Telangana CM KCR | File Photo

Hyderabad, September 4: రాష్ట్ర ప్రజలకు సంబంధించిన అన్ని అంశాలపై అసెంబ్లీ సమావేశాల్లో కూలంకశంగా చర్చ జరగాలని సీఎం కేసీఆర్ అన్నారు. ఎన్ని రోజులైనా సరే, అన్ని రాజకీయ పక్షాలు ప్రతిపాదించిన అంశాలపై చర్చ చేయడానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన స్పష్టం చేశారు. అసెంబ్లీలో జరిగే చర్చ సందర్భంగా అన్ని వాస్తవాలను ప్రజలకు వివరించడం కోసం మంత్రులు సిద్ధం కావాలని సీఎం ఆదేశించారు.

ఈ నెల 7నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై మంత్రులు, విప్ లతో సీఎం కేసీఆర్ గురువారం ప్రగతి భవన్ లో సమావేశం నిర్వహించారు.

కరోనా వ్యాప్తి నివారణ, కరోనా బాధితులకు అందుతున్న వైద్యం, రాష్ట్రంలో విస్తరించిన వైద్య సేవలు, భారీ వర్షాల వల్ల జరిగిన పంట నష్టం – తీసుకోవాల్సిన చర్యలు, శ్రీశైలం జల విద్యుత్ కేంద్రంలో జరిగిన ప్రమాదం, విద్యుత్ రంగంలో సాధించిన విజయాలు, కొత్త రెవెన్యూ చట్టం, రాయలసీమ ఎత్తిపోతల పథకం పేర ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టు – నీటి పారుదల రంగానికి సంబంధించిన అంశాలు, జిఎస్టీ అమలులో జరుగుతున్న అన్యాయం, కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న ఆర్థిక విధానాల వల్ల కలుగుతున్న నష్టం, రిజర్వేషన్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం చేసిన తీర్మానాల విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న నాన్చివేత ధోరణి, నియంత్రిత పద్ధతిలో పంట సాగుతో పాటు వ్యవసాయ రంగం, పివి శతజయంతి ఉత్సవాలు తదితర అంశాలను చర్చించాలని, ప్రభుత్వ పరంగా చర్చకు సిద్ధమైన అంశాలను బిఎసి సమావేశంలో ప్రతిపాదించాలని నిర్ణయించారు. ఇటీవల మరణించిన ఎమ్మెల్యే రామలింగారెడ్డికి అసెంబ్లీలో మొదటి రోజే ఘన నివాళి అర్పించనున్నట్లు సీఎం తెలిపారు. అసెంబ్లీలో చర్చకు వచ్చే అన్ని అంశాలపై సంపూర్ణమైన సమాచారంతో సిద్ధంగా ఉండాలని మంత్రులకు సీఎం కేసీఆర్ సూచించారు.

‘‘ప్రజాస్వామ్య విలువలు పరిఢవిల్లేలా అసెంబ్లీ సమావేశాలు జరగాలి. అసెంబ్లీ అంటే అల్లర్లు, దూషణలు, గందరగోళం, తిట్లు, శాపనార్థాలు కాదు. పనికి మాలిన నిందలు వేసుకోవడానికి, అసహనం ప్రదర్శించడానికి అసెంబ్లీ వేదిక కారాదు. ఇలాంటి ధోరణిలో మార్పు రావాలి. తెలంగాణ అసెంబ్లీ నిర్వహణలో గుణాత్మక మార్పులు రావాలి. స్పూర్తి వంతమైన చర్చలు జరగాలి. చట్టాలు తయారు చేయానికి (శాసనాలు నిర్మించడానికి), బడ్జెట్ ఆమోదించడానికి, చట్టాలు, బడ్జెట్ అమలు ఎలా ఉందో విశ్లేషించుకోవడానికి శాసనసభలో చర్చ జరగాలి. చర్చలు గొప్పగా, వాస్తవాల ఆధారంగా జరగాలి. ప్రజలకు ఉపయోగపడే విధంగా సభ్యులు మాట్లాడాలి. అసెంబ్లీలో చర్చ ద్వారా అటు ప్రజాస్వామ్యం మరింత బలపడాలి. ఇటు ప్రజలకు ఉపయోగకరమైన నిర్ణయాలు వెలువడాలి. ఈ విధంగా తెలంగాణ శాసనసభ జరగాలి. అదే ప్రభుత్వం కోరుకుంటున్నది. ఏ పార్టీ సభ్యులైనా సరే, ఏ విషయం గురించి అయినా సరే సభలో మాట్లాడవచ్చు. దానికి సమాధానం చెప్పడానికి, వివరణ ఇవ్వడానికి, ఆచరణాత్మకమైన సూచనలు స్వీకరించడానికి ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. సభ్యులు మాట్లాడే విషయాలు వాస్తవాలు ప్రతిబింబించాలి. క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితికి అద్దం పట్టేలా ఉండాలి’’ అని కేసీఆర్ అన్నారు.