Hyd, May 9: తెలంగాణ ఇంటర్ ఫలితాలు (Telangana Inter Results) వచ్చిన కొద్ది గంటల్లోనే నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో విషాదకర ఘటన చోటు చేసుకుంది. జిల్లాలో ఓ ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈరోజు ఉదయం తెలంగాణ ఇంటర్ ఫలితాలను మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు.
అయితే ఫలితాలు చూసుకున్న ప్రజ్వల్ ఫెయిల్ అయినట్లు గుర్తించాడు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన విద్యార్థి ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణానికి చెందిన ప్రజ్వల్ మాదాపూర్‌లోని నారాయణ కాలేజ్‌లో ఇంటర్ ఫస్ట్ ఇయర్ బైపీసీ చదువుతున్నాడు.
ఇంటర్‌లో ఫెయిల్ అవడంతో ఆర్మూర్‌లోని తన ఇంట్లోని బలవన్మరణానికి పాల్పడ్డాడు. విషయం తెలిసిన పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆత్మహత్య చేసుకున్న కన్న బిడ్డను చూసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మంత్రులు, అధికారులు విద్యార్థులకు ధైర్యం చెబుతున్నప్పటికీ ఫెయిల్ అయ్యామనే కారణాలతో విద్యార్థులు ప్రాణాలు తీసుకుంటున్నారు.