Hyderabad, May 26: ప్రధాని నరేంద్ర మోదీపై (Narendra Modi) తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు (Harish Rao)తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బీజేపీ(BJP) నేతలే విచ్ఛిన్నకర శక్తులు అని మండిపడ్డారు. మోదీ సిల్వర్ జూబ్లీ ఫంక్షన్‌కు వచ్చి చిల్లర మాటలు మాట్లాడిపోయారని విమర్శించారు. మోదీ ఆయన స్థాయికి తగిన మాటలు మాట్లాడలేదని హరీశ్‌రావు పేర్కొన్నారు. సిద్దిపేటలో హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు. నాడు తెలంగాణ రాష్ట్రం రాకుండా ఉద్యమాన్ని విచ్చిన్నం చేసింది కాంగ్రెస్ పార్టీ. మీ బీజేపీ పార్టీ ఒక ఓటు రెండు రాష్ట్రాలు అని చెప్పి అధికారంలోకి వచ్చే మోసం చేసే ప్రయత్నం చేశారు. తెలంగాణ ప్రజల మధ్య చిచ్చు పెట్టి ఈ రాష్ట్రాన్ని విచ్చిన్నం చేయాలని చూస్తున్నారు. ఓట్ల కోసం మతకల్లోల్లాలు సృష్టించాలని చూస్తున్నారు. బీజేపీ నేతలే విచ్ఛిన్నకర శక్తులు అని హరీశ్‌రావు (Harish Rao)పేర్కొన్నారు. హైదరాబాద్ పర్యటనలో తెలంగాణ ప్రజలకు మేలైన విషయాలు చెప్తారని ఆశించాం.. విభజన చట్టంలోని సమస్యలపై స్పందిస్తారని అనుకున్నాం.. కానీ అలాంటిదేమీ జరగలేదన్నారు.
కేసీఆర్‌ది కుటుంబ పార్టీ కాదు.. తెలంగాణే ఓ కుటుంబం అని హరీశ్‌రావు స్పష్టం చేశారు. తెలంగాణనే ఓ కుటుంబంగా భావించి పరిపాలించే నాయకుడు కేసీఆర్ అని తెలిపారు. తెలంగాణ గురించి మాట్లాడే హక్కు మోదీకి లేదు. ఎనిమిదేండ్లలో తెలంగాణకు మోదీ ఏం ఇచ్చారో చెప్పాలి. బీజేపీ అధికారంలోకి వస్తమనేది పగటి కలే. తెలంగాణలో మళ్లీ అధికారంలోకి వచ్చేది టీఆర్ఎస్ పార్టీ మాత్రమే. కుటుంబ రాజకీయాలపై మోదీ మాట్లాడటం సిగ్గుచేటుగా ఉందన్నారు హరీశ్‌రావు.
గతంలో రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు ఇవ్వాలని అడిగినప్పుడు టీఆర్ఎస్ పార్టీ మంచిపార్టీ. ఆ రోజు కుటుంబ పార్టీ కాదు. ఈ రోజు టీఆర్ఎస్ పార్టీ కుటుంబ పార్టీగా మీకు కనబడుతుందా? అని మంత్రి ప్రశ్నించారు. అమిత్ షా కుమారుడు బీసీసీఐకి సెక్రటరీ అయిండు. ఎలా అవుతాడు. ఆయనేమైనా క్రికెటర్‌రా? దానికి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? తమిళనాడులో డీఎంకేతో, ఏపీలో టీడీపీతో, పంజాబ్‌లో అకాలీదళ్‌తో పొత్తుపెట్టుకున్నప్పుడు.. అవి కుటుంబ పార్టీలు అని గుర్తుకు రాలేదా? మీ తప్పులు ఎత్తిచూపితే కుటుంబ పార్టీ అంటారా? అని హరీశ్‌రావు నిలదీశారు.