Hit Run case in Hyderabad (Photo-X/Suryareddy)

Hyd, Jan 25: హైదరాబాద్ హిట్‌ అండ్‌ రన్‌ కేసులో ఐదుగురిని అరెస్ట్‌ చేసినట్లు జూబ్లీహిల్స్‌ ఏసీపీ హరిప్రసాద్‌ తెలిపారు. ఏ1గా కొవ్వూరి రిత్విక్‌రెడ్డి, వైష్ణవి (ఏ2), పొలుసాని లోకేశ్వర్‌రావు (ఏ3), బుల్లా అభిలాష్‌ (ఏ4), ఏ5గా అనికేత్‌ను పేర్కొన్నట్లు చెప్పారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ కేసు వివరాలను ఏసీపీ వెల్లడించారు.

సికింద్రాబాద్‌ సిక్‌ విలేజ్‌ గాంధీనగర్‌కు చెందిన లింగాల తారక్‌రామ్‌ (30), కె.రాజు మాదాపూర్‌ నోవాటెల్‌లో బౌన్సర్‌లుగా పని చేస్తున్నారు. ఎప్పటిలాగే మంగళవారం సాయంత్రం డ్యూటీకి వెళ్లి బుధవారం తెల్లవారుజామున 5 గంటలకు బైక్‌పై జూబ్లీహిల్స్‌ మీదుగా ఇంటికి వెళ్తున్నారు. పెద్దమ్మ గుడి సమీపంలోకి రాగానే శ్రీ జ్యువెలర్స్‌ మలుపు వద్ద వెనుక నుంచి అతివేగంగా దూసుకువచ్చిన బ్లాక్‌ కలర్‌ కారు ఢీకొట్టి ఆగకుండా దూసుకెళ్లింది. తారక్‌రామ్‌ అక్కడికక్కడే మృతిచెందారు. ఏసు రాజుకు తీవ్రగాయాలయ్యాయి.

జూబ్లీహిల్స్‌ హిట్‌ అండ్‌ రన్‌ కేసు సీసీ పుటేజీ ఇదిగో, బైక్‌పై వెళ్తున్న బౌన్సర్‌ను ఢీకొట్టిన కారు, అక్కడికక్కడే బౌన్సర్ మృతి

ప్రమాదం జరిగిన తర్వాత పోలీసులు పట్టుకుంటారనే భయంతో రిత్విక్‌రెడ్డి పరారయ్యాడు. స్నేహితుడు సురేష్‌రెడ్డి ఇంట్లో కారును దాచిపెట్టారు. రిత్విక్‌ అమెజాన్‌లో జాబ్‌ చేస్తున్నాడు. ఆఫీస్‌ చూపిస్తానని స్నేహితులను తీసుకెళ్లాడు. మద్యం మత్తులో అతడు కారు నడిపినట్లు దర్యాప్తులో తేలిందని తెలిపారు. మృతుడు తారక్‌రామ్‌కు రెండేళ్ల క్రితం సుధారాణితో వివాహం కాగా 7 నెలల కుమారుడున్నాడు. గత కొంతకాలంగా బౌన్సర్‌గా పని చేస్తున్నాడు.

ఉస్మానియాలో శవపంచనామా అనంతరం కుటుంబ సభ్యులు మృతదేహాన్ని తీసుకొచ్చి జూబ్లీహిల్స్‌ ఠాణా ముందు బైఠాయించి ఆందోళనకు దిగారు. న్యాయం చేయాలంటూ అతడి బంధువులు, బౌన్సర్లు నినాదాలు చేశారు. ఈ ఘటనకు కారు కారణంగా తాము భావిస్తున్నామని ఆరోపించారు. ప్రమాదానికి పాల్పడింది ఓ నాయకుడి కుమారుడని, నిజాలు వెల్లడించాలంటూ డిమాండ్‌ చేశారు.

కారును అతివేగంగా నడిపిన నిందితుడ్ని ఇంతవరకు అరెస్టు చేయలేదని అసంతృప్తి వ్యక్తం చేస్తూ మృతుడి కుటుంబ సభ్యులు బుధవారం రాత్రి జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌ ముందు బైఠాయించి ఆందోళన నిర్వహించారు. న్యాయం చేయాలంటూ నినాదాలు చేయడమే కాకుండా ఈ ఘటనకు కారకుడైన నిందితుణ్ణి తమ ముందు ప్రవేశపెట్టాలని, కారును కూడా చూపించాలని డిమాండ్‌ చేశారు.

తారక్‌రామ్‌ తల్లి రాజమణి, భార్య సుధారాణి, సోదరుడు గణేష్, బావలు ప్రదీప్, సునీల్‌ తదితరులతో పాటు పెద్ద సంఖ్యలో బంధుమిత్రులు మృతదేహాన్ని రోడ్డుపై ఉంచి కన్నీరుమున్నీరవుతూ తమకు న్యాయం చేయాలంటూ డిమాండ్‌ చేశారు. పోలీసులు భారీ సంఖ్యలో మొహరించి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేశారు. కాగా ఈ ఆందోళన కొనసాగుతున్న సమయంలోనే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కాన్వాయ్‌ అదే దారిలో వెళ్లడంతో కొంత ఉద్రిక్తత నెలకొంది.