ లో మిగులు సాధ్యమౌతోందన్నారు.రాష్ట్ర జీఎస్‌డీపీలో 20 శాతం వ్యవసాయరంగం నుండి వస్తోందన్నారు. తెలంగాణ ఏర్పాటైన తర్వాత దండగ అనుకొన్న వ్యవసాయం పండుగలా మారిందని సీఎం కేసీఆర్‌ చెప్పారు.

Here's TS CMO Tweets

వ్యవసాయరంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టామని, ఆ సంస్కరణలతో తెలంగాణ ‘రైస్‌ బౌల్‌ ఆఫ్‌ ఇండియా’గా నిలిచిందని సీఎం కేసీఆర్‌ అభివర్ణించారు. రైతులకు రూ.50వేల లోపు రుణాల మాఫీ ఇవ్వడంతో పాటు ధరణి పోర్టల్‌ ద్వారా భూమి లెక్కలు తేల్చామని, మిషన్‌ భగీరథతో ఇంటింటికీ మంచినీటిని అందిస్తున్నామని పేర్కొన్నారు. బస్తీ ఆస్పత్రులతో మెరుగైన ఫలితాలు వస్తున్నాయి, వరంగల్‌లో అధునాతన ఆస్పత్రిని నిర్మిస్తున్నామని సీఎం కేసీఆర్‌ తెలిపారు.

రైతులు పండించిన పంటలకు మరింత గిట్టుబాటు ధర లభించి, రైతులకు అదనపు మేలు చేకూరాలన్న లక్ష్యంతో హైదరాబాద్ జిల్లా మినహా పాత తొమ్మిది జిల్లాల పరిధిలో రైస్ మిల్లులు, ఇతర ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. వీటిద్వారా రైతులు కష్టపడి పండించిన వ్యవసాయోత్పత్తులకు మరింత మంచి ధర లభించి, రైతాంగం జీవనం సుసంపన్నం కావాలన్నదే టీఆర్ఎస్ ప్రభుత్వ ఆశయమన్నారు.

తెలంగాణ ప్రభుత్వం రైతుల ప్రభుత్వం. రైతులు ఎదుర్కొంటున్న సమస్యల మూల కారణాలన్నింటినీ గ్రహించి పరిష్కార చర్యలు తీసుకున్నది. తరాలతరబడి అనేక భూ వివాదాలకు దారితీస్తున్న పరిస్థితులను మార్చడానికి నూతన భూపరిపాలనా విధానాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ప్రగతి నిరోధకంగా మారిన వీఆర్వోల వ్యవస్థను తొలగించింది. మూడేళ్ల కష్టపడి ధరణి పోర్టల్‌ను ఆవిష్కరించి, భూరికార్డుల నిర్వహణలో పారదర్శకతను తెచ్చింది. దీనివల్ల రాష్ట్రంలోని ప్రతి అంగుళం భూమి ప్రభుత్వ రికార్డుల్లో నమోదవుతుంది. అన్నదాతలు ఇకపై నిశ్చింతగా ఉండొచ్చు. ధరణిలో నమోదయిన భూ హక్కులు తొలగించే అధికారం ఎవ్వరికీ లేదు’ అని స్పష్టం చేశారు.

ఇచ్చిన హామీ మేరకు మూడు లక్షల మంది రైతులకు రూ.25 వేల వరకు ఉన్న పంట రుణాలను ప్రభుత్వం ఇప్పకే మాఫీ చేసిందని సీఎం కేసీఆర్‌ అన్నారు. ఆగస్టు 16 (సోమవారం) నుంచి రాష్ట్రంలోని 6 లక్షల మంది అన్నదాతలకు రూ.50 వేలలోపు ఉన్న పంట రుణాలను మాఫీ చేస్తున్నామన్నారు. ఈ నెలాఖరు నాటికి ఈ ప్రక్రియ పూర్తవుతుందని చెప్పారు. దీంతో మొత్తం 9 లక్షల మంది రైతన్నలు రుణ విముక్తులవుతారని చెప్పారు. మిగిలిన వారికి కూడా దశలవారీగా రుణమాఫీ పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తుందని స్పష్టం చేశారు.

చేనేత కార్మికులను ఆదుకోవడానికి ప్రభుత్వం అనేక పథకాలను రూపొందించిందని సీఎం కేసీఆర్‌ అన్నారు. చేనేత కార్మికులకు కూడా ఆసరా పింఛన్లు అందిస్తున్నామని చెప్పారు. ‘ఇప్పటికే దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా చేనేతలకు 50 శాతం సబ్సిడీ మీద నూలు, రసాయనాలు, రంగులు ప్రభుత్వం అందజేస్తున్నది. చేనేత కార్మికుల కుటుంబాలను మరింత ఆదుకోవడానికి రాష్ట్రంలో రైతన్నలకు అమలుచేస్తున్న రైతుబీమా తరహాలో త్వరలోనే చేనేత బీమా పథకం అమలు చేస్తామన్నారు. దురదృష్టవశాత్తు ఏ నేత కార్మికుడైనా మరణిస్తే ఈ పథకం కింద అతని కుటుంబం ఖాతాలో రూ.5 లక్షల బీమా సొమ్ము జమవుతుంది. చేనేత రంగాన్ని ఆదుకోవడానికి టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రత్యేక కార్పస్ ఫండ్ కూడా ఏర్పాటు చేయనుంది’ వెల్లడించారు.

తెలంగాణ రాష్ట్రంలో ద‌ళిత బంధు ప‌థ‌కాన్ని ఉద్య‌మంగా మారుస్తూ.. న‌వ‌శ‌కానికి నాంది ప‌లుకుతాం. దేశంలో స‌రికొత్త చ‌రిత్ర‌ను సృష్టించి.. ద‌ళితుల‌ జీవితాల్లో నూత‌న క్రాంతిని ప‌రిఢ‌విల్లేలా చేస్తామ‌ని సీఎం కేసీఆర్ అన్నారు. దళితజాతి సమగ్ర వికాసం కోసం ఇప్పటివరకూ జరిగింది ఒక ఎత్తు అయితే, ఇప్పుడు జరగబోయేది ఇంకో ఎత్తు అనే విధంగా తెలంగాణా ప్రభుత్వం దళితబంధు ఉద్యమానికి నాంది పలుకుతున్నది అని సీఎం కేసీఆర్ తెలిపారు.