Hyderabad, Mar 22: తెలంగాణలో కరోనా కేసులు ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు కీలక వ్యాఖ్యలు చేశారు. కరోనా కేసులు పెరుగుతున్న తీరును చూస్తుంటే రాష్ట్రంలో సెకండ్ వేవ్ (Coronavirus Second wave) ప్రారంభమైందని చెప్పవచ్చని అన్నారు. అయితే కరోనా కట్టడికి గత ఏడాది ఎలాంటి చర్యలను చేపట్టామో... మళ్లీ అలాంటి చర్యలనే ప్రారంభించామని చెప్పారు. తెలంగాణలో లాక్‌డౌన్, కర్ఫ్యూ ప్రపోజల్ లేదని ఆయన (Health director Dr G Srinivas Rao) తెల్చిచెప్పారు.
సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విద్యాసంస్థల్లో కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయని చెప్పారు. విద్యార్థుల ద్వారా ఇంట్లోని వృద్ధులు.. దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారికి ప్రమాదమని హెచ్చరించారు. కేసుల పెరుగుదల చూస్తే కరోనా సెకండ్ వేవ్ అని చెప్పాలని అన్నారు. గత ఏడాది ఏ చర్యలు చేపట్టామో ఇప్పుడూ అవే చర్యలు చేపడతామని డీహెచ్‌వో శ్రీనివాస్ పేర్కొన్నారు.రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నాలకు ప్రజల మద్దతు కావాలని అన్నారు. ప్రతి ఒక్కరూ విధిగా మాస్కులను ధరించాలని సూచించారు. వ్యాక్సిన్ కు అర్హులైన ప్రతి ఒక్కరూ దాన్ని తీసుకోవాలని చెప్పారు. టీకా వల్ల కరోనా తీవ్రత ఎక్కువ కాకుండా చూడొచ్చని అన్నారు.
స్కూళ్లలో కరోనా కేసులు వస్తుండటంతో... మళ్లీ లాక్ డౌన్, రాత్రి కర్ఫ్యూ పెడతారనే ప్రచారం జరుగుతోందని.. అయితే, అలాంటి ప్రపోజల్ ఇంత వరకు పెట్టలేదని చెప్పారు. విద్యా సంస్థల్లో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయని... విద్యార్థుల వల్ల ఇంట్లో ఉన్న వృద్ధులకు, దీర్థకాలిక వ్యాధులు ఉన్నవారికి ప్రమాదం పొంచి ఉందని అన్నారు.
రాష్ట్రంలో మళ్లీ లాక్ డౌన్లు, నైట్ కర్ఫ్యూలు విధించబోతున్నారనే ప్రచారం పెద్ద ఎత్తున సాగుతున్న నేపథ్యంలో రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ, పొరుగు రాష్ట్రం మహారాష్ట్రలో కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ... తెలంగాణలో వీకెండ్ లాక్ డౌన్లు, రాత్రి కర్ఫ్యూలను విధించే అవకాశమే లేదని (No lockdown plan in Telangana) చెప్పారు. లాక్ డౌన్ అనేది ప్రజల జీవితాలపై చెడు ప్రభావాన్ని చూపుతుందని అన్నారు. అనేక మంది జీవితాలు, వ్యాపారాలు ప్రభావితమవుతాయని చెప్పారు. కేసులు పెరగకుండా ప్రజలే జాగ్రత్తలు తీసుకోవాలని, ముఖ్యంగా హైదరాబాద్ ఓల్డ్ సిటీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. పాఠశాలలు, మదర్సాలు పని చేయాలా? వద్దా? అనే విషయంలో ప్రభుత్వం ఒకట్రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు.