inter-state transport and travel

Hyderabad, June 10: ప్రస్తుతం జిల్లా సర్వీసులు నడుపుతున్న తెలంగాణ ఆర్టీసీ ఇప్పుడు అంతర్రాష్ట్ర సర్వీసులకూ (Interstate Bus Services) సిద్ధమైంది. అంతర్‌రాష్ట్ర బస్సు సర్వీసులకు తెలంగాణ సర్కార్‌ (Telangana Government) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే పొరుగు రాష్ట్రాలతో ముందుగా ఒప్పందాలు చేసుకున్న తర్వాతే... సర్వీసులు మొదలు పెట్టాలని నిర్ణయించింది. దీంతో సీఎస్ సోమేష్ కుమార్ ఆయా రాష్ట్రాల సీఎస్‌లతో చర్చలు జరపనున్నారు. ఆర్టీసీపై సమీక్ష నిర్వహించిన సీఎం కేసీఆర్‌... ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. రూట్ టు రూట్ నడపాలని అధికారులను ఆదేశించారు. సిటీ సర్వీసులు ఇప్పుడే వద్దన్నారు. సిటీ బస్సులను ఇప్పట్లో నడపేది లేదు, క్లారిటీ ఇచ్చిన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుంటామని ప్రకటన

నిన్న రాత్రి ప్రగతి భవన్‌లో ఆర్టీసీపై ముఖ్యమంత్రి కేసీఆర్ (TS CM KCR) అధ్యక్షతన జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ముఖ్యకార్యదర్శి సునీల్ శర్మ, ఆర్టీసీ ఈడీలు ఈ సమావేశానికి హాజరయ్యారు.

ఉమ్మడి ఏపీ ప్రభుత్వ హయాంలో కుదిరిన ఒప్పందం ఆధారంగానే ఇప్పటివరకు మహారాష్ట్ర, కర్ణాటకకు అంతర్రాష్ట బస్సులు నడిచాయి. దీంతో సరిహద్దు రాష్ట్రాలతో కొత్త ఒప్పందం చేసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణలో ఆయా రాష్ట్రాల ఆర్టీసీ బస్సులు ఎన్ని కిలోమీటర్లు తిరిగితే... టీఎస్‌ ఆర్టీసీ బస్సులు కూడా ఆ రాష్ట్రాల్లో అన్ని కిలోమీటర్లు తిరిగేలా ఒప్పందం కుదుర్చుకోవాలని కేసీఆర్ ఆదేశించారు. ప్రధానంగా లాభాలొచ్చే రూట్లలో ఏపీఎస్‌ఆర్టీసీ అధిక సంఖ్యలో బస్సులు నడిపి, నష్టాలు వచ్చే రూట్లలో తక్కువగా నడుపుతున్నట్లు గుర్తించారు. ఇలాంటివి జరగకుండా జాగ్రత్త పడాలని సూచించారు.

బస్సు సర్వీసుల విషయంలో తమకు ఎలాంటి అభ్యంతరం లేదని ఏపీ ఇప్పటికే లేఖ రాసింది. కాబట్టి తొలుత ఏపీలోని ముఖ్యనగరాలకు బస్సులు నడుపనున్నట్టు తెలుస్తోంది. కాగా ఆంధ్రప్రదేశ్ లోని వివిధ ప్రాంతాలకు తెలంగాణ 680 బస్సులు నడుపుతోంది. ఏపీ తెలంగాణలోని పలు ప్రాంతాలకు 900 బస్సులు నడుపుతోంది.

నల్లగొండ జిల్లా మీదుగా ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లాలనుకునే వారు వాడపల్లి మీదుగానే వెళ్లాల్సిందిగా మిర్యాలగూడ డీఎస్పీ వెంకటేశ్వర్‌ రావు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మాచర్ల మీదుగా వాహనాలను, ప్రయాణికులను అనుమతించడం లేదన్నారు. నాగార్జునసాగర్‌ దాటిన తర్వాత ఆంధ్రాలోకి ప్రవేశించే మాచర్ల చెక్‌పోస్టును ఆంధ్రా ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్‌ చెక్‌పోస్టుగా గుర్తించడం లేదని తెలిపారు. మాచర్ల మీదుగా ఆంధ్రాలోకి వెళ్లాలనుకునే ప్రయాణికులు, వాహనాలు వాడపల్లి మీదుగా వెళ్లాల్సిందిగా సూచించారు. నాగార్జున సాగర్‌ మీదుగా వెళ్లడానికి వచ్చి ఆంధ్రా చెక్‌పోస్టు వద్ద ఇబ్బందులు పడొద్దని పేర్కొన్నారు.