CM KCR Press Meet Highlights (Photo-Twitter.CMO Telangana)

సికింద్రాబాద్‌లోని బోయిగూడ అగ్నిప్ర‌మాద ఘ‌ట‌న‌పై ముఖ్య‌మంత్రి కేసీఆర్ (CM KCR) తీవ్ర దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు. మృతుల కుటుంబాల‌కు ప్ర‌గాఢ సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాల‌కు రూ. 5 ల‌క్ష‌ల చొప్పున సీఎం ప‌రిహారం ప్ర‌క‌టించారు. మృత‌దేహాల‌ను బీహార్‌కు పంపించే ఏర్పాట్లు చేయాల‌ని ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సోమేశ్ కుమార్‌కు సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు.

బుధ‌వారం తెల్ల‌వారుజామున సికింద్రాబాద్‌లో బోయగూడ ఐడీహెచ్ కాలనీలోని టింబర్, తుక్కు డిపోలో జరిగిన ఈ ఘటనలో (Hyderabad Fire Accident) 11 మంది వ్యక్తులు సజీవ దహనమయ్యారు. ప్రమాద సమయంలో మొత్తం 12 మంది కార్మికులు (Bihar workers) ఉన్నారు. వీరంతా గత రాత్రి అందులోనే నిద్రపోయారు. ఉదయం షార్ట్‌సర్క్యూట్ కారణంగా డిపోలో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి.

ఈ ఘటనలో నిద్రిస్తున్న 12 మందిలో 11 మంది మంటల్లో చిక్కుకుని సజీవ దహనమయ్యారు. ఒక్కరు మాత్రం ప్రాణాలతో బయటపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు.

ఇప్పటి వరకు ఆరుగురి మృతదేహాలను వెలికి తీశారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. బాధితులను బీహార్‌కు చెందిన వలస కూలీలుగా గుర్తించారు. మృత‌దేహాల‌కు గాంధీ ఆస్ప‌త్రి మార్చురీలో పోస్టుమార్టం నిర్వ‌హిస్తున్నారు. గాయ‌ప‌డిన వ్య‌క్తికి కూడా గాంధీ ఆస్ప‌త్రిలోనే చికిత్స అందిస్తున్నారు.