Hyderabad, December 13: తెలంగాణా సీఎం (Telangana CM)గా కేసీఆర్ (KCR) రెండవసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి నేటికి ఏడాది పూర్తి అయింది. ఉద్యమపార్టీగా 2014 ఎన్నికల్లో పోటీ చేసి తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ నేతృత్వంలో తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన టీఆర్‌ఎస్ (TRS), 2018 డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ ముందస్తు ఎన్నికల్లో ఘనవిజయాన్ని సాధించి మరోసారి అధికారాన్ని చేపట్టింది. టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు (K Chandrasekhar Rao) నేతృత్వంలోని తెలంగాణ రాష్ట్ర సమితి(Telangana Rashtra Samithi) గత ఎన్నికల్లో 88 స్థానాల్లో విజయభేరి మోగించింది.
గతేడాది డిసెంబర్ 13న సీఎంగా కేసీఆర్‌తో పాటు హోంమంత్రిగా మహమూద్ అలీ ప్రమాణ స్వీకారం చేశారు.కేబినెట్ విస్తరణకు చాలా టైం తీసుకున్న కేసిఆర్ 67రోజుల తర్వాత మరో పది మందితో విస్తరణ చేశారు. మళ్లీ 6నెలల తర్వాత మరో ఆరుగురును మంత్రి వర్గంలోకి తీసుకొని పూర్తి స్థాయి కేబినెట్‌ను ఏర్పాటు చేశారు.
88 నుంచి సెంచరీకి శాసన సభ్యుల సంఖ్యా బలం
88మంది ఎమ్మెల్యేలను గెలుచుకున్న టిఆర్‌ఎస్ పార్టీ ఆ తర్వాత ఇతర పార్టీల నుంచి శాసనసభ్యుల చేరికల ద్వారా తన సంఖ్యా బలాన్ని మరింతగా విస్తరించుకుంటూ వచ్చింది. 88 నుంచి అది కాస్తా సెంచరీ దాటింది. ఎన్నికల అనంతరం వెంటనే ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలు జాయిన్ కాగా తర్వాత 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌లో చేరారు.
ఏకంగా కాంగ్రెస్ శాసన సభా పక్షాన్ని టీఆర్‌ఎస్‌లో విలీనం చేశారు. దీనిపై కాంగ్రెస్ ఆరోపణలు చేసినా.. గులాబీ బాస్ కొట్టి పారేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు స్వచ్ఛందంగా తమ పార్టీలో చేరారని.. రూల్స్ ప్రకారమే విలీనం జరిగిందని టీఆర్‌ఎస్ నేతలు పేర్కొన్నారు.
మంత్రిమండలిలో మహిళలకు ప్రాతినిధ్యం
సుమారు ఐదేళ్లుగా మంత్రిమండలిలో మహిళలకు ప్రాతినిధ్యం లేదనే విమర్శకు తెరదించుతూ ఈ ఏడాది సెప్టెంబర్ మొదటివారంలో కేసీఆర్ మరోమారు తన మంత్రివర్గాన్ని విస్తరించారు. హరీశ్‌రావు, కేటీఆర్, గంగుల కమలాకర్, పువ్వాడ అజయ్, సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్ మూడో విడత విస్తరణలో మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు.
కేబినెట్‌లో గరిష్టంగా సీఎం సహా 18 మందికి మాత్రమే చోటు కల్పించే అవకాశం ఉండటంతో పలువురు పార్టీ నేతలకు కేబినెట్ హోదాతో నామినేటెడ్ పదవులు అప్పగించారు.
లోక్‌సభ ఎన్నికల్లో సీన్ రివర్స్
అయితే ముందస్తు జోష్‌తో అధికారాన్ని చేపట్టిన గులాబీ పార్టీకి లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం సీన్ రివర్సైంది. 9ఎంపీ సీట్లను గెలిచి అన్ని పార్టీలకంటే మెరుగ్గా ఉన్నా.. నలుగురు కీలకమైన నేతలు ఓడిపోవడం ఆ పార్టీని ఓ రకంగా నిరాశకు గురిచేసిందనే చెప్పాలి. 17 లోక్‌సభ స్థానాలకు గాను 9 చోట్ల టీఆర్‌ఎస్ అభ్యర్థులు గెలుపొందగా, బీజేపీ 4, కాంగ్రెస్ 3, ఏఐఎంఐఎం ఒకచోట విజయం సాధించింది.
అయితే ఈ ఏడాది మేలో జరిగిన స్థానిక సంస్థల్లో 32 జెడ్పీ చైర్మన్ స్థానాలతో పాటు, ఎంపీటీసీ ఫలితాల్లో 63 శాతం విజయాన్ని నమోదుచేసింది. పది జిల్లాలు ఉన్న తెలంగాణను 33 జిల్లాలుగా ఏర్పాటు చేయడం ఈ ఎన్నికల్లో గులాబీ దళానికి బాగా కలిసొచ్చిందనే చెప్పుకోవచ్చు. హుజూర్‌నగర్ నియోజకవర్గం ఆవిర్భవించిన నాటి నుంచి ఒక్క విజయాన్ని కూడా నమోదు చేయని టీఆర్‌ఎస్ సెప్టెంబర్‌లో జరిగిన ఉపఎన్నికలో గెలుపొందింది.
కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవం
తెలంగాణకు జీవనాడి లాంటి కాళేశ్వరం ప్రాజెక్టుకు ఈ ఏడాది జూన్ 21న ప్రారంభోత్సవం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అప్పటి మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, ఏపీ సీఎం వైఎస్ జగన్ హాజరయ్యారు. రూ.80 వేల కోట్ల అంచనాలతో చేపడుతున్న ఈ ప్రాజెక్టు రాష్ట్రానికి ఆర్థిక భారమని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నప్పటికీ.. కేసీఆర్ వెనక్కి తగ్గలేదు. ఈ ప్రాజెక్ట్ ద్వారా తెలంగాణలోని 13 జిల్లాలకు ప్రయోజనం చేకూరుతుంది.
ఇది కేసీఆర్ ఖాతాలో మరి విజయంగా చెప్పవచ్చు. దీంతో పాటుగా ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్నట్టుగానే ఆసరా ఫించన్లను పెంచింది. డిసెంబర్లో రెండోసారి అధికారంలోకి వచ్చిన కేసీఆర్ సర్కారు.. జూలై నెల నుంచి ఫించన్ల పెంపు వర్తింపజేసింది. రైతు బంధును పెంచిన సర్కారు.. రూ.5 లక్షల రైతు బీమాను ప్రకటించింది.
ఆర్టీసి ఇష్యూ
ఆర్టీసి ఇష్యూ టీఆర్‌ఎస్ క్యాడర్‌ను కాస్త కలవరపెట్టింది. దాదాపు రెండు నెలల పాటు సాగిన ఆర్టీసి సమ్మెతో గులాబీ పార్టీకి ఎదురు దెబ్బ తగిలిందని అందరూ భావించారు. అన్ని పార్టీలు ఏకమై టీఆర్‌ఎస్ డౌన్ ఫాల్ మొదలైందని విమర్శలు గుప్పించాయి. కార్మికుల్లో కూడా పూర్తి వ్యతిరేకత వ్యక్తమైంది. కొందరు కార్మికులు ఆత్మహత్యలకు కూడా పాల్పడ్డారు. అయితే కార్మికుల డిమాండ్లు నెరవేర్చడం సాధ్యం కావని మొదట్నించీ సీఎం చెబుతుండటంతో 54రోజుల తర్వాత కార్మికులు సమ్మె విరమించారు.
దీంతో ఎలాంటి షరతులు లేకుండా కార్మికులను సీఎం మళ్లీ విధుల్లోకి తీసుకున్నారు. అంతే కాదు కార్మికుల్లో నెలకొన్న వ్యతిరేకతను తొలగించేందుకు గులాబీ అధినేత వారిని పిలిపించుకొని మాట్లాడారు. చాలా వరకు కార్మికులకు అనుకూల నిర్ణయాలు తీసుకోవడంతో ఆర్టీసి సమస్య సమసి పోయింది. ఇది ఓ రకంగా గులాబి బాస్ విజయమనే చెప్పాలి.
దిశా ఇష్యూ
దిశా హత్యాచారం, హత్యకేసులో నలుగురు నిందితులు ఎన్‌కౌంటర్ అయ్యారు. ఈ నేపథ్యంలోనే గులాబీ పార్టీ పై ప్రజా సంఘాలు, మానవ హక్కుల నుంచి వ్యతిరేకత వ్యక్తం అయింది. కాగా దిశా హత్య జరిగిన వెంటనే ప్రజలంతా సత్వర న్యాయం జరగాలని పెద్ద ఎత్తున ఆందోళన జరిగాయి. ఈ ఘటన ఢిల్లీని కూడా తాకి నిందితులను ఎన్ కౌంటర్ చేయాలని నిరసనలు హోరెత్తాయి. కేసు విచారణలో తప్పించుకోబోయిన నిందితులు ఎన్‌కౌంటర్ అయ్యారు. ఈ అంశం కూడా గులాబి దళానికి బాగా అనుకూల అంశంగా మారింది.
ఈ ఏడాది పాలనతో కేసీఆర్ వ్యూహాలకు బాగా పదును పెట్టాడనే చెప్పాలి. బలమైన ప్రతిపక్షం లేకపోవడం గులాబి అధినేతకు బాగా కలిసివచ్చింది. కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ వ్యూహాలను ఎదుర్కోవడంలో పూర్తిగా వైఫల్యం చెందుతూ వస్తోంది. అపర చాణక్యుడు కేసీఆర్ వేస్తున్న ఎత్తుకుపై ఎత్తులు కాంగ్రెస్ పార్టీని బలంగా తాకుతూనే ఉన్నాయి.
మొత్తం మీద రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ పుంజుకుని గులాబి అధినేతకు పోటీగా వస్తుందా లేక తెలంగాణాలో పాగా వేయాలని చూస్తున్న బీజేపీకి అవకాశం ఇస్తుందా అనేది ముందు ముందు చూడాలి.