Telangana CM K Chandrasekhar Rao | File image | (Photo Credits: PTI)

Hyderabad, February 18:  తెలంగాణ (Telangana) రాష్ట్రంలో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగుల (Govt Employees)  పదవీ విరమణ వయసును (Retirement Age Hike) పెంచుతామని సీఎం కేసీఆర్ (CM KCR) గత ఎన్నికల్లోనే హామి ఇచ్చారు. ఇదే విషయాన్ని ఆయన పలుమార్లు పలు సందర్భాల్లో గుర్తు చేస్తూ వచ్చారు కూడా.  ఆయన నేతృత్వంలోని టీఆర్ఎస్ పార్టీ రెండోసారి అధికారంలోకి వచ్చి 14 నెలలు పూర్తయినప్పటికీ, ఆ హామి మాత్రం అమలులోకి రాలేదు. అయితే ఎట్టకేలకు సీఎం కేసీఆర్ ఆ హామీని నిలబెట్టుకునే దిశగా అందుకు ముహూర్తం ఖరారు చేసినట్లు నివేదికల ద్వారా వెల్లడవుతుంది. ఇప్పుడు రానున్న ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగుల పదవీ విరమణ కాలాన్ని మరో మూడేళ్లు పొడగిస్తూ ప్రభుత్వ నిర్ణయాన్ని అమలు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.

ఇటీవల గత డిసెంబర్‌లో టీఎస్‌ఆర్‌టీసీ ఉద్యోగులు తమ నిరవధిక సమ్మె విరమించిన తర్వాత సీఎం కేసీఆర్ ఆర్టీసీ కార్మికులపై వరాల జల్లు కురిపించారు. ఆర్టీసీని లాభాల్లోకి తెచ్చేందుకు తానే సంస్థకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తానని  కూడా సీఎం అన్నారు. ఇదే క్రమంలో కార్మికుల పదవీ విరమణ వయస్సును 58 నుంచి 60 సంవత్సరాలకు సీఎం పొడగించిన విషయం తెలిసిందే.

దీంతో ఇటు ప్రభుత్వ ఉద్యోగుల్లో కూడా తమ పదవీ విరమణ వయసుకు సంబంధించిన ఆశలు రెక్కలు తొడిగాయి. రాబోయే మూడేళ్లలో సుమారు 26,000 మంది ఉద్యోగులు పదవీ విరమణ చేసే వారున్నారు. ఈ నేపథ్యంలో అనుకున్నది అనుకున్నట్లుగా ఈ ఏప్రిల్ 1 నుంచి పదవీ విరమణ వయోపరిమితి పెంపు అమలులోకి వస్తే, రిటైర్మెంట్ తీసుకోబోయే వాళ్లకు మరో మూడేళ్లు అదనంగా తమ పదవిలో కొనసాగే అవకాశం లభిస్తుంది.  మార్చి 31 తర్వాత వృద్ధాప్య పెన్షన్, ఉద్యోగులకు రిటైర్మెంట్ వయో పరిమితి పెంపు

ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్లే సూచనలే కనిపిస్తున్నాయి. ఎందుకంటే అధికారిక అంచనాల ప్రకారం, పదవీ విరమణ వయస్సును పెంచడం ద్వారా వారికి రిటైర్మెంట్ సమయంలో లభించే ప్రయోజనాలు మరియు గ్రాట్యుటీ చెల్లించాల్సిన అవసరం ఉండదు. తద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఏడాదికి రూ. 3,500 కోట్లు ఆదా అవుతుంది.