Hyderabad, FEB 19: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డికి ( Padi Kaushik Reddy) జాతీయ మహిళా కమిషన్ నోటీసులు (NCW issues Notice ) ఇచ్చింది. తెలంగాణ గవర్నర్ తమిళిసై (Telangana Governor) పై చేసిన వ్యాఖ్యలను సుమోటోగా తీసుకున్న జాతీయ మహిళా కమిషన్ ఈ నెల 21న ఢిల్లీలోని కమిషన్ ముందు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది. గవర్నర్ పై కౌశిక్ రెడ్డి (Kaushik Reddy) చేసిన వ్యాఖ్యలపై మహిళా కమిషన్ సీరియస్ అయ్యింది. ఆయనకు నోటీసులు ఇచ్చింది. తెలంగాణలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, సీఎం కేసీఆర్ (CM KCR) మధ్య చాలా కాలంగా విభేదాలు ఉన్నాయి. చాలా సందర్భాల్లో గవర్నర్ తీరుపై బీఆర్ఎస్ నేతలు బహిరంగంగానే విమర్శలు గుప్పించారు. అటు, ప్రభుత్వ వైఖరిని గవర్నర్ సైతం తప్పుపట్టారు. తనకు సరైన గౌరవం ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ క్రమంలోనే కౌశిక్ రెడ్డి ఇటీవల మాట్లాడుతూ.. గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ, కౌన్సిల్‌లో పాస్ చెసిన బిల్లుల ఫైళ్లను ఇప్పటిదాకా గవర్నర్ ఎందుకు క్లియర్ చేయడం లేదంటూ ప్రశ్నించే క్రమంలో కౌశిక్ రెడ్డి అనుచిత పదజాలాన్ని వినియోగించారు. దీనిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. కౌశిక్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ వినిపిస్తోంది. కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి బీజేపీ శ్రేణులు. నిరసన కార్యక్రమాలు కూడా చేపట్టాయి.
కౌశిక్ రెడ్డిపై గత నెల 28న బీసీ పొలిటికల్ జేఏసీ.. రాష్ట్ర మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేసింది. గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్‌పై కౌశిక్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారని.. ఆయనను బర్తరఫ్ చేయాలని బీసీ పొలిటికల్ జేఏసీ నేతలు డిమాండ్ చేశారు. కౌశిక్ రెడ్డిపై క్రిమినల్ కేసు నమోదు చేసేలా డీజీపీకి అదేశాలివ్వాలని కోరారు. గవర్నర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేయడం ద్వారా కౌశిక్ రెడ్డి రాజ్యాంగ పదవిని అగౌరవ పరిచాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా ఉండాలంటే కౌశిక్ రెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న కౌశిక్ రెడ్డి.. గవర్నర్ పై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. గవర్నర్ ఏ రాజ్యాంగాన్ని పాటిస్తున్నారంటూ కౌశిక్ రెడ్డి ప్రశ్నించారు. అసెంబ్లీ, కౌన్సిల్‌లో పాస్ చేసిన బిల్లుల ఫైళ్లను ఇప్పటిదాకా గవర్నర్ తన సీటు కింద పెట్టుకొని కూర్చుంటారా.. అంటూ అనుచిత పదజాలాన్ని ఎమ్మెల్సీ ఉపయోగించారు.