Hyd, Sep 25: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపించే కొద్ది రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం వేడెక్కింది. ప్రధాని పార్టీలన్ని ఆకర్షణ మంత్రం వేస్తున్నాయి. తాజాగా బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు కాంగ్రెస్‌లో చేరేందుకు రంగం సిద్ధమైంది. ఈ నెల 27వ తేదీన ఢిల్లీకి వెళ్లి.. కాంగ్రెస్ మాజీ అధినేత్రి సోనియా గాంధీ సమక్షంలోనే ఆయన కండువా కప్పుకోనున్నారు. ఇదే విషయాన్ని ఆయన స్వయంగా తెలియశారు.
ఈనెల 27న సోనియా సమక్షంలో కాంగ్రెస్‌లో చేరుతున్నా. మల్కాజిగిరి, మెదక్ టికెట్ నాకు, నా కుమారుడికి, అలాగే.. మేడ్చల్ టికెట్ నక్కా ప్రభాకర్‌గౌడ్‌కు ఇవ్వమని కాంగ్రెస్ అధిష్టానాన్ని కోరాను. సర్వేల ఆధారంగా టికెట్ ఇస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ గాలికి పెద్ద వాళ్లు కొట్టుకుపోవడం ఖాయం అని మైనంపల్లి వ్యాఖ్యానించారు. మరోవైపు మైనంపల్లిని అఫీషియల్‌గా పార్టీలోకి ఆహ్వానించేందుకు సోమవారం మైనంపల్లి నివాసానికి కాంగ్రెస్ నేతలు క్యూ కట్టారు. అంజన్ కుమార్ యాదవ్, దామోదర రాజనరసింహ తదితరులు దూలపల్లిలోని మైనంపల్లి ఇంటికి చేరుకుంటున్నారు. బ్రేక్‌ఫాస్ట్ మీట్‌లో పాల్గొని చర్చలు జరిపారు.
ఇదిలా ఉంటే.. రెండ్రోజుల కిందట బీఆర్‌ఎస్‌కు మైనంపల్లి రాజీనామా ప్రకటించారు. తనకు మల్కాజ్‌గిరి, తన కొడుక్కి మెదక్ సీట్ల ఒప్పందంతోనే ఆయన కాంగ్రెస్‌లో చేరుతారనే ప్రచారం మొదటి నుంచి జరుగుతోంది. మైనంపల్లితోపాటు మరో నలుగురు బీఆర్ఎస్ కార్పొరేటర్లు కూడా కాంగ్రెస్ కండువా కప్పుకోబోతున్నట్టు సమాచారం. ఇప్పటికే మైనంపల్లితో కాంగ్రెస్ కీలక నేతలు దఫదఫాలుగా చర్చలు జరిపారు. చివరకు తండ్రీకొడుకులకు సీట్లు ఇచ్చేందుకు కాంగ్రెస్ అధిష్ఠానం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతోనే ఆయన ఆ పార్టీ తీర్థం పుచ్చుకునేందుకు రెడీ అయినట్టు తెలుస్తోంది.