COVID19 Outbreak in TS | (photo-PTI)

Hyderabad, April 21:  తెలంగాణలో సెకండ్ వేవ్ కరోనా ఉధృతి రోజురోజుకి పెరుగుతుందే తప్ప, ఏ మాత్రం తగ్గడం లేదు. మహమ్మారి కట్టడి కోసం ఇప్పటికే రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ విధించబడింది. ఆక్టివ్ కేసుల సంఖ్య రాష్ట్రంలో 46 వేలు దాటింది, రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా కరోనా బారినపడ్డ విషయం తెలిసిందే. ప్రస్తుతం సీఎం కేసీఆర్ సిద్ధిపేట జిల్లాలోని ఎర్రవెల్లి గ్రామంలో గల తన వ్యవసాయ క్షేత్రంలో ఐసోలేషన్ లో ఉన్నారు. కేసీఆర్ వ్యక్తిగత వైద్యులు డాక్టర్ ఎం.వి రావు నేతృత్వంలోని వైద్యబృందం సీఎం ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తోంది. కాగా, సీఎంకు తేలికపాటి కోవిడ్ లక్షణాలు, జలుబు ఉన్నాయి, అందుకనుగుణంగా అవసరమైన మందులు ఇవ్వబడుతున్నాయి. ప్రస్తుతం సీఎం ఆరోగ్యం నిలకడగా ఉందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని డాక్టర్ ఎంవి రావు వెల్లడించారు.

ప్రస్తుతం కేసీఆర్‌ను కలవడానికి ఎవరికీ అనుమతి లేదు. త్వరగా కోలుకోవటానికి ఆరోగ్యకరమైన ఆహారంతో పాటు, తగిన విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించడంతో ఉన్నతాధికారులతో అధికారిక సమీక్షా సమావేశాలకు హాజరుకాకుండా సీఎం దూరంగా ఉన్నారు. అయితే కొన్ని ముఖ్యమైన ఫోన్ కాల్స్ ను స్వీకరిస్తున్నట్లు సమాచారం. అలాగే రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్ శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక సీఎం కోలుకోవాలని చాలా మంది రాజకీయ, సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ట్వీట్లు చేస్తున్నారు.

ఇక, రాష్ట్రంలో కేసులను పరిశీలిస్తే .. నిన్న రాత్రి 8 గంటల వరకు 1,30,105 మందికి చెందిన శాంపుల్స్ పరీక్షించగా కొత్తగా మరో  6,542 మందికి పాజిటివ్ అని తేలింది. అయితే ఇంకా 6,242 మంది శాంపుల్స్‌కు చెందిన రిపోర్ట్స్ రావాల్సి ఉందని పేర్కొన్నారు.

తాజాగా కన్ఫర్మ్ చేయబడిన కేసులను కలిపితే రాష్ట్రంలో మొత్తం COVID-19 బాధితుల సంఖ్య 3,67,901కి చేరుకుంది. నిన్నటి వరకు నమోదైన మొత్తం కేసుల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అత్యధికంగా 898 మందికి కోవిడ్ సోకినట్లు నిర్ధారణ కాగా,  మేడ్చల్ నుంచి 570 కేసులు, రంగారెడ్డి నుంచి 532, నిజామాబాద్ నుంచి 427 మరియు సంగారెడ్డి నుంచి 320 కేసుల చొప్పున నమోదయ్యాయి. రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో కొత్తగా నమోదైన కేసుల వివరాలు కింద బులెటిన్ లో గమనించవచ్చు.

Telangana's COVID19 Bulletin:

Status of positive cases of #COVID19 in Telangana

నిన్న సాయంత్రం వరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 33 జిల్లాల నుంచి పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆరోగ్యశాఖ అందించిన రిపోర్ట్ ప్రకారం, ఈ ఒక్కరోజులో పాజిటివ్ కేసులు నమోదైన జిల్లాల వివరాలు ఇలా ఉన్నాయి.

Status of positive cases of #COVID19 in Telangana

గడిచిన 24 గంటల్లో మరో 20 కోవిడ్ మరణాలు సంభవించాయి. దీంతో రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 1,876కు పెరిగింది.

అలాగే మంగళవారం సాయంత్రం వరకు మరో 2,887 మంది మంది కోవిడ్ బాధితులు పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 3,19,537 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 46,488 ఆక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.

ప్రస్తుతం 45 ఏళ్లు పైబడిన వారికి కోవిడ్ నివారణ వ్యాక్సినేషన్ చేస్తున్నారు. కేంద్రం తాజా మార్గదర్శకాల ప్రకారం మే1 నుంచి ప్రారంభమయ్యే మూడో విడత వ్యాక్సినేషన్ ప్రక్రియలో 18 ఏళ్ల పైబడిన అందరికీ టీకాలు వేయనున్నారు.  ఇప్పటివరకు తెలంగాణలో సుమారు 40 లక్షల డోసుల వ్యాక్సిన్ పంపిణీ చేసినట్లు ఆరోగ్యశాఖ తన నివేదికలో పేర్కొంది.