
Hyderabad, Feb 3: తెలంగాణలో వికారాబాద్ జిల్లాలో వింత వ్యాధి కలకలం రేపుతోంది. అంతు చిక్కని జబ్బుతో (Vikarabad Mystery Disease) వందలాది కోళ్లు చనిపోతున్నాయి. ఈ మిస్టరీ వ్యాధి గ్రామస్తులను ఆందోళనకు గురి చేస్తోంది. కోళ్లతోపాటు కాకులు కూడా చనిపోవటంతో బర్డ్ ఫ్లూ భయంతో ప్రజలు వణికిపోతున్నారు. గత వారం రోజులుగా దారూర్ మండలం దోర్నాల, యాలాల మండలంలోని పలు గ్రామాల్లో భారీ సంఖ్యల్లో కోళ్లు చనిపోతున్నాయని (Mystery disease strikes Vikarabad in Telangana) అక్కడి వాసులు వాపోతున్నారు.
వాటిని పాతిపెట్టకుండా బయట పడేయడంతో అవి తిని కుక్కలు, కాకులు చనిపోతున్నాయి. దీంతో జిల్లాలోని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. వింత వ్యాధి విషయాన్ని పశు సంవర్ధక అధికారుల దృష్టి కి తీసుకెళ్లారు. విషయం తెలుసుకున్న అధికారులు గ్రామంలో శాంపిల్స్ ను సేకరించారు. గ్రామాల సరిహద్దుల్లో పశువుల కళేబరాల నుంచి ఆయిల్ ను సేకరించే ఫ్యాక్టరీలు ఉన్నాయని, వాటి నుంచి విడుదలయ్యే కలుషితాల వలన పక్షులు మృత్యువాత పడి ఉండొచ్చని అంటున్నారు. అధికారులు శాంపిల్స్ సేకరించి ల్యాబ్ లకు పంపారు. పూర్తి వివరాలు అందితేనేగాని నిర్ధారించలేమని అంటున్నారు.
ఇదిలా ఉంటే గత నెలలో వికారాబాద్ జిల్లాలో 45 మంది ఉన్నట్లుండి అస్వస్థతకు గురయ్యారు. వికారాబాద్ మండలం ఎర్రవల్లి, నవాబుపేట్ మండలం చిట్టిగిద్దలో పలువురు కళ్లుతిరిగి పడిపోయారు. చికిత్స పొందుతూ ఒకరు మృతి చెందారు. అంతుచిక్కని వ్యాధే (Vikarabad Mysterious Disease) కారణమని అక్కడి ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. వికారాబాద్ ఎమ్మెల్యే ఆనంద్‌కు స్థానికులు సమాచారం ఇచ్చారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే ఆనంద్వికారాబాద్ డీఎంహెచ్‌వోతో మాట్లాడారు. ఎర్రవల్లి, చిట్టిగిద్దలో తక్షణమే వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని ఎమ్మేల్యే సంబంధిత అధికారులకు సూచించారు. కల్తీ కల్లు తాగడం వల్లే అస్వస్థతకు గురయ్యారని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేశారు.