High Court of Telangana | TSRTC Strike | File Photo

Hyderabad, November 22:  తెలంగాణలో రూట్ల ప్రైవేటీకరణకు సంబంధించి హైకోర్టు (High Court of Telangana) లో వాదనలు ముగిశాయి.  రూట్ల ప్రైవేటీకరణపై దాఖలైన రిట్ పిటిషన్‌ను హైకోర్ట్ కొట్టివేసింది. దీంతో ప్రైవేటీకరణ అంశంలో కేసీఆర్  ప్రభుత్వానికి హైకోర్ట్ నుంచి గ్రీన్ సిగ్నల్ లభించినట్లయింది.

ప్రైవేటీకరణ (Routes Privatization) పై మంత్రి వర్గం నిర్ణయాలను సవాలు చేసే విషయంలో పిటిషనర్ బలమైన ఆధారాలు చూపడంలో విఫలమయ్యారని హైకోర్ట్ పేర్కొంది. 5100 రూట్ల ప్రైవేటీకరణ విషయంలో తెలంగాణ మంత్రివర్గ నిర్ణయాన్ని హైకోర్ట్ సమర్థించింది.

ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఆర్టీసీ జేఏసీ- ప్రొ. కోదండరాం నేతృత్వంలోని తెజస పార్టీ నేత హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై నెలరోజులుగా సుదీర్ఘ విచారణ జరిపిన హైకోర్టు, శుక్రవారం తుది తీర్పు వెల్లడించింది. మోటార్ వెహికిల్ యాక్ట్ చట్టంలోని సెక్షన్ 102 ప్రకారం రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తి అధికారాలు ఉంటాయని హైకోర్ట్ పేర్కొంది. ప్రైవేటీకరణ విషయంలో కేబినేట్ తీసుకున్న నిర్ణయాలపై తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. ప్రభుత్వానికి - ప్రైవేటుకు మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉన్నప్పుడే లాభాలు వస్తాయని గతంలో చేసిన వ్యాఖ్యలకే హైకోర్ట్ కట్టుబడింది. ప్రజా అవసరాలను దృష్టిలో ఉంచుకొని తక్కువ ధరలకే ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించడం కోసమే ప్రైవేటీకరణ అని అడ్వొకేట్ జనరల్ చేసిన వాదనలతో హైకోర్ట్ ఏకీభవించింది.

ఇక, ప్రైవేటీకరణ విషయంలో హైకోర్ట్ తుది తీర్పు వెలువడిన తర్వాతనే, ఆ తీర్పు ఆధారంగా ఆర్టీసీ కార్మికుల భవితవ్యం తేల్చాలని సీఎం కేసీఆర్ (CM KCR) గురువారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఒక అభిప్రాయానికి వచ్చినట్లు తెలిసిందే. ఈ నేపథ్యంలో హైకోర్ట్ తాజా తీర్పు మరియు ఇప్పటికే ఆర్టీసీ కార్మికులు సమ్మెపై వెనక్కి తగ్గడం లాంటి అంశాలతో సీఎం కేసీఆర్‌కు డబుల్ బూస్ట్ లభించినట్లయింది. ఇప్పుడు ఆర్టీసీ కార్మికులను విధుల్లోకి చేర్చుకునే అంశంలో సీఎం నిర్ణయం ఎలా ఉండబోతుందనే దానిపై ఉత్కంఠ నెలకొని ఉంది. షరతులు లేకుండా విధుల్లోకి ఆహ్వానిస్తారా? లేక షరతులు విధిస్తారా?  తేలాల్సి ఉంది.

మరోవైపు, ఆర్టీసీ జేఏసీ (TSRTC JAC)ని మాత్రం నిరాశ ఆవహించింది. తాము చేసిన ప్రయత్నాలతో ఎలాంటి ఫలితం రాకపోగా, పరిస్థితులన్నీ ప్రభుత్వానికే అనుకూలంగా మారడంతో ఇక ప్రభుత్వ స్పందనపైనే ఆశలు పెట్టుకుంది. విధుల్లోకి చేరేందుకు బస్ డిపోలకు పోటెత్తుతున్న ఆర్టీసీ కార్మికులు

సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందిస్తారని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే సీఎం నుంచి ఎలాంటి స్పందన రాకపోతే తమ సమ్మె యధాతథంగా కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. ఈరోజు సీఎం నుంచి ఎలాంటి ప్రకటన వెలువడకపోతే, శనివారం నుంచి డిపోల ఎదుట నిరసన కార్యక్రమాలు చేపడతామని వెల్లడించారు.