Hyderabad, December 23: యునైటెడ్ కింగ్‌డమ్‌లో వేగంగా విస్తరిస్తున్న SARS-CoV-2 యొక్క కొత్త జాతి 'B 1.1.7' వైరస్ పట్ల తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. గత నెల నవంబర్ 25 నుండి విదేశాల నుంచి రాష్ట్రానికి చేరుకున్నఅంతర్జాతీయ ప్రయాణికులందరినీ గుర్తించడానికి భారీ నిఘా డ్రైవ్‌ను ఆరోగ్య శాఖ ప్రారంభించింది. ఈ ప్రయత్నాల్లో భాగంగా, డిసెంబర్ 15 మరియు 22 మధ్య యుకె నుండి నేరుగా హైదరాబాద్ చేరుకున్న 358 మంది ప్రయాణికులను జిల్లా నిఘా బృందాలు గుర్తించాయి. వీరందరికీ ఆర్టీ-పిసిఆర్ పరీక్షలు నిర్వహించడంతో పాటు ప్రత్యేక ఐసోలేషన్ కేంద్రంలో ఉంచి చికిత్స చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
కాగా, బ్రిటన్ నుంచి వచ్చిన వారిలో ఇద్దరికీ కరోనా ఉన్నట్లు నిర్ధారణ అయింది. అయితే కొత్తరకం కరోనా జన్యువు లక్షణాలు ఏమైనా ఉన్నాయా? అని తెలుసుకునేందుకు వీరి శాంపుల్స్ ను పుణెలోని వైరాలజీ ల్యాబ్ కు పంపించారు.
ఇదిలా ఉంటే, రాష్ట్రంలో ప్రతిరోజు నమోదయ్యే కేసుల విషయానికి వస్తే, గత 24 గంటల్లో 45,609 మందికి చెందిన శాంపుల్స్ పరీక్షించగా కొత్తగా మరో 635 మందికి పాజిటివ్ అని తేలింది. అయితే ఇంకా 766 మంది శాంపుల్స్ కు చెందిన రిపోర్ట్స్ రావాల్సి ఉందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 65,66,602 మందికి టెస్టులు నిర్వహించినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ పేర్కొంది.
తాజాగా కన్ఫర్మ్ చేయబడిన కేసులను కలిపితే రాష్ట్రంలో మొత్తం COVID-19 బాధితుల సంఖ్య 282,982కి చేరుకుంది. నిన్నటి వరకు నమోదైన మొత్తం కేసుల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 115 మందికి కోవిడ్ సోకినట్లు నిర్ధారణ కాగా, రంగారెడ్డి నుంచి 57, మేడ్చల్ నుంచి 49, వరంగల్ అర్బన్ నుంచి 39 మరియు ఖమ్మం నుంచి 35 కేసుల చొప్పున నిర్ధారించబడ్డాయి. రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో కొత్తగా నమోదైన కేసుల వివరాలు కింద బులెటిన్ లో గమనించవచ్చు.
మరోవైపు గత 24 గంటల్లో మరో 4 కొవిడ్ మరణాలు సంభవించాయి. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 1,522కు పెరిగింది.
అలాగే, బుధవారం సాయంత్రం వరకు మరో 573 మంది మంది కొవిడ్ బాధితులు పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 274,833 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 6,627 ఆక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.