Coronavirus | Representational Image (Photo Credits: Pixabay)

Hyderabad, April 15: తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్ విజృంభన కొనసాగుతోంది, ఇటీవల కాలంలో రోజూవారీ పాజిటివ్ కేసులు మరోసారి 3 వేల మార్కును దాటాయి. కరోనావైరస్ కొత్త వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతోంది, గాలిలో కూడా వైరస్ ఉందని కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ జి. శ్రీనివాస రావు అన్నారు. ఇంట్లో ఎవరికైనా కరోనా సోకితే ఇప్పుడు కొన్ని గంటల్లోనే ఫ్యామిలీ మొత్తం కరోనా బారిన పడుతున్నారు. కాబట్టి బయట నుంచి వచ్చిన వారు ఇంట్లో ఉన్నప్పుడు కూడా మాస్క్ ధరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

రాష్ట్రంలో గత నాలుగు వారాలుగా కోవిడ్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. రాబోయే 4-6 వారాల పరిస్థితి అదే విధంగా ఉంటుంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే మహారాష్ట్రలాగా పరిస్థితులు మరింత అధ్వాన్నంగా మారవచ్చునని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో లాక్డౌన్ విధించకపోయినా, లాక్డౌన్ తరహా కఠిన ఆంక్షలు అమలు చేసే యోచనలో కేసీఆర్ సర్కార్ ఉన్నట్లు పలు నివేదికలు వెల్లడించాయి.

రాష్ట్రంలో కేసుల విషయానికి వస్తే .. నిన్న రాత్రి 8 గంటల వరకు 1,06,627 మందికి చెందిన శాంపుల్స్ పరీక్షించగా కొత్తగా మరో 3,307మందికి పాజిటివ్ అని తేలింది. అయితే ఇంకా 3,715 మంది శాంపుల్స్ కు చెందిన రిపోర్ట్స్ రావాల్సి ఉందని పేర్కొన్నారు.

తాజాగా కన్ఫర్మ్ చేయబడిన కేసులను కలిపితే రాష్ట్రంలో మొత్తం COVID-19 బాధితుల సంఖ్య 3,38,045కి చేరుకుంది. నిన్నటి వరకు నమోదైన మొత్తం కేసుల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అత్యధికంగా 446 మందికి కోవిడ్ సోకినట్లు నిర్ధారణ కాగా, మేడ్చల్ నుంచి 314 కేసులు, రంగారెడ్డి నుంచి 277, నిజామాబాద్ నుంచి 279, జగిత్యాల నుంచి 155,  సంగారెడ్డి నుంచి 153,  నిర్మల్ నుంచి 148, కామారెడ్డి నుంచి 128, నల్గొండ నుంచి 102,  మరియు ఖమ్మం నుంచి 101 కేసుల చొప్పున నమోదయ్యాయి. రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో కొత్తగా నమోదైన కేసుల వివరాలు కింద బులెటిన్ లో గమనించవచ్చు.

Telangana's COVID19 Bulletin:

Status of positive cases of #COVID19 in Telangana

నిన్న సాయంత్రం వరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 33 జిల్లాల నుంచి పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆరోగ్యశాఖ అందించిన రిపోర్ట్ ప్రకారం, ఈ ఒక్కరోజులో పాజిటివ్ కేసులు నమోదైన జిల్లాల వివరాలు ఇలా ఉన్నాయి.

Status of positive cases of #COVID19 in Telangana

గడిచిన 24 గంటల్లో మరో 8 కోవిడ్ మరణాలు సంభవించాయి. దీంతో రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 1,788కు పెరిగింది.

అలాగే బుధవారం సాయంత్రం వరకు మరో 897 మంది మంది కోవిడ్ బాధితులు పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 3,08,396మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 27,861 ఆక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.

రాష్ట్రంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. హెల్త్ కేర్ సిబ్బంది, ఫ్రంట్ లైన్ వర్కర్లతో పాటు 45 ఏళ్లు పైబడిన పౌరులకు టీకాల పంపిణీ జరుగుతోంది. ఇప్పటివరకు తెలంగాణలో సుమారు 32 లక్షల డోసుల వ్యాక్సిన్ పంపిణీ చేసినట్లు ఆరోగ్యశాఖ తన నివేదికలో పేర్కొంది.