Nagarjuna Sagar, April 17: నాగార్జునసాగర్ నియోజకవర్గ ఉపఎన్నిక పోలింగ్ (Nagarjuna Sagar By Election 2021) ఉదయం 7 గంటల నుంచి ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయాన్నే ఓటర్లంత పోలింగ్ కేంద్రాల కు బారులు తీరారు. 2లక్షల 20 వేల 300 మంది ఓటర్లు ఉన్న సాగర్ నియోజకవర్గంలో మొత్తం 346 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోన్న నేపథ్యంలో ఓటు వేసేందుకు మాస్క్ తప్పనిసరి నిబంధన చేశారు. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు పోలింగ్ జరగనుంది.
సాగర్ నియోజకవర్గంలో (Sagar By Election 2021) 2లక్షల 20 వేల300 మంది ఓటర్లు ఉండగా లక్ష 9వేల 228 మంది పురుషులు, లక్షా11 వేల72 మంది మహిళలు తమ ఓటు హక్కును వినియోగించుకొనున్నారు. మొత్తం 41 మంది అభ్యర్థులు బరిలో ఉన్నప్పటికీ, ప్రధాన పార్టీలైన తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్), కాంగ్రెస్, బీజేపీలే తొలి మూడు స్థానాల్లో ఉండనున్నాయి.
కరోనా ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో గతంలో ఎన్నడూ లేనివిధంగా కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) పోలింగ్ సమయాన్ని రెండు గంటలపాటు పొడిగించింది. టీఆర్ఎస్ పార్టీ తరఫున నోముల భగత్ పోటీలో ఉన్నారు.కాంగ్రెస్ పార్టీ నుంచి జానారెడ్డి ఎన్నికల బరిలో ఉన్నారు. బీజేపీ వ్యూహాత్మకంగా జనరల్ స్థానమైన నాగార్జున సాగర్‌లో ఎస్టీ వర్గానికి చెందిన డాక్టర్ రవికుమార్ నాయక్‌ను బరిలోకి దింపింది.
నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో 9 గంటల వరకు 9.8% పోలింగ్ నమోదయ్యిందని అధికారులు వెల్లడించారు. కొన్ని ప్రాంతాల్లో ఆలస్యంగా పోలింగ్ ప్రారంభమవ్వగా.. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండానే పోలీసుల భారీ బందోబస్తు నడుమ ప్రశాంతంగానే ఓటింగ్ జరుగుతోంది. అయితే గత అసెంబ్లీ ఎన్నికల కంటే ఈ ఉప ఎన్నికలో పోలింగ్ శాతం పెరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయని తెలుస్తోంది.
ఇబ్రహీంపేటలోని పోలింగ్ బూత్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ ఓటేశారు. క్యూలైన్‌లో నిల్చుని భగత్.. తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. మరోవైపు.. సాగర్‌లోని పలు కేంద్రాల్లో ఆలస్యంగా పోలింగ్ ప్రారంభమైంది. ఇప్పటి వరకూ నియోజకవర్గంలో ఎక్కడా కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోలేదు. భారీ బందోబస్తు పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగానే సాగుతోంది.
నల్గొండ జిల్లా త్రిపురారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని బూత్ నెంబర్ 265లో ఈవీఎంలు మొరాయించాయి. దీంతో ఇంకా పోలింగ్ ప్రారంభం కాలేదు. పోలింగ్ కేంద్రంకు వచ్చిన ఓటర్లంతా తీవ్ర అసంతృప్తికి లోనవుతున్నారు. రంగంలోకి దిగిన పోలింగ్ అధికారులు ఈవీఎంలను పరిశీలిస్తున్నారు.