Hyd, July 26: తెలంగాణలో మంకీపాక్స్ వైరస్ కలకలం రేపిన సంగతి విదితమే. కువైట్ నుంచి కామారెడ్డికి (Kuwait to Kamareddy) వచ్చిన యువకుడికి మంకీపాక్స్ లక్షణాలు ఉన్నాయంటూ ఫీవర్ ఆస్పత్రిలో చేర్పించిన సంగతి తెలిసిందే. అయితే ఆయువకుడికి మంకీపాక్స్ నెగెటివ్‌గా (monkeypox Negative) నిర్ధారణ అయింది. పుణెలోని ఎన్ఐవీ ల్యాబ్‌లో బాధిత యువకుడి నమూనాలను పరీక్షించగా నెగెటివ్ అని తేలింది. నిన్న ఫీవర్ ఆస్పత్రిలో చేరిన యువకుడి నుంచి ఐదు రకాల నమూనాలను సేకరించి.. పుణె ల్యాబ్‌కు పంపినట్లు సూపరింటెండెంట్ డాక్టర్ శంకర్ వెల్లడించారు. ఆ రిపోర్ట్స్ నెగిటివ్ వచ్చాయని ఆయన తెలిపారు.
ఈ నెల 6వ తేదీన కువైట్ నుంచి వచ్చిన ఆ యువకుడు తీవ్ర నీరసానికి గురయ్యాడు. జ్వరంతో కామారెడ్డిలోని ఓ ప్రయివేటు హాస్పిటల్‌కు వెళ్లాడు. శరీరంపై ఉన్న దద్దుర్లు మంకీపాక్స్ మాదిరిగా ఉండటంతో నోడల్ కేంద్రంగా ఉన్న ఫీవర్ హాస్పిటల్‌కు వచ్చాడని డాక్టర్ శంకర్ పేర్కొన్నారు. మొత్తంగా బాధిత యువకుడికి మంకీపాక్స్ నెగెటివ్ అని నిర్ధారణ కావడంతో అటు వైద్యులు, ఇటు కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.
మంకీపాక్స్ గురించి ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని డాక్టర్ శంకర్ స్పష్టం చేశారు. లక్షణాలు ఉన్న వ్యక్తికి దగ్గరగా ఉన్న వారికే మంకీపాక్స్ సోకే అవకాశం ఉందన్నారు. గాలి ద్వారా మంకీపాక్స్ సోకదని, పెద్దగా దగ్గినప్పుడు వచ్చే తుంపర్ల ద్వారానే సోకే అవకాశం ఉందని స్పష్టం చేశారు. మంకీపాక్స్ లక్షణాలతో విదేశాల నుంచి వచ్చిన వారు సమాచారం ఇవ్వాలన్నారు. 6 నుంచి 13 రోజుల్లో వ్యాధి లక్షణాలు బయటపడుతాయని డాక్టర్ శంకర్ తెలిపారు.