Hyd, Oct 11: తెలంగాణలో నల్గొండ జిల్లాలో విషాదం (Nalgonda Tragedy) చోటు చేసుకుంది. ఆ జిల్లాలో గుర్తుతెలియని వాహన రూపంలో వచ్చిన మృత్యువు ఆ కొడుకుని బలి తీసుకోగా, కొడుకు మృతిని తట్టుకోలేక తండ్రి కుప్పకూలి (Father dies of heart attack) పోయాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మిర్యాలగూడ మండలం తడకమళ్ల గ్రామానికి చెందిన గొర్ల ఇంద్రారెడ్డి(52), సుజాత దంపతులకు కుమారుడు భరత్‌రెడ్డి (30), కుమార్తె ఉన్నారు. ఇద్దరికి వివాహాలు కాగా, భరత్‌రెడ్డి తన భార్య స్నేహ, కుమారుడు, కుమార్తెతో కలిసి కొంతకాలంగా మిర్యాలగూడ పట్టణంలోని చైతన్యనగర్‌లో నివాసం ఉంటున్నాడు.
భరత్‌రెడ్డి ఆదివారం సాయంత్రం తన ద్విచక్రవాహనంపై మాడుగులపల్లి మండలం బొమ్మకల్లుకు వెళ్లాడు. అక్కడ పనులు ముగించుకుని తిరుగు ప్రయాణమయ్యాడు.మార్గమధ్యలో వేములపల్లి మండలం శెట్టిపాలెం శివారుకు చేరుకోగానే వెనుకనుంచి వచ్చిన గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ప్రమాదంలో భరత్‌రెడ్డి తలకు బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే దుర్మరణం (son dies in accident) చెందాడు. రోడ్డు ప్రమాదంలో కుమారుడు మృతిచెందిన విషయం తెలుసుకున్న తండ్రి గొర్ల ఇంద్రారెడ్డి వెంటనే ఘటన స్థలానికి చేరుకున్నాడు.
కొడుకు మృతదేహాన్ని చూసి గుండెలవిసేలా రోదిస్తూనే కుప్పకూలిపోయాడు. అతడిని చికిత్స నిమిత్తం మిర్యాలగూడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకురాగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. నిమిషాల వ్యవధిలోనే తండ్రీకుమారుడు మృతిచెందడంతో కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. పెద్ద సంఖ్యలో ఆస్పత్రికి చేరుకోవడంతో ఆవరణలో అందరి ముఖాల్లో విషాదఛాయలు కనిపించాయి. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు వేములపల్లి ఎస్‌ఐ డి. రాజు తెలిపారు.
ఇంద్రారెడ్డి సీపీఎం నాయకుడు కావడంతో ఆయన ఇంటి వద్దకు ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. దుఃఖసాగరంలో మునిగిన కుటుంబ సభ్యులు, బంధువులను ఓదార్చి పరామర్శించారు. వారిలో మాజీ ఎమ్మెల్యే, సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు డబ్బీకార్ మల్లేష్, నాయకులు వీరేపల్లి వెంకటేశ్వర్లు, వేములపల్లి వైస్ ఎంపీపీ పాదూరి గోవర్ధనిశశిధర్‌రెడ్డిలతో పాటు వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు తదితరులున్నారు.