Y Category Security for MP Dharmapuri Arvind: బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్‌కు వై కేటగిరి భద్రత, ఇప్పటికే ఈటెలకు వై ప్లస్‌ కేటగిరి భద్రత
Dharmapuri Arvind (Photo-Video Grab)

Hyd, July 11: ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో వరుసగా చోటుచేసుకుంటున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో.. నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్‌కు కేంద్ర ప్రభుత్వం ‘వై’ కేటగిరి భద్రత కల్పిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.ఇక నుంచి అర్వింద్‌ కాన్వాయ్‌లో ముగ్గురు, ఇంటి వద్ద ఐదుగురు సీఆర్‌పీఎఫ్‌ కమాండోలు భద్రతా వలయంగా ఉండనున్నారు. మొత్తం 8 మంది కమాండోలు ఎంపీకి నిరంతరం రక్షణగా ఉండనున్నారు. ఇటీవల బీజేపీ ఎన్నికల కమిటీ చైర్మన్‌ ఈటల రాజేందర్‌కు కేంద్ర ప్రభుత్వం ‘వై ప్లస్‌’ కేటగిరి భద్రత కల్పించింది. తర్వాత కేంద్రం తాజాగా ఎంపీ అర్వింద్‌కు భద్రత కల్పించడం ప్రాధాన్యత సంతరించుకుంది.

ఎంపీ అర్వింద్‌కు ‘వై’ కేటగిరి భద్రత నేపథ్యంలో ఆయన దేశంలో ఎక్కడ పర్యటించినా అందుకు సంబంధించిన ప్రతి అంశాన్ని కేంద్ర హోంశాఖ కు పంపాల్సి ఉంటుంది. అక్కడి నుంచి రాష్ట్ర డీజీపీకి పర్యటన వివరాలు అందుతాయి. దీంతో ఎంపీ పర్యటన సందర్భంగా భద్రత కల్పించే వ్యవహారాలను డీజీపీ నేరుగా పర్యవేక్షించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఎంపీ పర్యటన నేపథ్యంలో చిన్న ఘటన చోటుచేసుకున్నా సంబంధిత జిల్లా, క్షేత్రస్థాయి అధికారులపై డీజీపీ చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది.

బీజేపీ విద్వేష రాజకీయం చేస్తోంది, యూసీసీ బిల్లును పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేసిన సీఎం కేసీఆర్

ఇదిలా ఉంటే నిజామాబాద్‌ ఎంపీ తన నియోజకవర్గ పరిధిలో పర్యటించిన సందర్భంగా వరుసగా మూడు సార్లు బీజేపీ, బీఆర్‌ఎస్‌ శ్రేణుల మధ్య తీవ్ర ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఇరుపార్టీలకు చెందిన పలువురు కార్యకర్తలు, పోలీసు సిబ్బంది తీవ్ర గాయాలపాలయ్యా రు. డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు, ఇతర అంశాలపై బీజేపీ ఆందోళనలు చేస్తే, ప్రతిగా టీఆర్‌ఎస్‌ శ్రేణులు పసుపు బోర్డు విషయంలో ఆందోళనలు చేస్తూ ఎంపీ అర్వింద్‌ను అడ్డుకుంటూ వచ్చాయి.

ఇందల్వాయి మండలం గన్నారం, ధర్పల్లి మండల కేంద్రంలో, భీమ్‌గల్‌ మండలం బాబాపూర్‌లో ఉపాధ్యాయురాలు మరణించిన సందర్భంలో, ఆర్మూర్‌ మండలం ఇస్సాపల్లి ప్రాంతంలో ఎంపీ అర్వింద్‌ పర్యటన నేపథ్యంలో రెండు పార్టీల మధ్య ఘర్షణలు చోటుచేసుకుని ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇరు పార్టీ లకు చెందిన పలువురు కార్యకర్తలు గాయపడ్డారు.ఎంపీ కారు అద్దాలు సైతం బీఆర్‌ఎస్‌ శ్రేణులు పగులగొట్టాయి.

తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సీతక్కను సీఎం చేస్తాం, రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..

ఈ విషయంలో పోలీసులు టీఆర్‌ఎస్‌కు సహకరించి తన భద్రతను గాలికొదిలేశారని అర్వింద్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో నిజామాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌పై పార్లమెంట్‌ ప్రివిలేజ్‌ కమిటీకి ఎంపీ ఫిర్యాదు చేశారు. తర్వాత కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను కలిశారు.అధికారికంగా హోంశాఖ నుంచి భద్రత కల్పించే విషయంలో ఆలస్యమయ్యే నేపథ్యంలో అమిత్‌షా కార్యాలయం సూచనల మేరకు ఎంపీ వీఆర్‌ఎస్‌ తీసుకున్న బ్లాక్‌క్యాట్‌ కమెండో, బీఎస్‌ఎఫ్‌ జవాన్‌లతో పాటు నలుగురు మార్షల్స్‌ను తన భద్రత కోసం నియమించుకున్నారు.

అలాగే ఒక కిలోమీటర్‌ రేడియస్‌లో పనిచేసే విధంగా 5 వాకీటాకీలు, మూడు ప్రత్యేక వాహనాలు, అడ్వాన్స్‌డ్‌ వెపన్స్‌ను ఏర్పాటు చేసుకున్నారు. ఇక ప్రస్తుతం ఎన్నికలు రానున్న నేపథ్యంలో ‘వై’ కేటగిరి భద్రత కల్పించడం గమనార్హం. ఎన్నికల నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ వాళ్లు దాడులకు దిగితే తూటాలు దిగడం ఖాయమని ఎంపీ అర్వింద్‌ పేర్కొన్నారు.