Bhoiguda Fire Accident (Photo-ANI)

Hyd, Mar 23: సికింద్రాబాద్‎లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. బోయిగూడలోని ఓ ప్లాస్టిక్ గోదాంలో షార్ట్ సర్క్యూట్‎తో మంటలు (Bhoiguda Fire Accident) ఒక్కసారిగా ఎగిసిపడ్డాయి. తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో గోదాంలో మంటలు చెలరేగడంతో (Massive fire breaks out at scrap Godown) స్థానికులు భయబ్రాంతులకు గురయ్యారు. అయితే.. ప్రమాదవశాత్తు మంటల్లో చిక్కుకున్న 11 మంది కార్మికులు (11 Dead) అక్కడికక్కడే సజీవదహనమయ్యారు. మరొకరు చావు బతుకుల మధ్య పోరాడుతున్నారు.

గోడౌన్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో దట్టమైన పొగ కమ్ముకుంది. మంటల దాటికి గోడౌన్‌ పైకప్పు కూలింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 8 ఫైర్‌ ఇంజిన్‌లతో మంటలను అదుపులోకి తీసుకొచ్చింది. ప్రమాద ఘటనలో రెస్క్యూ ఆపరేషన్ ముగిసింది. మూడు గంటలు శ్రమించి పూర్తి స్థాయిలో మంటలను అదుపులోకి తీసుకొచ్చింది. ప్రమాదానికి షార్ట్‌ సర్క్యూట్‌ కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతులంతా బిహార్‌కు చెందినవారుగా గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ మార్చురీకి తరలించారు. గుర్తుపట్టలేని స్థితిలో మృతదేహాలు ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు.

బోయిగూడ అగ్ని ప్రమాద ఘ‌ట‌న‌పై సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి, మృతుల కుటుంబాలకు రూ. 5 ల‌క్ష‌ల చొప్పున ప‌రిహారం

కాగా శ్రవణ్ ట్రేడర్స్‌లో అగ్ని ప్రమాదం జరిగినట్లు రిజినల్ ఫైర్ అధికారి పాపయ్య మీడియాకు తెలిపారు. మొదట గోడౌన్‌ గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉదయం 3.10 నిమిషాలకు ప్రమాదం జరిగిందన్నారు. స్క్రాప్‌ వల్ల భారీగా మంటలు ఎగిసిపడ్డాయని తెలిపారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా లోపల ఉన్న సిలిండర్ బ్లాస్ట్ అవ్వడంతో ప్రమాద తీవ్రత పెరిగిందన్నారు. ఇప్పటి వరకు పదకొండు మృతదేహాలను వెలికి తీసినట్లు పేర్కొన్నారు. మంటల్లో చిక్కుకుని బయటకు రాలేకపోయారని, పొగ మంట వల్ల పదకొండు మంది చనిపోయారని అన్నారు.