Hyderabad, September 1: తెలంగాణవ్యాప్తంగా బుధవారం నుంచి విద్యాసంస్థలు పున:ప్రారంభమయ్యాయి. రెసిడెన్షియల్, సోషల్ వెల్ఫేర్ మరియు గిరిజన సంక్షేమ పాఠశాలలను మినహాయించి అన్ని విద్యాసంస్థలు తిరిగి తెరవబడ్డాయి, అయితే మొదటి రోజు విద్యార్థుల హాజరు చాలా తక్కువగా నమోదైంది. చాలా చోట్ల అతికొద్ది మంది మాత్రమే విద్యార్థులు తరగతి గదుల్లో కనిపించారు. రాష్ట్రవ్యాప్తంగా తొలిరోజు 21.77 శాతం మాత్రమే విద్యార్థులు హాజరైనట్లు సమాచారం. కరోనా భయాందోళనల నేపథ్యంలో మెజారిటీ తల్లిదండ్రులు తమ పిల్లలను స్కూళ్లకు పంపేందుకు సందేహిస్తున్నారు. అయితే దాదాపు ఏడాదిన్నర తర్వాత మొదటిసారిగా విద్యార్థులు తరగతులకు హాజరు కావడంతో కొన్ని పాఠశాలల్లో పండుగ వాతావరణం కనిపించింది. పాఠశాల సిబ్బంది విద్యార్థుల శరీర ఉష్ణోగ్రతను చెక్ చేయడం, పాఠశాల ప్రవేశద్వారం వద్ద వారికి హ్యాండ్ శానిటైజర్ ఇవ్వడం కనిపించింది.
ప్రభుత్వ పాఠశాలలు తెరుచుకున్నప్పటికీ, అనేక చోట్ల ప్రైవేట్ పాఠశాలలు మాత్రం పూర్తిస్థాయిలో రీఓపెన్ చేయలేదు. ఆఫ్‌లైన్ తరగతులు లేదా ఆన్‌లైన్ తరగతులు నిర్వహించాలా అనేదానిపై పూర్తి నిర్ణయం ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలకే హైకోర్ట్ కల్పించిన నేపథ్యంలో కొన్ని ప్రైవేట్ విద్యాసంస్థలు ఆన్‌లైన్ ద్వారానే తరగతులు కొనసాగించేందుకు నిర్ణయించినట్లు తెలిసింది.
ఇక, ప్రస్తుతం తెలంగాణలో గల కోవిడ్ కేసులను పరిశీలిస్తే.. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 71,402 మందికి చెందిన శాంపుల్స్ పరీక్షించగా కొత్తగా మరో 322 మందికి పాజిటివ్ అని తేలింది. ఇంకా 1,772 మంది శాంపుల్స్‌కు చెందిన రిపోర్ట్స్ రావాల్సి ఉందని పేర్కొన్నారు.
తాజాగా కన్ఫర్మ్ చేయబడిన కేసులను కలిపితే రాష్ట్రంలో మొత్తం COVID-19 బాధితుల సంఖ్య 6,58,376కి చేరుకుంది. ఈరోజు వరకు నమోదైన మొత్తం కేసుల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 76 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో కొత్తగా నమోదైన కేసుల వివరాలు కింద బులెటిన్ లో గమనించవచ్చు.
Telangana's COVID19 Bulletin:
నిన్న సాయంత్రం వరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 29 జిల్లాల నుంచి పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆరోగ్యశాఖ అందించిన రిపోర్ట్ ప్రకారం, ఈ ఒక్కరోజులో పాజిటివ్ కేసులు నమోదైన జిల్లాల వివరాలు ఇలా ఉన్నాయి.
గడిచిన 24 గంటల్లో మరో 3 కోవిడ్ మరణాలు సంభవించాయి. దీంతో రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 3,876కు పెరిగింది.
అలాగే సాయంత్రం వరకు మరో 331 మంది మంది కోవిడ్ బాధితులు పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 6,48,648 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 5,852 ఆక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.