Revanth Reddy: అందరూ ఇళ్లలో తెలంగాణ ఇచ్చిన సోనియమ్మ గుడి కట్టుకోవాలి, తెలంగాణ పీసీసీ అధ్యక్షునిగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం, అమరవీరుల ఆశయాలు నెరవేరాలంటే కాంగ్రెస్‌ అధికారంలోకి రావాలని కోరిన మల్కాజ్ గిరి ఎంపీ
Congress MP Revanth Reddy | File Photo

Hyderabad, July 7: తెలంగాణ పీసీసీ అధ్యక్షునిగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం ( Revanth Reddy takes charge as T PCC) చేశారు. అంతకుముందు రేవంత్‌ రెడ్డి బుధవారం ఉదయం తన నివాసం నుంచి ర్యాలీగా బయలుదేరి జూబ్లీహిల్స్‌లోని పెద్దమ్మ గుడికి చేరుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులు ఆశీర్వచనం అందించారు. తర్వాత అక్కడి నుంచి రేవంత్ ర్యాలీగా గాంధీభవన్‌కు చేరుకున్నారు.పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఆయన (Malkajgiri MP Revanth Reddy) గాంధీభవన్‌ వద్ద ఏర్పాటు చేసిన సభలో పార్టీ శ్రేణులనుద్దేశించి ప్రసంగించారు.

పోచమ్మ, ఎల్లమ్మ, లక్ష్మీనరసింహస్వామి దయతో పాటు సోనియమ్మ ఆశీస్సులతో ఈ పదవి చేపడుతున్నా. నాలుగు కోట్ల మంది ఆకాంక్షల మేరకు పనిచేయడానికే సోనియాగాంధీ నాకు ఈ బాధ్యత అప్పగించారు. నలుగురి చేతిలో 4 కోట్ల మంది బందీలయ్యారు. తెలంగాణలో స్వేచ్ఛ, స్వయం పాలన లేక పెద్ద దిక్కు లేకుండా పోయింది. తెలంగాణ ద్రోహులు గద్దెనెక్కి ఇష్టారీతిన ఆడుతున్నారు. కేసీఆర్‌ వచ్చాక ఎన్‌కౌంటర్లు, రైతుల ఆత్మహత్యలు ఆగలేదు. అమరవీరులు, ఉద్యమకారుల కుటుంబాలను తెరాస ఆదుకోలేదు. గులాబీ చీడను పొలిమేరలు దాటేవరకు తరమాలి. అమరవీరుల ఆశయాలు నెరవేరాలంటే కాంగ్రెస్‌ అధికారంలోకి రావాలి.

మిజోరాం గవర్నర్‌గా కంభంపాటి హరిబాబు, హర్యానాకు బదిలీ అయిన దత్తాత్రేయ, 8 రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను ప్రకటించిన కేంద్రం, ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్రపతి భవన్

రాహుల్‌ గాంధీ వంటి నాయకుడు మన సైన్యాన్ని ముందుండి నడిపిస్తారు. నిరుద్యోగులు, దళితులు, బడుగు బలహీన వర్గాలను తెరాస ప్రభుత్వం నయవంచనకు గురిచేసింది. ఏపీలో కాంగ్రెస్‌ చనిపోయినా ఫర్వాలేదని తెలంగాణ ఇస్తే.. సోనియా గాంధీకి కృతజ్ఞతలు తెలపాల్సిన అవసరం లేదా? మన తెలంగాణ తల్లి.. తెలంగాణ ఇచ్చిన సోనియమ్మ. నాలుగుకోట్ల మంది ప్రజలు తమ ఇళ్లలో సోనియమ్మ గుడి కట్టుకోవాలి. నాయకుల సందేశాన్ని గడప గడపకు తీసుకెళ్లాలి. ప్రశాంత్‌ కిశోర్‌(పీకే)ను సలహాదారుగా పెట్టుకోవాలని కొందరు సూచిస్తున్నారు. మంచిదే.. కానీ, పాదరసం లాంటి మా కార్యకర్తలే పీకేలు. ప్రతి కార్యకర్త కుటుంబ సభ్యులకు రెండేళ్లు సెలవు పెట్టాలి. రాష్ట్రం, దేశం కోసం పోరాడేందుకు కార్యకర్తలు ఇంట్లో అనమతి తీసుకోవాలి’’ అని రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు.

ఇదిలా ఉంటే రేవంత్‌రెడ్డి ప్రసంగం ప్రారంభం కాగానే కొందరు కార్యకర్తలు రేవంత్‌కు (Telangana Congress president) అనుకూలంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. గమనించిన రేవంత్‌ వారిని సున్నితంగా మందలించారు. వ్యక్తుల పరంగా ఎవరికీ స్లోగన్‌లు వద్దు... ధిక్కరించిన వారిని అవసరమైతే పార్టీ నుంచి సస్పెండ్‌ చేయిస్తానంటూ హెచ్చరించారు. సోనియా, రాహుల్‌ గాంధీల నినాదం మినహా మరో వ్యక్తి నినాదం చేస్తే ఎంతటి వారినైనా క్షమించమన్నారు. వ్యక్తిగతం వద్దు.. సమష్టిగా పోరాడదామంటూ పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి చేశారు. వ్యక్తిగత నినాదాలు ఇవ్వడం పార్టీకి తీరని నష్టమని వివరించారు. పార్టీ సమష్టి పోరాటాలతోనే అధికారం చేజిక్కించుకోగలమన్నారు. కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణికం ఠాగూర్‌, పీసీసీ మాజీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు, కార్యకర్తలు సభకు భారీగా తరలివచ్చారు.

ఈ కార్యక్రమానికి తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహాల ఇన్చార్జ్ మాణికం ఠాగూర్, ఏఐసీసీ ఇంచార్జ్ కార్యదర్శులు బోసురాజు, శ్రీనివాస్ కృష్ణన్, గోవా పీసీసీ అధ్యక్షుడు గిరీష్ చోడేకర్, అండమాన్ పీసీసీ అధ్యక్షుడు కులదీప్ శర్మ, ఎర్నాకులం ఎంపీ ఐబీ హెడెన్, ఏఐసీసీ జనరల్ సెక్రటరీ తారీక్ అన్వర్, ప్రచార కమిటి చైర్మన్ మధుయాష్కీ, వర్కింగ్ ప్రెసిడెంట్లు గీతారెడ్డి, అజారుద్దీన్, జగ్గారెడ్డి, మహేష్ గౌడ్, అంజన్ కుమార్ యాదవ్, టి.కాంగ్రెస్ నేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క, పొన్నాల లక్ష్మయ్య, దామోదర రాజనర్సింహ, జానారెడ్డి, వంశీచంద్ రెడ్డి, సంపత్ కుమార్, దాసోజు శ్రావణ్, మల్లు రవి, సీతక్క తదితరులు హాజరయ్యారు. కాగా కుమార్తె జయారెడ్డితో కలిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు రేవంత్‌ను అభినందించారు. ఇంకా ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున గాంధీభవన్‌కు తరలివచ్చారు.