Lockdown in TS: తెలంగాణలో జూన్ 9 తర్వాత లాక్‌డౌన్ ఎత్తివేత? వైరస్ వ్యాప్తి దాదాపు అదుపులోకి వచ్చిందంటోన్న ప్రభుత్వ వర్గాలు, రాష్ట్రంలో ప్రస్తుతం 32 వేలకు పైనే ఉన్న ఆక్టివ్ కేసులు
Image of Hyderabad's MJ Market During Lockdown | File Photo

Hyderabad, June 4: తెలంగాణలో కోవిడ్ కేసులు మరియు మరణాలు క్రమంగా తగ్గుతున్నందున ప్రస్తుతం అమలులో ఉన్న లాక్డౌన్ జూన్ 9 తర్వాత ఎత్తివేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గత నెలలో రాష్ట్రంలో మహమ్మారి విజృంభనతో కోవిడ్ కేసులు భారీగా పెరిగాయి, దీంతో రాష్ట్ర ప్రభుత్వం మే 12 నుంచి లాక్డౌన్ విధించింది. సుమారు 20 రోజుల పాటు రాష్ట్రంలో 20 గంటల లాక్డౌన్ ను అమలుపరిచారు. అనంతరం మే 31 నుంచి సడలింపులు పెంచి లాక్డౌన్ కొనసాగిస్తున్నారు. అయితే లాక్డౌన్ మరియు ప్రభుత్వం తీసుకున్న పకడ్బందీ చర్యల కారణంగా రాష్ట్రంలో కోవిడ్ -19 కేసులు మరియు మరణాలు భారీగా తగ్గాయని మరింత తగ్గితే లాక్డౌన్ ఎత్తివేయడానికి ప్రభుత్వం మొగ్గుచూపవచ్చునని రాష్ట్ర పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డా. శ్రీనివాస రావు అన్నారు.

ఒకరి నుంచి మరొకరికి వైరస్ వ్యాప్తి జరగకుండా చైన్ బ్రేక్ చేసేందుకు ప్రభుత్వం తీసుకున్న చర్యలు, లాక్డౌన్ మంచి ఫలితాలను ఇచ్చాయి. గత మూడు వారాలలో తెలంగాణలో కోవిడ్ పాజిటివిటి రేటు 6 శాతం నుండి 4 శాతానికి పడిపోయింది, ప్రస్తుతం 2 శాతంగా ఉందని హెల్త్ డైరెక్టర్ తెలిపారు. అంతేకాకుండా బెడ్ ఆక్యుపెన్సీ రేటు కూడా దాదాపు 55 శాతం నుండి 26 శాతానికి పడిపోయింది. ప్రస్తుతం, రాష్ట్ర ఐసియూలలో 49 శాతం బెడ్లు ఖాళీగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.

అయితే ఏపిలో సరిహద్దులు పంచుకుంటున్న ఖమ్మం, మహబూబ్ నగర్, నల్గొండ తదితర జిల్లాల్లో కొద్దిగా కేసులు ఎక్కువగా ఉన్నాయి. ఆయా జిల్లాల్లో ప్రత్యేక దృష్టి పెడుతున్నట్లు డా. శ్రీనివాస రావు వెల్లడించారు.

ఇక, రాష్ట్రంలో కేసుల విషయానికి వస్తే గురువారం తెలంగాణలో 2,261 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 3043 మంది కోలుకున్నారు, మరో 18 మంది చికిత్స పొందుతూ చనిపోయారు. ప్రస్తుతం రాష్ట్రంలో 32,579 ఆక్టివ్ కేసులు ఉన్నాయని రాష్ట్ర ఆరోగ్యశాఖ తన నివేదికలో పేర్కొంది.