Hyderabad, January 13: బర్డ్ ఫ్లూ వార్తల నేపథ్యంలో మంత్రులు తలసాని శ్రీనివాస యాదవ్ మరియు ఈటల రాజేంధర్‌లు ఆయా శాఖల కార్యదర్శులు, అధికారులు మరియు పౌల్ట్రీ పరిశ్రమకు చెందిన ప్రతినిధులతో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ లక్షణాలు లేవని స్పష్టం చేశారు. ఇతర రాష్ట్రాలలో బర్డ్ ఫ్లూ సోకినట్లు సమాచారం అందిన వేంటనే సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు పశుసంవర్ధక, వైద్య ఆరోగ్య శాఖలను అప్రమత్తం చేసి, రాష్ట్ర వ్యాప్తంగా 1300 రాపిడ్ రెస్పాన్స్ టీమ్ లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు, క్షేత్ర స్థాయిలో పరిస్థితులను సమీక్షిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
నల్గొండ, వరంగల్ , పెద్దపల్లి జిల్లాలలో కోళ్లు మృతి చెందినట్లు మీడియాలో వచ్చిన వార్తలకు ప్రభుత్వం వెంటనే స్పందించి 276 శ్యాంపిల్స్ ను సేకరించి పరీక్షలు చేయించగా , నెగెటివ్ రిపోర్ట్ వచ్చినట్లు తెలిపారు. అదేవిధంగా గత మూడు రోజులలో 1000 శ్యాంపిల్స్ పరీక్షించగా కూడా రిపోర్ట్స్ అన్నీ నెగెటివ్ వచ్చినట్లు తెలిపారు. చికెన్ , గుడ్లు తినడం వలన ఎటువంటి నష్టం జరగదని , శరీరానికి అవసరమయ్యే ప్రోటీన్లు లభిస్తాయని అన్నారు. తెలంగాణ నుంచి ఇతర రాష్ట్రాలు, దేశాలకు పౌల్ట్రీ ఉత్పత్తులను ఎగుమతి చేస్తున్నామని వెల్లడించారు. రాష్ట్రానికి వచ్చే వలస పక్షుల సంఖ్య చాలా పరిమితం అని, ఈ నేపథ్యంలో బర్డ్ ఫ్లూ లాంటివి రాష్ట్రంలో వ్యాప్తి చెందే అవకాశం ఉండదని మంత్రి తలసాని అభిప్రాయపడ్డారు.
రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేంధర్ మాట్లాడుతూ తెలంగాణ పౌల్ట్రీ ఇండస్ట్రీకి దేశంలోనే ప్రత్యేక గుర్తింపు ఉందని పేర్కొన్నారు. గతంలో బర్డ్ ఫ్లూ వలన పౌల్ట్రీ ఇండస్ట్రీ మాత్రమే నష్టపోయింది కానీ, మనుషులకు ఎక్కడ నష్టం జరగలేదని ఆయన గుర్తు చేశారు. మన శరీరానికి తక్కువ ఖర్చుతో అధిక విలువలువున్న ప్రోటీన్ లను అందించే శక్తి చికెన్ , గుడ్ల కు మాత్రమే ఉన్నదని ఈటల పేర్కొన్నారు. ఉడికించిన చికెన్ , గుడ్లతో నష్టం లేదని మంత్రి ఈటల రాజేంధర్ స్పష్టం చేశారు.