
Hyderabad, FEB 22: నాగర్ కర్నూల్ జిల్లా దోమలపెంట వద్ద ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో పైకప్పు కూలిన ఘటనలో 8మంది చిక్కుకు పోయారు. వారిని రక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సహాయకచర్యలను వేగవంతం చేసింది. ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్ బృందాలు చేపట్టిన రెస్క్యూ ఆపరేషన్‌లో సాయం చేసేందుకు సైన్యానికి చెందిన ‘ఇంజినీర్ టాస్క్‌ఫోర్స్ (ETF)’ రంగంలోకి దిగనుంది.. నిపుణులైన ఇంజినీర్లతో కూడిన బృందం.. వైద్యసామగ్రి, అవసరమైన సహాయ పరికరాలతో సిద్ధమైంది.
స్థానిక యంత్రాంగంతో ఈటీఎఫ్ కమాండర్ సమన్వయం చేసుకుంటున్నట్లు సైన్యం ఓ ప్రకటనలో తెలిపింది. అదనంగా.. ఓ రెస్క్యూ బృందం సహాయక యంత్రాలతో సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించింది. సైనిక ఉన్నతాధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు చెప్పింది. ప్రధాన మంత్రి నరేంద్రమోదీ.. సీఎం రేవంత్‌రెడ్డికి ఫోన్ చేసి ఎస్‌ఎల్ బీసీ ప్రమాద ఘటనపై ఆరా తీశారు. సహాయక చర్యలకు కేంద్రం నుంచి పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.